ఎన్నికలయ్యే వరకూ మునుగోడులోనే మకాం

మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తరువాత తెరాస కనుమరుగు కాబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Published : 05 Oct 2022 05:40 IST

పాదయాత్రకు తాత్కాలిక విరామం
ఉపఎన్నిక తర్వాత తెరాస కనుమరుగు
నేతలతో సంజయ్‌ వీడియో కాన్పరెన్స్‌

ఈనాడు, హైదరాబాద్‌- తెలంగాణచౌక్‌ (కరీంనగర్‌), న్యూస్‌టుడే: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తరువాత తెరాస కనుమరుగు కాబోతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఓటుకు రూ.30 వేలు ఇచ్చి గెలవాలని కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ‘భాజపా దమ్ము చూపిద్దాం. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిద్దాం. పాదయాత్రకు తాత్కాలిక విరామం ఇస్తున్నా. ఎన్నికలయ్యే వరకు మునుగోడులోనే మకాం వేస్తా. మిగతా నేతలూ అక్కడే ఉండాలి. ఫలితాల తరువాతే దసరా, దీపావళి ఉత్సవాలు చేసుకుందాం’’ అని పార్టీ నేతలకు సూచించారు. మంగళవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌లో నేతలతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వివేక్‌ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మనోహర్‌రెడ్డి తదితరులు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. తొలుత వివేక్‌ మాట్లాడుతూ సర్వేలన్నీ భాజపా గెలుపు ఖాయమని స్పష్టం చేస్తున్నాయనగా.. ఈ ఉపఎన్నిక ఫలితాలు దేశ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయని బండి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి తెరాస కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీలకు ఆర్థిక సాయం చేస్తోందని వ్యాఖ్యానించారు.  

ఆత్మగౌరవ పోరాటానికి సహకారం అందించాలి

హామీల అమలులో తెరాస పూర్తిగా విఫలమైందని, ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ఈమేరకు మంగళవారం నాలుగు పేజీల లేఖ రాశారు. వారందరికీ లేఖలో విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లేఖ ప్రతులను ప్రతి ఒక్కరికీ పోస్టు ద్వారా పంపినట్లు చెప్పారు. ‘‘తెరాసకు గుణపాఠం చెప్పే సమయం ఉపఎన్నిక రూపంలో ఆసన్నమైంది. మునుగోడులో సాగునీటి దుస్థితి తెలంగాణ రాకముందు ఎలా ఉందో నేడూ అలానే ఉంది. కాళోజీ అన్నట్లు పరాయివాడు దోపిడీ చేస్తే తన్ని పొలిమేరల దాకా తరిమెయ్యాలే. మన ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ఇక్కడే పాతరెయ్యాలే. గడీల పాలనపై సాగుతున్న మహాయుద్ధానికి పార్టీలకు అతీతంగా మునుగోడు నుంచే కవాతు మొదలు పెట్టాలి. భాజపాను గెలిపించి, కేసీఆర్‌ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడాలి. ఈ ఆత్మగౌరవ పోరాటానికి సహకారం అందించి ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి’’ అని లేఖలో సంజయ్‌ కోరారు. ప్రజలకు దసరా శుభాకాంక్షాలు తెలిపారు.  

చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నం దసరా: కిషన్‌రెడ్డి

‘హిందూ బంధువులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను వైభవోపేతంగా నిర్వహించుకోవడం మన సంప్రదాయం’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని