Chiranjeevi: తమ్ముడికి పరిపాలించే అవకాశం వస్తుందేమో!

‘పవన్‌కల్యాణ్‌ నిబద్ధత, నిజాయతీ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు రావాలి. భవిష్యత్తులో తమ్ముడికి పరిపాలించే అవకాశం వస్తుందేమో’ అని ప్రముఖ కథానాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి వ్యాఖ్యానించారు.

Updated : 05 Oct 2022 06:55 IST

భవిష్యత్తులో నా మద్దతు పవన్‌కే: చిరంజీవి 

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ‘పవన్‌కల్యాణ్‌ నిబద్ధత, నిజాయతీ నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు రావాలి. భవిష్యత్తులో తమ్ముడికి పరిపాలించే అవకాశం వస్తుందేమో’ అని ప్రముఖ కథానాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి వ్యాఖ్యానించారు. తను నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘నా మద్దతు తమ్ముడికే అని ఎప్పుడూ అనలేదు. కానీ... భవిష్యత్తులో మాత్రం చెప్పలేను’ అంటూ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకి బదులిస్తూ ‘రాజకీయాల నుంచి నేను నిష్క్రమించి తటస్థంగా ఉండటంతోనే నా తమ్ముడికి మేలు జరుగుతుందని ఇదివరకు చెప్పానేమో తెలియదు. పవన్‌కల్యాణ్‌ది కలుషితం కాని వ్యక్తిత్వం. అలాంటివాడు రావాలనేది నా ఆకాంక్ష. దానికి కచ్చితంగా నా సహకారం ఉంటుంది. నేను ఏ పక్షాన ఉంటాననేది భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారు. రాజకీయాల్లో మేమిద్దరం తలోవైపు ఉండటం కంటే నేను తప్పుకోవడంతోనే తమ్ముడు పెద్ద నాయకుడిగా ఎదుగుతాడని నమ్మాను. ఏమో...! పరిపాలించే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో? అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా’ అని చిరంజీవి ఆకాంక్షించారు. రాజకీయంగా మీ తమ్ముడికి గాడ్‌ఫాదర్‌ మీరేనా? అన్న ప్రశ్నకు బదులిస్తూ... ‘ఆ మాట తమ్ముడు చెబితే అందంగా ఉంటుంది’ అన్నారు.


అన్నయ్య ఆశీస్సులతో తమ్ముడు తప్పక పాలన పగ్గాలు చేపడతారు: నాగబాబు

ఈనాడు, అమరావతి: ‘మేమిద్దరం చెరోవైపు ఉండడం కంటే, నేను వైదొలిగితే తమ్ముడు మరింత బలపడతాడని రాజకీయాల నుంచి తప్పుకున్నా’ అని అన్నయ్య చెప్పిన మాటలు కోట్ల మంది తమ్ముళ్ల మనసులు గెలుచుకున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, చిరంజీవి సోదరుడు కొణిదెల నాగబాబు అన్నారు. పవన్‌కల్యాణ్‌ పరిపాలన పగ్గాలు చేపట్టాలనే అన్నయ్య ఆకాంక్ష తప్పక నెరవేరుతుందని మంగళవారం రాత్రి విడుద[ల చేసిన ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. జన సైనికులుగా తామంతా ఆ మహత్కార్యాన్ని నెరవేర్చి చూపిస్తామని నాగబాబు స్పష్టంచేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని