BRS: భారాసగా తెరాస

తమ పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) భారత ఎన్నికల సంఘాన్ని కోరింది.

Updated : 07 Oct 2022 06:41 IST

పేరు మార్చాలని ఎన్నికల సంఘానికి వినతి

తీర్మాన ప్రతి అందజేత

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: తమ పార్టీ పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మార్చాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) భారత ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు పార్టీ చేసిన తీర్మాన ప్రతిని తెరాస నేతలు బోయినపల్లి వినోద్‌ కుమార్‌, ఎం.శ్రీనివాసరెడ్డిలు దిల్లీలోని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కార్యాలయంలో సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ ధర్మేంద్ర శర్మకు గురువారం ఉదయం అందించారు. పేరు మార్పిడిపై తెరాస సర్వసభ్య సమావేశం దసరా పండుగ రోజు (బుధవారం) నిర్ణయం తీసుకుందని తెలిపారు. పార్టీ పేరు మార్చినందున వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈసీఐకి రాసిన లేఖను కూడా ధర్మేంద్ర శర్మకు అందజేశారు.

ఏకగ్రీవంగా తీర్మానం
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్‌ రాష్ట్ర సమితిగా మారుస్తూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు బుధవారం మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తెరాస పేరు, పార్టీ రాజ్యంగంలోని మౌలిక అంశాలను సవరిస్తూ తీర్మానం చేశారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తెరాస పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు,. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు పాల్గొని... తీర్మానాలపై సంతకాలు చేశారు. తెరాస అధినేత ప్రతిపాదించిన ఏక వాక్య తీర్మానానికి సభ్యులు మద్దతు తెలిపారు. అనంతరం ఆ తీర్మానంపై కేసీఆర్‌ సంతకం చేశారు. ఆ తర్వాత చదివి వినిపించి ‘భారత్‌ రాష్ట్ర సమితి’ పేరును ప్రకటించారు. వెంటనే సభ్యులంతా చప్పట్లతో మద్దతు పలికారు. దేశ్‌కీనేత కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్‌ నేత కుమారస్వామి, తమిళనాడులో దళిత ఉద్యమ పార్టీ వీసీకే అధ్యక్షుడు, ఎంపీ తిరుమావళవన్‌ రైతు సంఘం నేతలు, మహారాష్ట్ర, పంజాబ్‌, దిల్లీ రైతు సంఘాల ప్రతినిధులు హాజరై సంఘీభావం తెలిపారు. జాతీయ పార్టీ పేరు ప్రకటించగానే.. కుమారస్వామి కేసీఆర్‌ను సన్మానించారు. అనంతరం పార్టీ పేరు మార్పుపై కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖను విడుదల చేశారు.

* సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణభవన్‌కు బయల్దేరిన కేసీఆర్‌, ఇతర నేతలకు దారిపొడవునా ప్రజలు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. పార్టీ పేరు మార్చుతూ సీఎం ప్రకటన వెలువడిన వెంటనే  పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. .

ప్రజా సమస్యలే ఎజెండా: వినోద్‌కుమార్‌
దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులతో పాటు ప్రజల్లోని అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలే ఎజెండాగా భారాస దేశవ్యాప్తంగా ఉద్యమిస్తుందని తెరాస నేత వినోద్‌ కుమార్‌ తెలిపారు. దిల్లీలో ఈసీఐకి లేఖలు అందజేసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 29ఏ (9) ప్రకారం ఏ రాజకీయ పార్టీ అయినా చిరునామా, పేరు మార్చుకుంటే వెంటనే ఈసీకి తెలియజేయాల్సి ఉంటుందని తెలిపారు. భారాస పేరుతో ఎవరైనా గతంలో దరఖాస్తు చేసుకున్నారేమో చూసి చెబుతామని శర్మ తెలిపారన్నారు. భారాస పేరుతో రెండు, మూడు పార్టీలున్నాయనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. సంక్షిప్త నామాలుగా (అబ్రివేషన్లు) ఎన్నైనా ఉండొచ్చని, భారత్‌ రాష్ట్ర సమితి అని మాత్రం లేవన్నారు. తెరాస పేరుతో ఇతరులు పార్టీ పెట్టకూడదని చట్టం చెబుతోందని మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 14వ తేదీలోగా ఈసీఐ పార్టీ పేరు మారిస్తే మునుగోడు ఉప ఎన్నికలో భారాస పేరుతో..లేకుంటే తెరాస పేరుతో పోటీచేస్తామని వెల్లడించారు.

* దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉందని వినోద్‌కుమార్‌ అన్నారు. ఉచితాలకు నిధుల కేటాయింపుపై ఈసీఐ పార్టీలకు రాసిన లేఖపై ఆయన స్పందించారు. దేశంలో 50 శాతం ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని.. ధనిక, పేదల మధ్య తారతమ్యాలున్నాయనే విషయం గుర్తించాలన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని