దసపల్లా భూములు ప్రభుత్వానివే

దసపల్లా భూములు కచ్చితంగా ప్రభుత్వానివేనని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు స్పష్టంచేశారు. వాటిని దక్కించుకునేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తుండగా, ఈ నాటికి నెరవేరుతున్నాయన్నారు. ‘ఇప్పటికైనా మించిపోలేదు. ఈ భూములకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుని న్యాయస్థానంలో నిరూపించగలిగితే ప్రభుత్వానికే విజయం లభిస్తుంది’ అని సూచించారు.

Updated : 04 Oct 2022 07:41 IST

దస్త్రాలు మోసపూరితమైనవని నిరూపించగలిగితే చాలు
చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే సాధ్యం
విశ్రాంత సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు  

ఈనాడు, అమరావతి: దసపల్లా భూములు కచ్చితంగా ప్రభుత్వానివేనని విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు స్పష్టంచేశారు. వాటిని దక్కించుకునేందుకు ఎప్పట్నుంచో ప్రయత్నిస్తుండగా, ఈ నాటికి నెరవేరుతున్నాయన్నారు. ‘ఇప్పటికైనా మించిపోలేదు. ఈ భూములకు సంబంధించిన దస్త్రాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుని న్యాయస్థానంలో నిరూపించగలిగితే ప్రభుత్వానికే విజయం లభిస్తుంది’ అని సూచించారు. దీన్ని ఒక మిషన్‌ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని, సుప్రీంకోర్టును ఒప్పించి... వ్యాజ్యాలను మళ్లీ తొలి నుంచి ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తేనే ఇది సాధ్యమవుతుందని గుర్తుచేశారు. దసపల్లా వివాదంపై సోమవారం ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ... ‘ఈ భూములపై ప్రభుత్వం తరపున మొదట్నుంచి సరైన దస్త్రాలు తయారు చేయలేదు. న్యాయస్థానాల్లోనూ పటిష్ఠమైన వాదనలు విన్పించలేదు. అందుకే ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి’ అని  వివరించారు.

భూములు దక్కించుకునేందుకు దీర్ఘకాల వ్యూహం

‘ప్రభుత్వ భూములపై కన్నేసే ఆక్రమణదారుల వ్యూహం దీర్ఘకాలంతో కూడినదై ఉంటుంది. అధికారులు, రాజకీయ నేతలు తమకు అనుకూలంగా ఉంటే ముందుకు వెళతారు. అడ్డుపడుతున్నారంటే కొన్నాళ్లు వాయిదా వేసుకుంటారు. అవకాశముంటే వారిని తొలగించి తమకు కావల్సిన వారిని అక్కడికి తెచ్చుకుంటారు’ అని ఐవైఆర్‌ వివరించారు. ‘ఈ భూముల విషయంలో హక్కు(టైటిల్‌) అనేదే ముఖ్యం. ప్రభుత్వాలు సరిగా వ్యవహరిస్తే చేజారి ఉండేవి కావు. అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌(యూఎల్‌సీ) అనే అంశంపై పోరాడినా ఫలితం ఇదే తీరున ఉండేది’ అని అభిప్రాయపడ్డారు. ‘నేను సీసీఎల్‌ఏగా ఉన్న సమయంలో అక్కడి కలెక్టర్‌తో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేయించాం. ఫలితం లేకపోయింది. ఈ భూముల విషయమై ఒక తహసీల్దార్‌ను కూడా సస్పెండ్‌ చేశా. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత కూడా ఈ భూముల వ్యవహారాన్ని పర్యవేక్షించా’ అని వివరించారు.
 

గతంలో తితిదే కేసులో లభించిన విజయం

‘న్యాయస్థానాల్లో తీర్పు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా వచ్చినా.. సంబంధిత దస్త్రాలు మోసపూరితమైనవని నిరూపించగలిగితే కోర్టులో మళ్లీ వ్యాజ్యం వేసి విజయం సాధించే అవకాశం ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక భూమి విషయమై ఇలాగే విజయం లభించింది. తిరుమలలో కొందరు ప్రభుత్వ భూమిపై పట్టా తెచ్చుకుంటే... సంబంధిత పత్రాలు మోసపూరితమైనవని సుప్రీంకోర్టులో నిరూపించారు. తర్వాత సివిల్‌ కోర్టులో దీనిపై మళ్లీ మొదట్నుంచి వ్యాజ్యం నడిపిస్తే తీర్పు తితిదేకు అనుకూలంగా వచ్చింది’ అని ఐవైఆర్‌ గుర్తుచేశారు. ‘హైదరాబాద్‌ శివార్లలోని భూములకు సంబంధించి కూడా సినీరంగానికి సంబంధించిన వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ పత్రాలు మోసపూరితమైనవని, అలాంటప్పుడు భూమిపై హక్కు ఉండదని న్యాయవాది హైకోర్టులో వాదించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రత్యేక ఎస్‌ఎల్‌పీ(స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌) వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ కూడా అలాగే చేయవచ్చు’ అని సూచించారు.

లేపాక్షిలో భూముల తనఖాకు వీలు కల్పించి.. డబ్బులు కొట్టేశారు

లేపాక్షి భూముల విషయంలో తనఖాకు వీలుగా నిబంధనలు సృష్టించడంతోనే... వాటిపై రుణాలు తీసుకుని డబ్బులు కొట్టేశారని కృష్ణారావు ఆరోపించారు. ‘రాజకీయ నేతలకు స్వార్థ ప్రయోజనాలు ఉంటాయి. తాకట్టుకు వీలులేదనే నిబంధన ఉంటే.. సంబంధిత సంస్థకు బ్యాంకు నుంచి సొమ్ములు వచ్చేవే కాదు. అవసరమైతే సంబంధిత సంస్థలు ప్రాజెక్టుపై రుణాలు తెచ్చుకోవచ్చు. పరిశ్రమలకు భూమి కేటాయింపు సమయంలోనే.. తాకట్టుకు వీలు లేదనే నిబంధనను మంత్రివర్గం ఆమోదించాల్సిన అవసరం ఉంది. దీనికోసం గతంలో నేను ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే’ అని స్పష్టం చేశారు. ‘కేటాయించిన భూమిలో పరిశ్రమ ఏర్పాటు చేయకున్నా, వినియోగించకపోయినా గతంలో మంత్రివర్గమే మళ్లీ వాటిని రద్దు చేయాల్సి వచ్చేది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ భూముల రద్దు అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగించాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని