విజయమే లక్ష్యంగా సాగాలి

మునుగోడులో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు పూర్తి స్థాయిలో ఎన్నికల కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు.

Published : 05 Oct 2022 05:40 IST

9 నుంచి 14 వరకు నేతలంతా మునుగోడులోనే
14న ఆర్భాటంగా పాల్వాయి స్రవంతి నామినేషన్‌
కాంగ్రెస్‌ సమావేశంలో నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడులో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు పూర్తి స్థాయిలో ఎన్నికల కార్యాచరణతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. సంస్థాగతంగా బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకునేలా రాష్ట్ర కాంగ్రెస్‌ ముఖ్యనేతలంతా ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ముఖ్యనేతలకు సూచించారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 14వ తేదీ వరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా పార్టీ ఇన్‌ఛార్జీలందరూ మునుగోడు సెగ్మెంట్‌లోనే ఉండి ఉపఎన్నికల ప్రచారంలో పాలుపంచుకోవాలని నిర్ణయించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్ర కూడా రాష్ట్రంలో ఈ నెలలోనే ఉండటం పార్టీకి అనుకూల పరిణామమని నేతలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మునుగోడు బాధ్యులు అక్కడే దృష్టిసారించాలన్నారు. ఒక దాని ప్రభావం మరోదానిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం గాంధీభవన్‌లో మునుగోడు ఎన్నికలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ నేతృత్వంలో సమావేశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, నేతలు బోసురాజు, నదీమ్‌ జావెద్‌, రోహిత్‌చౌదరి, సంపత్‌కుమార్‌, చిన్నారెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్‌, బలరాంనాయక్‌, శంకర్‌నాయక్‌లతో పాటు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రచారం, ఎన్నికల తేదీలు ఖరారు కావడంతో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలను నేరుగా కలుసుకునేందుకే ప్రచారంలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. తాను ఇప్పటివరకూ చేసిన ప్రచారం, నేతల తోడ్పాటు సహా వివిధ అంశాలను అభ్యర్థి స్రవంతి వివరించారు. బూత్‌ స్థాయి నుంచి వ్యూహాత్మకంగా ముందుకుసాగాలని, ఇతర పార్టీలకు దీటుగా ప్రచారాన్ని కొనసాగించాలని ఆమెకు నాయకులు సూచించారు. అందరినీ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఈ నెల 11న మొదటి సెట్‌ నామినేషన్‌ వేయాలని, 14న భారీ కార్యక్రమం నిర్వహించి అట్టహాసంగా నామినేషన్‌ వేయాలని నిర్ణయించారు.

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: స్రవంతి

కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు. సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజుల్లో మరో సమీక్ష ఉంటుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చెప్పినట్లు తెలిపారు.

కేసీఆర్‌కు వీఆర్‌ఎస్‌ ఖాయం

జాతీయ పార్టీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీఆర్‌ఎస్‌ ఖాయమని కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్‌ అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడితే బహుజనులకు న్యాయం జరుగుతుందని ఆశించగా తెరాస పాలనలో అందరికీ నిరాశే మిగిలిందన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన పార్టీలు, ప్రజాసంఘాలు సీఎం కేసీఆర్‌ రాజకీయ వ్యవహారాలపై ఆలోచించాలన్నారు. ఎనిమిదేళ్ల తెరాస పాలనలో ఆ పార్టీకి రూ.800 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts