సంక్షిప్త వార్తలు(12)

రైతుల ముసుగులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చేస్తున్న పాదయాత్రను విరమించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. దసరా ఉత్సవాల సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మను దర్శించుకున్నాక విలేకరులతో ఆయన మాట్లాడారు.

Updated : 07 Oct 2022 06:45 IST

పాదయాత్ర విరమించాలి: మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లి, న్యూస్‌టుడే: రైతుల ముసుగులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చేస్తున్న పాదయాత్రను విరమించాలని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. దసరా ఉత్సవాల సందర్భంగా అనకాపల్లిలో నూకాలమ్మను దర్శించుకున్నాక విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అరసవల్లికి వచ్చి దేముడికి దండం పెట్టుకుంటామంటే అభ్యంతరం లేదు. అంతేకానీ విశాఖ రాజధాని వద్దని మొక్కుతామంటే ఊరుకునేది లేదు. తొడలు కొట్టి రెచ్చగొడితే చూస్తూ సహించబోం. ఏమైనా జరిగితే ప్రభుత్వానికి బాధ్యత లేదు. చంద్రబాబే బాధ్యత వహించాలి’ అని అన్నారు. అమరావతిని వ్యతిరేకించడం లేదని, దానితోపాటు విశాఖపట్నం, కర్నూలు అభివృద్ధి కావాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు.


బూటకపు యాత్ర
మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

సారవకోట, న్యూస్‌టుడే: అరసవల్లి వరకు జరుగుతున్నది పాదయాత్ర కాదని, బూటకపు యాత్ర అని మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలో గురువారం పార్టీ శ్రేణులతో సమావేశమై ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతోందని ఆరోపించారు. అమరావతిని ఒక్కటే రాజధానిగా అభివృద్ధి చేయడానికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో రాష్ట్రం లేదని, మూడు రాజధానులైతే అంత ఖర్చు అవసరం లేదని పేర్కొన్నారు.


ముందస్తు ఎన్నికల్లో భాగంగానే 3 రాజధానుల ఎజెండా: ఐవైఆర్‌

ఈనాడు, అమరావతి: ఎన్నికల నిర్వహణ ప్రణాళికలో భాగంగానే మూడు రాజధానుల ఎజెండాను వైకాపా ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోందని విశ్రాంత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భాజపా రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు ఐవైఆర్‌ కృష్ణారావు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ముదిరి ఉచితాల పంపకం కష్టసాధ్యమవుతుందన్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకునేందుకు రాజధానుల ఎజెండాను వైకాపా ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని గురువారం ఆయన ట్వీట్‌ చేశారు.


సంక్షేమంపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలి
ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్‌

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలకు రూ.1.36 లక్షల కోట్ల లబ్ధి చేకూర్చినట్లు చెబుతున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన మంత్రులు పూర్తి వివరాలతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచగలరా? అని ఎమ్మెల్సీ, తెదేపా నేత పి.అశోక్‌బాబు డిమాండ్‌ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నవరత్నాలకు పెట్టిన ఖర్చులో కూడా కులాల వారీ లెక్కల చెప్పడం సిగ్గుచేటు. బీసీలకు రూ.లక్షా 37 వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్న జగన్‌రెడ్డి ..వారి సంక్షేమం, ఉన్నతి కోసం ఏం చేశారో చెప్పగలరా? 2019-20లో విత్తనాలు దొరక్క అనంతపురం జిల్లాలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇప్పటికీ రూ.7 లక్షల పరిహారం ఇవ్వలేదు. 2019-20 నుంచి ఇప్పటివరకు రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం ..గత ప్రభుత్వం అమలు చేసినన్ని పథకాలు కూడా ఎందుకు అమలు చేయలేదు? ఒక చేత్తో రూపాయి ఇస్తూ...ఇంకో చేత్తో రూ.30 లాక్కుంటున్నారు...’ అని అశోక్‌బాబు విమర్శించారు.


బాలు, బీపీ మండల్‌ విగ్రహాల విషయంలో.. ప్రభుత్వం తీరు దారుణం
తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ

ఈనాడు, అమరావతి: ఇతర నాయకులు విగ్రహాల ఏర్పాటుతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తలేదా? బాలసుబ్రహ్మణ్యం, బీపీ మండల్‌ విగ్రహాల వల్లే సమస్యలు తలెత్తాయా? అని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘విగ్రహాల తొలగింపునకు ట్రాఫిక్‌ కారణాలు చెప్పడం సిగ్గుచేటు. బాలు విగ్రహం తొలగింపు వివాదంపై ప్రభుత్వ పెద్దల నుంచి సానుకూల ప్రకటన రాకపోవడం తీవ్ర విచారకరం. దేవుడి విగ్రహాల విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. గుంటూరులో వినాయకుడి విగ్రహాలను కూడా అనుమతులు లేవని చెత్తకుప్పల్లో పడేసిన ఘనత జగన్‌రెడ్డి ప్రభుత్వానిదే. రామతీర్థంలో రాములవారి విగ్రహం తలనరికిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పగలరా? తాడిపత్రిలో జకీర్‌ అనే మైనార్టీ యువకుడు చనిపోతే... మృతదేహాన్ని కాలితో తొక్కుతూ డీఎస్పీ చైతన్య కర్కశంగా వ్యవహరించడం రాక్షసత్వం కాదా? ఈ చర్యతో జగన్‌రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి ముస్లిం మైనారిటీలపై ఉన్న గౌరవం ఏపాటిదో రుజువైంది’ అని సయ్యద్‌ రఫీ అన్నారు.


రేపు మల్లికార్జున ఖర్గే ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కేంద్రమాజీమంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత మల్లికార్జునఖర్గే శనివారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఖర్గేతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క సహా కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, పీసీసీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న 238 మంది పీసీసీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీటీఏ పోటీ

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(జీటీఏ) పోటీ చేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాసం ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి మేరోజు బ్రహ్మచారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 1998 నుంచి ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కకుండా పంచాయతీరాజ్‌ సంఘాలు, వారి తరుఫున గెలిచిన ఎమ్మెల్సీలు మోసం చేస్తూ వచ్చారని వారు విమర్శించారు.


కేరళలోనే థరూర్‌కు ఎదురుగాలి

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న శశిథరూర్‌కు సొంత రాష్ట్రం కేరళలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆ రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తాము మల్లికార్జున్‌ ఖర్గేకు మద్దతిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ  అధ్యక్షుడు కె.సుధాకరన్‌, సీనియర్‌ నేత రమేశ్‌ చెన్నితల తదితరులు ఖర్గే నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు తెలిపారు.


భాజపాలో చేరిన పాటిదార్‌ నేత హర్షాద్‌ రిబాడియ

గాంధీనగర్‌: రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్‌కు చెందిన పాటిదార్‌ నేత హర్షాద్‌ రిబాడియ గురువారం భాజపాలో చేరారు. గుజరాత్‌ భాజపా ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌సింహ్‌ వాఘేలా ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హర్షాద్‌తో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు కాషాయ దళం తీర్థం తీసుకున్నారు.


కాంగ్రెస్‌ గిరిజన వ్యతిరేకి : భాజపా

దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ గిరిజన వ్యతిరేక వైఖరికి నిదర్శనమని గురువారం భాజపా ధ్వజమెత్తింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. గుజరాత్‌ రైతులు దేశంలో 76 శాతం ఉప్పు ఉత్పత్తి చేస్తున్నారని, దేశవాసులంతా గుజరాత్‌ ఉప్పు తింటున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఉదిత్‌ రాజ్‌ స్పందిస్తూ రాష్ట్రపతి ‘తాన తందాన’ వ్యాఖ్యలతో పక్షపాత వైఖరి బయటపెట్టారంటూ ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఈ మాటలపై సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు తీవ్రంగా స్పందించారు. భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అక్టోబరు 10న తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ సమన్లు జారీ చేశారు.


రాజపుత్రులు మళ్లీ ఆయుధాలు ధరించాలి

మేరఠ్‌ (యూపీ): ముస్లిం సమాజంపై దాడి లక్ష్యంగా భాజపా వివాదాస్పద నేత, మాజీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌ మళ్లీ గళం విప్పారు. విజయదశమి సందర్భంగా రాజ్‌పూత్‌ ఉత్థాన్‌ సభ ఏర్పాటుచేసిన ‘శస్త్రపూజ’ (ఆయుధపూజ) కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజపుత్రులు మళ్లీ ఆయుధాలు ధరించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. 2013 ముజఫర్‌నగర్‌ దాడుల కేసులో నిందితుడిగా ఉన్న సోమ్‌ గతంలో అరెస్టు కూడా అయ్యారు.


ప్రజాస్వామ్యానికి శరాఘాతం
ఈసీ కొత్త ప్రొఫార్మాపై కాంగ్రెస్‌ ధ్వజం

దిల్లీ: రాజకీయ పార్టీలు తాము చేసే ఎన్నికల వాగ్దానాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తాయో స్పష్టం చేసేలా ఎన్నికల సంఘం ప్రతిపాదించిన కొత్త ప్రొఫార్మాపై కాంగ్రెస్‌ పార్టీ ధ్వజమెత్తింది. రాజకీయ పార్టీల మధ్య ఉండే పోటీ స్వభావాన్ని దెబ్బతీస్తుందని, ప్రజాస్వామ్యానికి శరాఘాతం వంటిదని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ అభివర్ణించారు. అసలు ఇది ఎన్నికల సంఘం చేయాల్సిన పని కాదని పేర్కొన్నారు. ఇలాంటి విధానమే కనుక గతంలో అమలై ఉంటే కొన్ని దశాబ్దాలుగా దేశం రూపు రేఖలనే మార్చివేసిన సామాజికాభివృద్ధి, సంక్షేమ పథకాలు ఏవీ కూడా కార్యరూపం దాల్చేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని