18 నుంచి కర్నూలులో ‘భారత్‌ జోడో యాత్ర’

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే తమ ప్రధాని ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తారన్నారు.

Published : 05 Oct 2022 04:00 IST

అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌

ఈనాడు, కర్నూలు: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తుందని ఆ పార్టీ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన తక్షణమే తమ ప్రధాని ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చేస్తారన్నారు. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కర్నూలు జిల్లాలో రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ను నిర్వహించనున్నారని చెప్పారు. కర్నూలులో మంగళవారం పార్టీ సీనియర్‌ నాయకులతో భారత్‌ జోడో యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. కేసీఆర్‌ ప్రకటించే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) గురించి ఆయన మాట్లాడుతూ... 2024లో బీఆర్‌ఎస్‌ పార్టీ వీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని జోస్యం చెప్పారు. మరో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో రాహుల్‌ యాత్రకు విశేష స్పందన వచ్చిందని, ఇది చూసి భాజపా భయపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేతలు ఊమెన్‌ చాందీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శైలజానాథ్‌, పళ్లంరాజు, హర్షకుమార్‌, తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల పరిధిలో నాలుగు రోజుల్లో 118 కి.మీ. మేర భారత్‌ జోడో యాత్ర సాగుతుంది. కర్ణాటక నుంచి మొదటగా ఆలూరు నియోజకవర్గంలోని హాలహర్వి మండలం ఛత్రగుడి వద్ద యాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కురువళ్లి, ఆలూరు, హుళేబీడు, మనేకుర్తి మీదుగా వచ్చి ఛాగికి చేరుకుంటుంది. అక్కడ రాహుల్‌గాంధీ రాత్రి బస చేస్తారు. మర్నాడు ఢణాపురం మీదుగా ఆదోని చేరుకుంటారు. అక్కడి నుంచి ఆరేకల్‌, దేవిబెట్ట, చెన్నాపురం క్రాస్‌ చేరుకుని రాత్రి బస చేస్తారు. ఎమ్మిగనూరు, ముగతి, ధర్మపురం, హాలహర్వి, చిలకలడోణ చేరుకుని కల్లుదేవకుంటలో రాత్రి బస చేస్తారు. 21వ తేదీ ఉదయం మంత్రాలయం, చెట్నేహళ్లి, మాధవరం వరకు యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. తమను గుర్తించడం లేదని పలువురు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న నాయకులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. దిగ్విజయ్‌సింగ్‌ మాట్లాడుతూ అంతర్గత విషయాలు చర్చించుకునేందుకు ఇది వేదిక కాదని కార్యకర్తలను సముదాయించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని