తాయిలాల పండగ

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా ప్రధాన పార్టీలు తాయిలాల జోరు పెంచాయి. ప్రలోభాలు ఊపందుకున్నాయి.

Published : 05 Oct 2022 05:40 IST

ముఖ్య నాయకులకు పొట్టేళ్లు, మేకలు
ఓటర్లకు కిలో మాంసం, మద్యం సీసా
ప్రధాన పార్టీల పంపిణీ షురూ

ఈనాడు, నల్గొండ: ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా ప్రధాన పార్టీలు తాయిలాల జోరు పెంచాయి. ప్రలోభాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా దసరా పండగను అన్ని పార్టీలు వేదికగా మార్చుకున్నాయి. ఓ ప్రధాన పార్టీ నేతలు చాలా గ్రామాల్లో ఓటర్లకు కిలో మాంసం, మద్యం సీసా పంపిణీ చేశారు. మరో ప్రధాన పార్టీ ముఖ్య నాయకులకు మేకలు, పొట్టేళ్లను కొనుగోలుచేసి ఇచ్చి..పండగ రోజు గ్రామాల వారీగా ముఖ్య కార్యకర్తలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. మరో పార్టీ నాయకులు తమ  కార్యకర్తలకు కోడి మాంసం పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొత్తంగా అన్ని పార్టీలు కలిపి మాంసం, మద్యానికే రూ.కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది.

గొర్రెల పథకం లబ్దిదారులకు రూ.93.78 కోట్లు

రెండో విడత గొర్రెల పంపిణీ పథకానికి నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 7,800 మందిని లబ్ధిదారులుగా ప్రభుత్వం గతంలోనే ఎంపిక చేసింది. వారిలో 7,600 మంది ఖాతాలలో రూ.93.78 కోట్లు ప్రభుత్వం బదిలీ చేసింది. సోమవారం ప్రారంభమైన జమలు, మంగళవారం ఉదయం వరకు కొనసాగాయి. గతంలో గొర్రెల యూనిట్‌ను పశు వైద్యుల పర్యవేక్షణలో మూడో వ్యక్తి నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు ఇచ్చేవారు. ఇప్పుడు తొలిసారిగా మునుగోడులో పైలెట్‌ ప్రాజెక్టుగా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమచేశారు. అలా యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్‌, నారాయణపురం మండలాల్లోని రెండు వేల యూనిట్లు, నల్గొండ జిల్లాలోని మునుగోడు, చండూరు, నాంపల్లి, మర్రిగూడ, గట్టుప్పల్‌ మండలాల్లోని 5,600 యూనిట్లకు సంబంధించిన నగదును బదిలీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని