దేశాన్ని కాపాడేందుకే రాహుల్‌ యాత్ర

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాజకీయాల కోసం కాదని, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేస్తున్న విచ్ఛిన్నకర కుట్రల నుంచి దేశాన్ని కాపాడటం కోసం చేస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, జోడో యాత్ర జాతీయ కన్వీనర్‌ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు.

Published : 05 Oct 2022 05:40 IST

ఇది రాజకీయాల కోసం కాదు
జోడోయాత్ర సన్నాహక సమావేశంలో దిగ్విజయ్‌ సింగ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర రాజకీయాల కోసం కాదని, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేస్తున్న విచ్ఛిన్నకర కుట్రల నుంచి దేశాన్ని కాపాడటం కోసం చేస్తున్నదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, జోడో యాత్ర జాతీయ కన్వీనర్‌ దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. అక్టోబరు 24 నుంచి తెలంగాణలో 13 రోజులపాటు యాత్ర కొనసాగుతుందని, ప్రతీ కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలన్నారు. రాహుల్‌గాంధీ సందేశం, జోడో యాత్ర లక్ష్యాలు ప్రతి ఇంటికీ, ప్రతి ఒక్కరికీ చేరేలా కార్యకర్తలు దృష్టిసారించాలన్నారు. తెలంగాణలో జోడో యాత్ర నేపథ్యంలో మంగళవారం సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో పీసీసీ నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. ప్రజలను ఏకం చేసి భాజపా మీద పోరాటం ద్వారా శాంతిని నెలకొల్పే లక్ష్యంతో రాహుల్‌ భారత్‌జోడో యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ‘‘రాష్ట్రంలో భాజపా, తెరాస అవగాహనతో పని చేస్తున్నాయి. దేశంలో భాజపాకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ మాత్రమే’’ అని దిగ్విజయ్‌సింగ్‌  వివరించారు.

కేసీఆర్‌కు వీఆర్‌ఎస్‌ ఖాయం: జైరాం రమేష్‌

కేసీఆర్‌ కొత్త జాతీయ పార్టీకి వీఆర్‌ఎస్‌ తప్పదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ పేర్కొన్నారు. భాజపా, తెరాస విధానాలపై తెలంగాణలో రాహుల్‌ యాత్ర ఉంటుందన్నారు. కొప్పుల రాజు మాట్లాడుతూ..తెలంగాణలో జోడో యాత్ర 13 రోజులకే పరిమితం కాదని, తర్వాత ‘సంవిధాన్‌ బచావో’ నినాదంతో పీసీసీలోని 8 అనుబంధ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా గడపగడపకూ ఈ యాత్ర సందేశాన్ని తీసుకువెళ్తాయన్నారు. జోడో యాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రేవంత్‌రెడ్డి, భట్టివిక్రమార్కలు కోరారు. పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, టి.సుబ్బరామిరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, మధుయాస్కీ, షబ్బీర్‌అలీ, దామోదర రాజనర్సింహా, బలరాం నాయక్‌, సంపత్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, శివసేనారెడ్డి, నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు హాజరయ్యారు.

ప్రజలకు రేవంత్‌రెడ్డి, భట్టి దసరా శుభాకాంక్షలు

విజయదశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి అందరికీ విజయాలు అందించాలని ఆకాంక్షించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని