వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు రూ.700 కోట్లు ఎక్కడకు వెళ్లాయి?

రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన రూ.700 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయని, ఏ పద్దుకు మళ్లించారో చెప్పాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు.

Published : 05 Oct 2022 04:00 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు

అనంతపురం (రాణినగర్‌), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన రూ.700 కోట్లు ఎవరి జేబుల్లోకి పోయాయని, ఏ పద్దుకు మళ్లించారో చెప్పాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మంగళవారం అనంతపురంలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... వెనుకబడిన ఏడు జిల్లాలకు కేంద్రం నిధులు ఇవ్వలేదని వైకాపా ఇన్నాళ్లు తప్పుడు ప్రచారం చేసిందన్నారు. ఆ నిధులకు సంబంధించి రాష్ట్ర ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాసిన లేఖను ఆయన విలేకరులకు చూపారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు రూ.700 కోట్లు వెనుకబడిన ఏడు జిల్లాలకు నిధులు విడుదల చేయగా.. వాటికి లెక్కలు చెప్పలేదని కేంద్రం రాష్ట్రాన్ని ప్రశ్నించిందని వెల్లడించారు. ఆ నిధులను వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాలకు వినియోగిస్తూ వెనుకబడిన ప్రాంతాలను మోసం చేస్తోందన్నారు. రాయలసీమ దుర్భిక్ష నివారణ కార్యక్రమం కింద చేపట్టిన 34 ప్రాజెక్టులు ఏ దశలో ఉన్నాయో శ్వేతపత్రం విడుదల చేయాలని కాలవ డిమాండ్‌ చేశారు. హంద్రీనీవా, గాలేరు నగరికి ఈ మూడున్నరేళ్లలో ఎంత ఖర్చు చేశారో చెప్పాలన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి జగన్‌ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడ రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రమాదకరంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్ర గురించి మంత్రులు మాట్లాడుతున్న తీరు చూస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంత పాలనా అనిపిస్తోందని కాలవ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని