మునుగోడుకు గులాబీ దండు!

మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అధికార పార్టీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Updated : 07 Oct 2022 09:05 IST

కేటీఆర్‌, హరీశ్‌రావు సహా 15 మంది మంత్రులకు బాధ్యతలు

ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్‌లూ క్షేత్రస్థాయికి

ఈనాడు, నల్గొండ-నాంపల్లి, న్యూస్‌టుడే: మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పరాజయం చవిచూసిన అధికార పార్టీ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తెరాసను.. భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)గా మారుస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మునుగోడులో గెలిచి తీరాలనే సంకల్పంతో ఉన్న అధినేత అందుకోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో ఎంపీటీసీ పరిధిని ఒక యూనిట్గా విభజించారు. ఆయా యూనిట్లలో ఎక్కువ ఓటర్లున్న సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని.. అదే సామాజికవర్గానికి చెందిన 15 మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబీ, జడ్పీ ఛైర్మన్‌లు కలిపి 71 మందికి ఇన్‌ఛార్జులుగా బాధ్యతలు అప్పగించారు. ప్రతి ఓటరును కలవాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామ ఇన్‌ఛార్జిగా కేసీఆర్‌ వ్యవహరిస్తారని ప్రచారం జరిగినప్పటికీ..ఆ బాధ్యతలను ఎమ్మెల్సీ, ఉమ్మడి నల్గొండ జిల్లా తెరాస ఇన్‌ఛార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావుకు అప్పగించారు. గట్టుప్పల్‌, మర్రిగూడ మండల కేంద్రాల బాధ్యతలను మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పర్యవేక్షించనున్నారు. చండూరు మండలంలో బోడంగిపర్తి- మంత్రి కొప్పుల ఈశ్వర్‌, చౌటుప్పల్‌ మండలంలో ఆరెగూడెం-మల్లారెడ్డి, డి.నాగారం-ప్రశాంత్‌రెడ్డి, మర్రిగూడ మండలంలో దామెర భీమనపల్లి-నిరంజన్‌రెడ్డి, మునుగోడు మండలంలో మునుగోడు-1-జగదీశ్‌రెడ్డి, కొరటికల్‌-పువ్వాడ అజయ్‌, నాంపల్లి మండలంలో..నాంపల్లి-తలసాని, పస్నూరు-సబిత, నారాయణపురం మండలంలో..నారాయణ్‌పూర్‌-2-గంగుల, పొర్లగడ్డ తండా-సత్యవతి, సర్వేల్‌-1-ఇంద్రకరణ్‌రెడ్డి, చండూరు పురపాలికలో 2, 3 వార్డులు- ఎర్రబెలి,్ల చౌటుప్పల్‌ పురపాలికలో 1,3 వార్డులు శ్రీనివాస్‌గౌడ్‌ పర్యవేక్షించనున్నారు.  వీరంతా శుక్రవారం అనుచరగణంతో ఆయా గ్రామాలకు చేరుకోనున్నట్లు సమాచారం.

మర్రిగూడపై దృష్టి
కిష్టరాయిన్‌పల్లి, చర్లగూడెం జలాశయాల నిర్మాణంతో మర్రిగూడ మండలంలోని గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో భూ నిర్వాసితులు కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి ఓట్లు 5వేలకుపైగా ఉండటంతో ఉప ఎన్నికలో నష్టం జరగకుండా తెరాస పావులు కదుపుతోంది.  ఇక్కడి సమస్యల పరిష్కారం కోసమే మర్రిగూడ బాధ్యతలు హరీశ్‌రావుకు అప్పగించారనే ప్రచారం ఉంది. పద్మశాలీ సామాజికవర్గం అధికంగా ఉన్న గట్టుప్పల్‌ను మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని