రాహుల్‌ యాత్రలో సోనియా

దసరా నేపథ్యంలో రెండు రోజుల విరామం తర్వాత కర్ణాటకలో గురువారం ప్రారంభమైన భారత్‌ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు.

Updated : 07 Oct 2022 06:45 IST

ఈనాడు, బెంగళూరు: దసరా నేపథ్యంలో రెండు రోజుల విరామం తర్వాత కర్ణాటకలో గురువారం ప్రారంభమైన భారత్‌ జోడో యాత్రలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. రెండు రోజులుగా హెచ్‌డీ కోటెలోని ఆరెంజ్‌ కౌంట్‌ రిసార్టులో కుమారుడు రాహుల్‌గాంధీతో కలిసి విశ్రాంతి తీసుకున్న సోనియాగాంధీ గురువారం ఉదయం 9.03 గంటలకు పాండవపురలోని బెళ్లాళె మాణిక్యన్‌ గేట్‌ వద్ద యాత్రలో పాలుపంచుకున్నారు. అంతకు ముందు అరగంట పాటు రాహుల్‌గాంధీ నేతృత్వంలో యాత్ర కొనసాగింది. యాత్రలో 20 నిమిషాల పాటు నడిచిన సోనియాగాంధీని ఆరోగ్య సమస్యల దృష్ట్యా కారులో విశ్రాంతి తీసుకోవాలని రాహుల్‌ గాంధీ సూచించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం జక్కనహళ్లి, కరాడ్యల మధ్య దాదాపు రెండు గంటల పాటు ఈ యాత్రలో నడవాల్సిన సోనియాగాంధీ మొత్తం మీద 30 నిమిషాల నడకకే పరిమితమయ్యారు. మధ్య మధ్యలో కారులో విశ్రాంతి తీసుకుని రెండు గంటల పాటు యాత్రను అనుసరించారు. కర్ణాటక విపక్ష నేత సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌, స్థానిక నేతలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ శుక్రవారం ఈ యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఐక్యత సాధిస్తాం: తుపాను మధ్య ప్రయాణాన్ని మొదలు పెట్టి నేడు అన్ని సవాళ్లనూ ఎదుర్కొని భారత్‌ను ఐక్యం చేసే స్థాయికి చేరుకున్నట్లు రాహుల్‌గాంధీ ట్వీట్‌ చేశారు.  సోనియాగాంధీ ఈ యాత్రలో చేరారు. యావద్భారతం మరింత బలోపేతంగా ఏకమై ముందుకు సాగనుందని ప్రియాంకగాంధీ ట్వీట్‌ చేశారు.


తల్లికి రాహుల్‌ సేవ

యాత్ర సందర్భంగా సోనియగాంధీ బూట్లకు లేసులు కట్టి అమ్మ పట్ల రాహుల్‌ ప్రేమను చాటారు. ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేసిన కాంగ్రెస్‌ ‘అమ్మ’(మా) అంటూ శీర్షిక పెట్టింది. ఇదే చిత్రంపై సామాజిక మాధ్యమంలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన తల్లికి కాళ్లు కడుగుతున్న చిత్రంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శించిన విషయం తెలిసిందే. అమ్మ వద్దకు వెళ్లేప్పుడు ప్రధాని కెమెరాలను ఎందుకు తీసుకెళ్లారని కాంగ్రెస్‌ వేసిన ప్రశ్నకు... తాజా చిత్రానికి ఏమని బదులిస్తారని నెటిజన్లు ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని