Yanamala: జింబాబ్వే కన్నా దారుణం కాబోతున్న ఏపీ: యనమల

జగన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అభివృద్ధి అటకెక్కించారని, వ్యవసాయం నుంచి వృత్తులు, వ్యాపారాల వరకు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Updated : 07 Oct 2022 09:08 IST

మూడున్నరేళ్లలో రూ.8లక్షల కోట్ల అప్పులు
భవిష్యత్తులో వడ్డీలకే   రూ.లక్ష కోట్లు చెల్లించాలి
మాజీ ఆర్థిక మంత్రి యనమల విమర్శ

ఈనాడు-అమరావతి: జగన్‌రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో అభివృద్ధి అటకెక్కించారని, వ్యవసాయం నుంచి వృత్తులు, వ్యాపారాల వరకు అన్నింటినీ సంక్షోభంలోకి నెట్టారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమై ప్రజలపై భారాలు పెరిగి నైజీరియా, జింబాబ్వే కంటే దారుణంగా ఆంధ్రప్రదేశ్‌ తయారవుతుందని ఒక ప్రకటనలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘కాగ్‌ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఏపీ ప్రభుత్వ అప్పులు అసాధారణంగా పెరిగాయి. మూలధన వ్యయం దారుణంగా తగ్గింది. రెవెన్యూ పడిపోయింది. జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం సింగిల్‌ డిజిట్‌కు దిగజారాయి. బయట అప్పులు (ఓపెన్‌ బారోయింగ్స్‌) 130%పైగా పెరిగాయి. బడ్జెట్‌లో చూపించకుండా రూ.4లక్షల కోట్ల వరకు అప్పులు చేసి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ చర్యలను 15వ ఆర్థిక సంఘం కూడా తూర్పారబట్టింది. మూడున్నరేళ్లలో రూ.8లక్షల కోట్లు అప్పులు చేశారు. అయినా ప్రజల ఆదాయం పెరగలేదు. అభివృద్ధీ జరగలేదు. ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయం ఎటు పోతుందో కూడా లెక్కల్లేవు...’ అని యనమల పేర్కొన్నారు. ‘ అప్పులపై ప్రస్తుతం ఏటా రూ.50వేల కోట్లకుపైగా వడ్డీలే చెల్లించాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఆ మొత్తం రూ.లక్ష కోట్లకు చేరే ప్రమాదం ఉంది. వడ్డీలే చెల్లిస్తే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో సీఎం జగన్‌ సమాధానం చెప్పాలి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం రాష్ట్ర అప్పులు జీఎస్‌డీపీలో 35% మించకూడదు. వైకాపా ప్రభుత్వం 2021మార్చి నాటికి చేసిన అప్పులు 44.04శాతానికి చేరుకున్నాయి. అవి చెల్లించడానికి మళ్లీ అప్పులు చేస్తున్నారు. తీసుకున్న అప్పుల్లో దాదాపు 81% సొమ్మును కేవలం రెవెన్యూ ఖర్చుల కోసం వినియోగించడం అత్యంత ప్రమాదకరం. మూడున్నరేళ్లలో రాష్ట్ర తలసరి అప్పు రూ.67 వేలకు చేరింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 331 రోజులు అప్పులు చేయాల్సి రావడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అద్దం పడుతోంది. రిజర్వు బ్యాంకు వద్ద రాష్ట్రం ఉంచాల్సిన కనీస నగదు నిల్వ రూ.1.94 కోట్లు 330 రోజులకుపైగా నిర్వహించలేకపోయారు...’ అని యనమల వివరించారు. కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్‌ వంటి సంస్థల విషయంలో మాట తప్పి.. మడమ తిప్పి ప్రజల్ని మోసం చేశారన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని