కేసీఆర్‌ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి

తెరాస పేరుతో ఓట్లేయించుకుని అధికారం చేపట్టిన కేసీఆర్‌కు తన పార్టీని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చాక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Published : 07 Oct 2022 06:40 IST

బీఆర్‌ఎస్‌కు జెండా.. ఎజెండా లేవు

మజ్లిస్‌తో కలిసి కల్లోలానికి కుట్ర

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస పేరుతో ఓట్లేయించుకుని అధికారం చేపట్టిన కేసీఆర్‌కు తన పార్టీని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)గా మార్చాక ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, వెంటనే రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పేరుతో ఎన్నికలకు వెళ్లాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో చెల్లని రూపాయి కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తారు? ఆయన ఖేల్‌ ఖతం.. దుకాణం బంద్‌ అయినట్లేనని వ్యాఖ్యానించారు. రేపు ప్రపంచ రాజ్యసమితి (పీఆర్‌ఎస్‌) కూడా పెడతారేమో..ఐక్యరాజ్యసమితి (ఐరాస) అత్యవసర సమావేశం పెట్టి చర్చిస్తదేమో అంటూ ఎద్దేవాచేశారు. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ- బీఆర్‌ఎస్‌కు జెండా, ఎజెండా లేదనీ, తెరాస వ్యవస్థాపక సభ్యుల్లో ఇప్పుడెంతమంది ఉన్నారో చెప్పాలని.. సొంత పార్టీ నాయకుల అభిప్రాయాల్లేకుండా జాతీయ పార్టీ పెట్టారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. దేశంలో సొంత విమానం కొన్నది కేఏ పాల్‌, కేసీఆరేనని.. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారేమో అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. పాత్రికేయులకు సొంత ఇళ్లు ఇస్తామంటూ ముఖ్యమంత్రి మోసం చేశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చేది భాజపాయేనని పాత్రికేయులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తుందని అన్నారు. బీఆర్‌ఎస్‌కు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పాలని డిమాండ్‌్ చేశారు. స్వయంపాలన, తెలంగాణ అస్తిత్వం కాపాడుకోవాలంటూ ఇన్నాళ్లు మాట్లాడారు. జాతీయ పార్టీ నాయకులు టూరిస్టుల్లా వచ్చిపోతుంటారని విమర్శలు చేశారు. టూరిస్టు మాదిరి ఇప్పుడు ఎక్కడికి వెళతారు?’ అంటూ కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు.‘‘దివాలా తీసిన కంపెనీలు పేరు మార్చుకుని వ్యాపారం చేసినట్లుగా తెరాసకు కేసీఆర్‌ కొత్తబోర్డు తగిలించారు. దేశవ్యాప్తంగా మద్దతన్నారు... అతీగతిలేని కుమారస్వామి ఒక్కడే ఉన్నారు. ముస్లింల అంశం గతంలో దేశవిభజనకు కారణమైంది. ఒవైసీతో కలిసి మైనార్టీలు అధికంగా ఉన్నచోట 30-40 ఎంపీ సీట్లు సాధించి చక్రం తిప్పుతానని కేసీఆర్‌ మంత్రులతో అన్నారట. తెరాస, మజ్లిస్‌ కలిసి దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నిస్తున్నాయి’’..అని సంజయ్‌ ఆరోపించారు. కార్యక్రమంలో ఎన్వీ సుభాస్‌, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ప్రేమేందర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.


తెలంగాణతో కేసీఆర్‌కు తెగిన బంధం: ఈటల

గూట్లో రాయి తీయలేని వ్యక్తి ఏట్లో రాయి తీయడానికి పోయినట్లుగా కేసీఆర్‌ తీరు ఉందని భాజపా జాతీయ కార్యవర్గసభ్యుడు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విమర్శించారు. భారత్‌ రాష్ట్ర సమితి ప్రకటనతో తెలంగాణకు కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందని ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. ‘ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని మరిచిపోయేట్టు చేసి, తన ముద్ర ఉండే పార్టీని కేసీఆర్‌ స్థాపించారు. జాతీయ పార్టీగా మార్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి నమ్ముకున్నది డబ్బు, మద్యం ప్రలోభాలనే. అక్రమంగా సంపాదించిన డబ్బుతో దేశంలో రాజకీయం చేయాలని పగటికలలు కంటున్నరు’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని