సంక్షిప్త వార్తలు (7)

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

Updated : 05 Oct 2022 05:40 IST

పాదయాత్రకు ఆటంకం కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత: సీపీఐ

ఈనాడు, అమరావతి: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘రైతులను రెచ్చగొట్టేలా మంత్రి ధర్మాన వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నాం. పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలిగినా సీఎం జగన్‌, మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. శాసనసభలో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్‌ రాజధాని అమరావతికి అంగీకరించింది వాస్తవం కాదా? ఆనాడే మూడు రాజధానులు కావాలని జగన్‌ ఎందుకు చెప్పలేదు? అధికారంలోకి వచ్చాక రైతులను ఎందుకు బాధిస్తున్నారు? శాసనం, చట్టం, ధర్మాలను విస్మరించి వైకాపా ప్రభుత్వం మోసానికి పాల్పడుతోంది’ అని విమర్శించారు.


కొత్తగా తీర్మానం ప్రవేశపెట్టాకే రాజధాని తరలింపు
ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: గతంలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లును న్యాయస్థానంలో ఉపసంహరించుకున్నందున, అసెంబ్లీలో కొత్తగా తీర్మానం చేయాల్సిన అవసరం ఉందని ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శ్రీశైలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆ తీర్మానం తర్వాతే రాజధాని తరలింపు మొదలవుతుందని చెప్పారు. వైకాపా ఎంపీలు పోరాడి విశాఖ రైల్వే జోన్‌ను సాధించనున్నారని పేర్కొన్నారు. అమరావతి రైతుల యాత్రను తెదేపా పార్టీ వెనుక ఉండి నడిపిస్తోందని, అది నకిలీ యాత్ర అని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.

 


ఉత్తరాంధ్ర మంత్రులకు చెరకు రైతుల సమస్యలు పట్టవా?
లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ

జామి, న్యూస్‌టుడే: ‘ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాం.. విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని చెబుతున్న ఇక్కడి మంత్రులకు స్థానికంగా ఉన్న చెరకు రైతుల సమస్యలు పట్టవా?’ అని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటామని చెబుతున్న మంత్రులకు చెరకు రైతుల కన్నీళ్లు కన్పించడం లేదా? అని నిలదీశారు. ఈ ప్రాంతంలోని ఏటికొప్పాక తాండవ, చోడవరం, భీమసింగి, ఆమదాలవలసల్లోని సహకార చక్కెర కర్మాగారాలన్నీ మూతపడ్డాయని.. మంత్రులు ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ కర్మాగారాలను బాగు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అమరావతి రైతులను అడ్డుకుంటామని ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందబోదని మంత్రులు తెలుసుకోవాలని సూచించారు.


మహా మోసగాడు.. విజయసాయిరెడ్డి
ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ

ఈనాడు-అమరావతి: అబద్దాలను నిజాలుగా చెప్పడంలో విజయసాయిరెడ్డిని మించిన మోసగాడు ప్రపంచంలో మరొకరు లేరని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబునాయుడిపై నోటికి వచ్చినట్లు దుర్భాషలాడుతున్నారని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ధ్వజమెత్తారు. ‘జగన్‌రెడ్డి అరాచక పాలనను, వైకాపా దోపిడీని ఎత్తి చూపితే దానిని కుల మీడియా అంటారా? ఒక కులంపై నిత్యం విషం చిమ్ముతూ అభూత కల్పనలతో అసత్యాలు ప్రచురిస్తున్న మీ మీడియాని ఏమనాలి? ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు వంత పడుతూ, అడుగులకు మడుగులు వత్తుతున్న దానిని ఏ పేరుతో పిలవాలో విజయసాయిరెడ్డే చెప్పాలి? ప్రజల మీడియా ఏదో, ప్రభుత్వానికి కొమ్ము కాసే మీడియా ఏదో జనం గమనిస్తున్నారు. ఒక పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన వాడుతున్న భాష సరికాదు. పిచ్చి కూతలు కూస్తే మీకు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రే గతి...’ అని ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు పేర్కొన్నారు.


భాజపాలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే భిక్షపతి

పరకాల, న్యూస్‌టుడే: తెరాసకు చెందిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి భాజపాలో చేరనున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో మహాకూటమి నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. వైఎస్సార్‌ మరణానంతరం మంత్రిగా పనిచేసిన సురేఖ తన పదవికి రాజీనామా చేయడంతో 2012లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలో భిక్షపతి తెరాస తరఫున పోటీచేసి సురేఖపై గెలుపొందారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. ఉద్యమ పార్టీలో ఆదరణ లేదంటూ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. పార్టీలో చేరికపై ఆయన మంగళవారం మునుగోడులో భాజపా నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కలిసి చర్చించారు. పార్టీ మారే తేదీ త్వరలోనే ఖరారు కానుంది. ఈ విషయంపై ‘న్యూస్‌టుడే’తో భిక్షపతి మాట్లాడుతూ.. తాను భాజపాలో చేరనున్నది వాస్తవమేనన్నారు. రాష్ట్ర సాధనకు ఎంతో కష్టపడ్డానని, తనలాంటి కార్యకర్తలకు ఆశించిన ఫలాలు అందట్లేదన్నారు.


కేసీఆర్‌ జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు
ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ తెలంగాణ కమిటీ, మెదక్‌ సీఎస్‌ఐ చర్చి, పలు సంఘాల ప్రకటన

ఖైరతాబాద్‌, సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌)- న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా సెక్యులరిజం, రాజ్యాంగ సిద్ధాంతాలు, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను సంపూర్ణంగా అమలు చేసేందుకు బలమైన రాజకీయ పార్టీ అవసరముందని ఇండియన్‌ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తెలంగాణ కమిటీ పేర్కొంది. కేసీఆర్‌ జాతీయ పార్టీకి ఐసీసీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని రాష్ట్ర కమిటీ ఛైర్మన్‌ బిషప్‌ భాస్కర్‌ ముల్కల, అధ్యక్షులు బిషప్‌ రెవరెండ్‌ శావల జోసఫ్‌ వెల్లడించారు. ఈ నెల 6న అన్ని జిల్లాల క్రైస్తవ నాయకులు, పాస్టర్లతో మహాసభ నిర్వహించి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్లు తెలిపారు. కేసీఆర్‌ వంటి నాయకుడు దేశానికి అవసరమని, ఆయనకు దేవుడి ఆశీస్సులు ఉండాలని మెదక్‌ సీఎస్‌ఐ చర్చి బిషప్‌ సాల్మన్‌రాజ్‌ అన్నారు. మంగళవారం నిజామాబాద్‌ సీఎస్‌ఐ చర్చిలో నిర్వహించిన క్రైస్తవ మతపెద్దల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశారు.


‘పార్టీ’ విజయవంతం కావాలని పూజలు  

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ ప్రకటించే జాతీయ పార్టీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ తెరాస నేతలు పలు దేవాలయాల్లో మంగళవారం పూజలు చేశారు. టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితర నేతలు తిరుమలలో, విజయవాడ కనకదుర్గ ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర అర్చక సమాఖ్య,  బ్రాహ్మణ సేవాసమితి, వైష్ణవ సేవా సమితి, అర్చక ఉద్యోగ సంఘం ఐకాస నేతలు.. కేసీఆర్‌ పార్టీకి సంఘీభావం తెలిపారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని