Pawan Kalyan: ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతో కొడతా

‘వైకాపా గూండాల్లారా.. ఇప్పటివరకు పవన్‌కల్యాణ్‌ మంచితనం, సహనం, సహృదయం చూశారు. అదే మిమ్మల్ని రక్షించింది. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం ఎప్పుడో చెప్పండి. నేను దేనికైనా రెడీ. ఎంతమంది వైకాపా గూండా ఎమ్మెల్యేలు వస్తారో అంతా బయటకు రండి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Updated : 19 Oct 2022 07:16 IST

చావో రేవో రాజకీయాల్లోనే

వైకాపా కాపు ఎమ్మెల్యేల్లారా.. మీ కులాన్ని తగ్గించుకోవద్దు

భాజపాతో కలిసి బలంగా పనిచేయలేకపోయాం.. వ్యూహాలు మార్చుకుంటాం

తెలంగాణలో 7-14 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ: పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘వైకాపా గూండాల్లారా.. ఇప్పటివరకు పవన్‌కల్యాణ్‌ మంచితనం, సహనం, సహృదయం చూశారు. అదే మిమ్మల్ని రక్షించింది. ఈరోజు నుంచి గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం ఎప్పుడో చెప్పండి. నేను దేనికైనా రెడీ. ఎంతమంది వైకాపా గూండా ఎమ్మెల్యేలు వస్తారో అంతా బయటకు రండి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘ప్యాకేజీ స్టార్‌ అంటే చెప్పుతీసి దవడ వాచిపోయేలా కొడతాను. తమషాగా ఉందా?’ అని తన కాలి చెప్పు తీసి చూపిస్తూ హెచ్చరించారు. చావో రేవో రాజకీయాల్లోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ సందర్భాల్లో సీఎం, వైకాపా నేతలు, డీజీపీ తదితరులు చేసిన వ్యాఖ్యలు, వైకాపా నేతల దౌర్జన్యాలు, దాడులు తదితరాలతో కూడిన వీడియో క్లిప్పింగ్‌లను ప్రదర్శించారు.

వైకాపాలో నీచుల సమూహం

‘వైకాపాలో నీచుల సమూహం ఎక్కువ. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి, రామనారాయణరెడ్డి వంటి బూతులు మాట్లాడని, పద్ధతి కలవారు మాత్రం ఇందులోకి రారు. నాకు భాషరాదు అనుకున్నారా? నేను లండన్‌, న్యూయార్క్‌లో పెరిగాను అనుకుంటున్నారా? నేను పుట్టింది బాపట్ల. ఏదో సన్నగా, నీరసంగా ఉంటాం. సినిమాల్లో నటిస్తాం. సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా? బాపట్ల గొడ్డుకారం తిన్నవాడిని. చీరాలలో రథాల వద్ద పెరిగినోడిని. ఒంగోలు వీధి బడిలో చదువుకున్న వాడిని. సభ్యత, సంస్కారం ఉన్నాయి కాబట్టి ఎన్నిసార్లు తిట్టినా పోనీలే అని భరించాను. మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే మీకు మర్యాద ఇస్తాం. మీ వద్ద క్రిమినల్స్‌, రౌడీలు, గూండాలు ఉన్నారా? అయినా ఒంటి చేత్తో వస్తాం’ అని పవన్‌కల్యాణ్‌ హెచ్చరించారు.

కులాన్ని తగ్గించుకోవద్దు 

‘వైకాపాలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ చెబుతున్నా.. మీ నాయకుడికి అడుగులకు మడుగులు ఒత్తితే నాకు సమస్యలేదు. మీరు తగ్గితే తగ్గండి. కులాన్ని తగ్గించొద్దు. బంతి, కొట్టు, సన్నాసి అనే ముగ్గురు కాపులు.. నాకు బొడ్డుకోసి పేరు పెట్టినట్లుగా మాట్లాడతారు. కులాన్ని కించపరిస్తే నాలుక కోస్తా. ఊడిగం చెయ్యాలంటే బూతులు తిట్టే పెద్దమనిషి వద్దకు వెళ్లి కాళ్లు ఒత్తుకోండి. నన్ను ఈ గొడవల్లోకి లాగితే సహించను. బంతి చామంతి పూబంతి ఏమో.. నన్ను మా సోదరుడంటాడు. ఎవడు మీకు సోదరుడు? వాళ్లకు అడుగులు మడుగులు ఒత్తే మీకు నేను సోదరుడు ఏమిటి? తాడేపల్లిగూడేనికి చెందిన పెద్దమనిషి కొట్టు.. హుందాగా తెల్లబట్టలు వేసుకొని నాకు రాజకీయం తెలియదు అంటారు. నేను రాజకీయం ఏమిటో చేసి చూపిస్తాను. క్రిమినల్‌, అవకాశవాద రాజకీయాలు మీరు చేస్తారు. నేను సిద్ధాంతపరమైన రాజకీయాలు చేస్తాను. భారత రాజ్యాంగం కల్పించిన నా భావప్రకటన స్వేచ్ఛతో ఇలా మాట్లాడుతున్నాను’ అని పేర్కొన్నారు.

మీరూ చేసుకోండి పెళ్లిళ్లు..

‘మాట్లాడితే మూడు పెళ్లిళ్లు అంటారు. మీరూ చేసుకోండి ఎవరు కాదన్నారు? మొదటి భార్యకు విడాకులిచ్చి రూ. 5 కోట్లు ఇచ్చాను. తర్వాత చేసుకున్న రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చాను. ఆమెకు విడాకులిచ్చాకే మూడో పెళ్లి చేసుకున్నాను. ఒక్కరిని పెళ్లి చేసుకొని, 30 మందితో తిరిగే మీకేంటి నేను చెప్పేది? స్కార్పియో కొనుగోలు చేసినా, దానికి డబ్బులు వాళ్లు, వీళ్లు ఇచ్చారని ప్రచారం చేస్తున్నారు. నేను ఎంత సంపాదిస్తానో తెలుసా మీకు? గత 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను. రూ.100-120 కోట్లు సంపాదించాను. జీఎస్టీ కాకుండా రూ. 33.37 కోట్లు పన్నుగా చెల్లించా. నా బిడ్డల భవిష్యత్‌ కోసం ఉంచిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ను తీసి, పార్టీ కార్యాలయం పెట్టాను. అనేక నిధులు వివిధ సాయాల కింద ఇచ్చాను’ అని పేర్కొన్నారు. ‘చావో రేవో రాజకీయాల్లోనే. పార్టీని పోషించేందుకు సినిమాలు చేస్తా. వీళ్లలా మనకు సిమెంట్‌ పరిశ్రమలు లేవు. దోపిడీలు చేయం. మన సినిమాలు గురించి మాట్లాడితే.. మీరు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదిస్తున్నారని ప్రశ్నించండి. వైకాపా నేతలు పద్ధతిగా మాట్లాడితేనే పద్ధతి. వాళ్లు రాడ్లు పట్టుకొస్తే మనం రాడ్లు తీద్దాం. అన్ని డిబేట్లకు వెళ్లండి. పాలసీలపై చక్కగా మాట్లాడండి. వాళ్లు ఏందిరా అంటే మాత్రం పబ్లిక్‌గా కుమ్మేసి అక్కడే కొట్టండి. ఏపీలో జనసేన జెండా ఎగరేద్దాం’ అని నిర్దేశించారు.

మీకు కాలితేనేనా నొప్పి?

‘భారతమ్మను అనేశారని వైకాపావాళ్లు ఇంత గోలచేశారే? నా కన్నతల్లి అంజనాదేవిని ఎంత నీచంగా తిట్టించారు? తప్పటడుగులు వేసే నా బిడ్డలను కూడా తిట్టించారు. అంటే మీకు కాలితేనేనా నొప్పి. మీరు అన్నపుడు మాకు నొప్పిరాదా? ఈ యుద్ధంలో సీఎం పదవి వరిస్తే సంతోషం. అప్పుడు తొలుత అభివృద్ధి, తర్వాత వీళ్ల తాటతీయడం గ్యారంటీ. భగవంతుడు ఆ అవకాశం ఇవ్వాలని కోరుకుందాం’ అని పేర్కొన్నారు.

బూత్‌ల వద్ద నిలబడగలిగేవారు కావాలి

‘మన దగ్గర బలం, పోరాట పటిమ ఉన్నాయి. పోలింగ్‌ నిర్వహణ చేసే సత్తా మనకు సరిపోవడంలేదు. బూత్‌ల వద్ద ఏజెంట్లుగా నిలబడగలిగేవారు కావాలి. అంటే ఓ రకంగా యుద్ధం చేయడమే. అధికారమంతా కొన్ని కులాల వద్దే పెట్టుకుంటే ఎలా? మా పార్టీలో అన్ని కులాల వాళ్లు ఉన్నారు. నాకు కులంలేదు. అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలను తరిమేద్దాం, అణగదొక్కేద్దాం అనే పిచ్చిమాటలు వద్దు. ఇంకొకరి ఎదుగుదల మనకు ఇబ్బంది కాదు. మన ఎదుగుదల మనకు ముఖ్యం’ అని పేర్కొన్నారు.

వైకాపా వారికి అమరుల పేర్లయినా తెలుసా?

‘విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం 32 మంది చనిపోయారు. వైకాపావారికి వారి పేర్లు అయినా తెలుసా? బూతుల పంచాంగం తప్ప ఏదీ తెలియదు. ఉత్తరాంధ్ర గురించి మీకేమి తెలుసురా? ఇంతమంది ఎంపీలు ఉన్నారు కదా? స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు గనులు తీసుకురాలేకపోయారు? స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నేతలకు చెబుతున్నా.. నేను చిత్తశుద్ధితో ఉన్నాను. మీరు నిలబడతాం అంటే చెప్పండి. విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా కాపాడే బాధ్యత మేం తీసుకుంటాం. మమ్మల్ని బావిలోకి నెట్టేసి మీరు రాబోమంటే కుదరదు. మీ కోసం దెబ్బలు తింటా, జైలుకైనా వెళ్తా. స్టీల్‌ప్లాంట్‌ పోతుంటే విశాఖ జిల్లాలో ఉన్నవారికి కోపం ఎందుకు రాదు? భయమా?’ అని అన్నారు.

భాజపాతో బలంగా పనిచేయలేకపోయాం

‘నేటి నుంచి రాజకీయ ముఖచిత్రం మారబోతోంది. ప్రాణాలిచ్చే లక్షలమందిని పెట్టుకొని భాజపాను రోడ్‌ మ్యాప్‌ అడుగుతావు ఏమిటి? అని ఉండవల్లి ఏదో ఇంటర్వ్యూలో తిట్టారు. భాజపా వాళ్లపై గౌరవం ఉంది. అలాగని నా స్థాయిని చంపేసుకోను. కాకపోతే భాజపాతో పొత్తు కుదిరినా ఎక్కడో బలంగా పనిచేయలేకపోయాం. అది భాజపా రాష్ట్రస్థాయి నేతలకు, మాకు తెలుసు. కలిసి వెళ్దాం అనుకున్నపుడు రోడ్‌ మ్యాప్‌ ఇవ్వకపోతే కాలం గడిచిపోతోంది. పవన్‌కల్యాణ్‌ పదవి కోసం ఇంత ఆరాటపడడు. రౌడీలు రాజ్యాలు ఏలుతుంటే, గూండాలు గదమాయిస్తుంటే ప్రజలను రక్షించుకోవడానికి నా వ్యూహాలు మార్చుకోవాల్సి వస్తుంది. ముస్లింలు వైకాపాను నమ్మే బదులు, జనసేనను నమ్మండి. మీ వక్ఫ్‌బోర్డు స్థలాలను వైకాపా నేతల్లా మేం కాజేయం’ అని పేర్కొన్నారు.

తెలంగాణలో కొండగట్టు నుంచి యాత్ర

‘తెలంగాణ నుంచి వచ్చిన కార్యవర్గానికి చెబుతున్నా. ఏపీ అభివృద్ధి తెలంగాణకు చాలా అవసరం. లేకపోతే శ్రీకాంతాచారి వంటి ఆత్మబలిదానాలు నిష్ప్రయోజనం అవుతాయి. 7 లేక 14 అసెంబ్లీ స్థానాలు? 2 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేద్దామా? ఇంకా ఎక్కువ చేద్దామా? అనేది మీరు నిర్ణయించి చెప్పండి. కొండగట్టు నుంచి యాత్ర మొదలు పెడదాం. పోలీసులు మాకు శత్రువులు కాదు. రేపు మీరు మా ప్రభుత్వం కింద పనిచేస్తారు. గుర్తుంచుకోండి’ అని హితవు పలికారు.


సీఎం పర్యవేక్షణలోనే విశాఖలో భయానక వాతావరణం: మనోహర్‌

విశాఖలో పవన్‌కల్యాణ్‌ కోసం వచ్చిన ప్రజలు, అభిమానులను లైవ్‌లో సీఎం చూసి, తట్టుకోలేక పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి భయానక వాతావరణం సృష్టించారని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ విమర్శించారు. 30 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదన్నారు. అరెస్ట్‌ చేసి, కేసులు పెట్టిన పార్టీ నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలకు అండగా ఉంటామని తీర్మానం చేశారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు మాట్లాడుతూ.. కుట్రపూరిత రాజకీయాలకు బలికావడానికి సిద్ధంగా ఉన్నానని పవన్‌ కల్యాణ్‌ అన్నారని, అదే పరిస్థితి వస్తే మొదట బలయ్యేది తానేనని తెలిపారు. ఎవరైనా పవన్‌ కల్యాణ్‌పై చేయి వేయాలంటే తన శవాన్ని దాటివెళ్లాలన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని