BRS: దేశ వికాసానికే భారత్‌ రాష్ట్ర సమితి

తెలంగాణ నా సుస్థిర కార్యక్షేత్రం. రాష్ట్రాన్ని వదిలిపెట్టబోను. ముఖ్యమంత్రిగా నేనే ఉంటా. సీఎంగానే దేశమంతా పర్యటిస్తా. జాతీయ పార్టీని విస్తరిస్తా. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.

Updated : 07 Oct 2022 06:41 IST

ప్రజలను గెలిపిస్తాం ప్రగతి సాధిస్తాం

తెలంగాణ నమూనాను దేశమంతటికీ విస్తరిస్తాం

కలిసి పనిచేసేందుకు పార్టీలు ముందుకొస్తున్నాయి

భారత్‌ రాష్ట్ర సమితిగా తెరాస పేరు మార్పిడి కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణే కార్యక్షేత్రం...
తెలంగాణ నా సుస్థిర కార్యక్షేత్రం. రాష్ట్రాన్ని వదిలిపెట్టబోను. ముఖ్యమంత్రిగా నేనే ఉంటా. సీఎంగానే దేశమంతా పర్యటిస్తా. జాతీయ పార్టీని విస్తరిస్తా. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.

రుగ్మతలను రూపుమాపుతాం
మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల నాయకులు, రైతులు తెలంగాణ నమూనా అభివృద్ధి కావాలన్నారు. దళిత రైతు, గిరిజన ఉద్యమాల వంటి వాటిని  ప్రధాన ఎజెండాగా తీసుకొని ముందుకు సాగుతాం. దేశంలోని అనేక సామాజిక రుగ్మతలపై భారత్‌ రాష్ట్ర సమితి పోరాటం ఉంటుంది. ఇప్పటికే అనేక రుగ్మతలను ఎలా రూపుమాపాలో తెలంగాణ ఆచరించి చూపించింది.

- కేసీఆర్‌

తెలంగాణ మాదిరిగా దేశాన్ని అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్‌ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిందని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. దేశ రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసేందుకే జాతీయ పార్టీగా ముందడుగు వేస్తున్నామని, దేశ ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు. తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన యోధులని, అదే స్ఫూర్తితో దేశసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణలో కష్టపడి పనిచేసినట్టే.. దేశం కోసం కూడా శ్రమిస్తామని, ప్రజలను గెలిపించి, ప్రగతిని సాధిస్తామన్నారు.

తమతో కలిసి ముందుకు సాగడానికి దేశవ్యాప్తంగా అనేక పార్టీల నేతలు ముందుకు వస్తున్నారన్నారు. మహారాష్ట్రలో మొదటి కార్యక్రమం చేపడతామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పేరును భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)గా మార్చేందుకు హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడారు.

ఏపని అయినా అర్థవంతంగా.. ప్రకాశవంతంగా..

‘‘ఏపని చేసినా అర్థవంతంగా ప్రకాశవంతంగా చేయాలి. 21 సంవత్సరాల క్రితం తెరాస ప్రారంభమైంది. నాటి సమైక్య పాలనలో కుంగి కృశించి పోయిన తెలంగాణ ప్రజానీకాన్ని కడుపులో పెట్టుకోని ముందుకు సాగాం. రాష్ట్రాన్ని సాధించుకుని అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు..ఇలా సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయని పక్కరాష్ట్రాల వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఎంచుకున్న కార్యాన్ని ఒక యజ్జం లాగా చేయడం వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో పాలించిన పార్టీలు దేశానికి చేసిందేమీలేదు. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.లక్ష మాత్రమే ఉండేది. ఇప్పుడది రూ.2.78 లక్షలకు పెరిగింది. జీఎస్డీపీ 2014లో రూ.5.06 లక్షల కోట్లుండేది. అది నేడు రూ.11.50 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది వాస్తవానికి రూ.14.5 లక్షల కోట్ల రూపాయలుండాల్సింది. కానీ హ్రస్వదృష్టితో కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల ఇంకా అందుకోవాల్సినంత అభివృద్ధిని తెలంగాణ చేరుకోలేక పోతోంది. 1980వరకు చైనా జీడీపీ మన దేశం కన్నా తక్కువగా ఉండేది. 16 ట్రిలియన్‌ డాలర్ల ఎకనామీతో చైనా నేడు ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది.

వంచనకు గురవుతున్న ప్రజలు
దేశ ప్రజలు వంచనకు గురవుతున్నారు. అపారమైన సహజవనరులు, మానవ వనరులున్నా వాడుకోలేకపోతున్నాం దేశంలో సారవంతమైన వ్యవసాయ యోగ్యమైన భూమి, పుష్కలంగా నీరు ఉన్నాయి. కష్టపడి పనిచేసే ప్రజలున్నారు. ఈ పరిస్థితుల్లో మన దేశమే ప్రపంచానికి అన్నం పెట్టాలి.  అది వదిలి మనమే పిజ్జాలు, బర్గర్లు తినడం అంటే అవమానకరం. దేశంలో నీటి వసతి లేక దాదాపు 44 కోట్ల ఎకరాల భూమి సాగుయోగ్యం కావడం లేదు. కనీసం ప్రతి ఏటా సముద్రంలోకి వృథాగా పోతున్న 70 వేల టీఎంసీల నీటిని మళ్లించలేకపోతున్నాం. తాగునీరు దొరక్క ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నారు. రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెలలపాటు ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణం. ఆదుకొనేవారు లేక మహారాష్ట్రలోని ఒక్క యవత్మాల్‌ జిల్లాలోనే ఏటా 50 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లింగ, కుల వివక్షలు మన దేశాన్ని పీడిస్తున్నాయి. సగం జనాభా అయిన మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాకపోవడంతో నష్టం జరుగుతోంది. 20 శాతం దళితులు కూడా కుల వివక్ష వల్ల దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారు. పేదరికం కారణంగా అగ్రవర్ణాల వారెందరో అవకాశాలను కోల్పోతున్నారు. ఇవన్నీ మారకుండా దేశంలో సమూల మార్పు జరగదు. రాష్ట్రంలోని 8.40 లక్షల కుటుంబాలకు దళితబంధు, రైతుబంధు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇదే విషయాన్ని, ఇక్కడికి వచ్చిన ప్రముఖ దళిత నాయకుడు ఎంపీ తిరుమావళవన్‌కు చెప్తే ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. తెలంగాణలో అమలవుతున్న ఇటువంటి ఆవిష్కరణలు దేశ స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అమలు చేసి ఉంటే బాగుండేది. ఈ కార్యక్రమాలను ఆవిష్కరించినందువల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమైంది.

తెలంగాణ పంథాలో దేశాభివృద్ధి
మన తెలంగాణ అభివృద్ధి నమూనాను దేశమంతటికీ విస్తరిస్తాం. సాగుయోగ్యమైన ప్రతి ఇంచు భూమికి నీటి వసతి కల్పించాలని సంకల్పించి అందుకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకున్నాం. కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నాం. ఇక్కడ మిషన్‌ భగీరథ ద్వారా మంచినీటిని సరఫరా చేయగలిగినప్పుడు దేశమంతా ఇవ్వలేమా? చిత్తశుద్ధి ఉంటే ఇవ్వవచ్చు. దీనికి చైనా, పాకిస్తాన్‌, అమెరికాలతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు.

అందుకే జాతీయ పార్టీ
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి అనేక రాష్ట్రాల వాళ్లు అధ్యయనం చేసి స్ఫూర్తి పొందుతున్నారు. వాళ్లలో కొందరు నన్ను కలిసి తమ రాష్ట్రంలో కూడా తెరాస ఉండాలని, పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని, తమతో కలిసి పనిచేయాలని కోరారు. జాతీయ రాజకీయాల్లోకి వస్తే కలిసి నడుస్తామని చెప్పడమే కాకుండా అనేకమంది సలహాలు, సూచనలు ఇచ్చారు. అందుకే ఇప్పుడు ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా పార్టీ పేరు మార్చుకొంటున్నాం.

ఇది పార్టీ పేరు మార్పిడి సమావేశమే..
ఈ చారిత్రక కార్యక్రమానికి యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌,  బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లు రావాల్సి ఉన్నప్పటికీ..వారి పరిస్థితులను అర్థం చేసుకొని నేనే వద్దన్నాను. ఇది పార్టీ పేరు మార్పిడి కోసం జరిగే అంతర్గత సమావేశం మాత్రమే. తర్వాత పార్టీ ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా చేద్దాం. దానికి అందరినీ పిలుచుకుందాం. బీఆర్‌ఎస్‌కు జేడీఎస్‌ సంపూర్ణ మద్దతుంటుందని మాజీ ప్రధాని దేవేెగౌడ తెలిపారు. మన దేశంలోని వనరులన్నీ వాడితే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతాం. మనకు ఇంకా మంచి సమయం ఉంది. దేశవ్యాప్తంగా విస్తరిస్తాం. మొట్టమొదటి కార్యక్షేత్రంగా మహారాష్ట్రను ఎంచుకుంటాం. పార్టీకి అనుబంధంగా త్వరలోనే రైతు విభాగాన్ని ఏర్పాటు చేసుకొంటాం. పట్టుదలతో తెలంగాణ ప్రజలను గెలిపించినట్లే దేశ ప్రజలను కూడా లక్ష్య సాధనలో గెలిపిస్తాం. ఆర్థిక శాస్త్రవేత్తలు, పలు రంగాల నిపుణులతో చర్చించి, సలహాలు తీసుకుని ముందుకు సాగుతాం’’ అని కేసీఆర్‌ తెలిపారు.


దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాజకీయమంటే ఆట లాంటిది. తెరాసకు మాత్రం అదొక యజ్ఞం. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే నా అభిమతం. అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయడం నా పథం.


జాతీయ పార్టీ పెట్టాలన్నది ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. అన్నీ చేసి చూపించాలనే బలమైన ఆకాంక్షల పునాదుల మీది నుంచే ముందడుగు వేస్తున్నాం. తెలంగాణ వల్ల దేశానికి మంచి జరిగితే అది చిరస్థాయిగా ఉంటుంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. రాష్ట్రాలు, దేశం కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్ర వికాసం సాధ్యం’’


సాధారణ పని విధానం నుంచి బయటపడి వినూత్న పంథాలో నడిచే దేశాలే గుణాత్మకంగా మారాయి. ఆ దిశగా ప్రజలను చైతన్యపరిచిన సమాజాలే ఫలితాలు సాధించాయి. మార్పు కోరుకోనివి అలాగే ఉన్నాయి.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని