TRS: తెరాసలోకి స్వామిగౌడ్‌

భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌లు శుక్రవారం ఆ పార్టీని వీడారు. పార్టీకి రాజీనామా చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విడివిడిగా లేఖలు రాశారు.

Updated : 22 Oct 2022 06:17 IST

దాసోజు శ్రవణ్‌ కూడా

భాజపాను వీడి కారెక్కిన ఇద్దరు నేతలు

సీఎం కేసీఆర్‌తో భేటీ

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో  పార్టీలో చేరిక

ఈనాడు, హైదరాబాద్‌: భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతలు స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌లు శుక్రవారం ఆ పార్టీని వీడారు. పార్టీకి రాజీనామా చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు విడివిడిగా లేఖలు రాశారు. అనంతరం వారు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. వారిని సీఎం ఆప్యాయంగా పలకరించి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. మునుపటి ఉత్సాహంతో పనిచేయాలని, మునుగోడు ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ ఆహ్వానం మేరకు స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌లు తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. అనంతరం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావును కలవగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

గుజరాత్‌ నేతల పార్టీకి బుద్ధిచెప్పాలి: కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘స్వామిగౌడ్‌, శ్రవణ్‌లు వారి సొంత ఇంటికి చేరుకున్నారు. స్వామిగౌడ్‌ ...సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రం కోసం వీరోచిత పోరాటం చేశారు. దాసోజు స్వయంసిద్ధ ప్రభావశీల నేత. ఉద్యమకాలంలో కలిసి పనిచేసిన వారు తిరిగి రావడం ఆనందించదగ్గ పరిణామం. వారితో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. వారి సేవలను పార్టీ అన్ని విధాలా ఉపయోగించుకుంటుంది. తెలంగాణ కోసం అణువణువూ తపించే నేత కేసీఆర్‌ మాత్రమే. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గమనిస్తే నూటికి నూరు శాతం తెలంగాణ ప్రజా ప్రయోజనాలకు కాపాడే శక్తి ఆయనకు మాత్రమే ఉందని అంగీకరిస్తారు. ఈ రోజు దేశం కోసం ఆయన ముందడుగు వేస్తున్నారు.రాజకీయ పునరేకీకరణకు ఇదే సరైన సమయం. భాజపా వంటి గుజరాత్‌ నేతల పార్టీకి బుద్ధి చెప్పి తెలంగాణ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రతీ ఒక్కరూ కలిసిరావాలి. మునుగోడు ఉపఎన్నిక పేరిట దిల్లీ పెత్తనాన్ని తెలంగాణపై మోపాలనే భాజపా కుట్రలను చిత్తు చేస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.  


ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో భాజపా విఫలం: స్వామిగౌడ్‌

మిగౌడ్‌ మాట్లాడుతూ, మళ్లీ తెరాసలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.‘‘విభజన సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతోనే భాజపాలో చేరాను. కేంద్ర పెద్దలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా అవి నెరవేరడం లేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించడంలో భాజపా విఫలమైంది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరాను. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగే నాయకుడు కేసీఆర్‌ మాత్రమే. ఉద్యమంలో పనిచేసిన ప్రతి బిడ్డా కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయన నేతృత్వంలో దేశ సంక్షేమం కోసం అందరం కలిసి పని చేస్తాం’’ అని తెలిపారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐకాస నేతగా ఉద్యమంలో స్వామిగౌడ్‌ కీలకపాత్ర పోషించారు. పదవీ విరమణ అనంతరం 2013లో తెరాసలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 వరకు శాసనమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. 2020 నవంబరులో తెరాసను వీడి భాజపాలో చేరారు. ఆ పార్టీలో ఇమడలేక రెండేళ్లకే రాజీనామా చేసి బయటికి వచ్చారు.


చివరి శ్వాస వరకూ కేటీఆర్‌తోనే: దాసోజు

కేసీఆర్‌ చేయి పట్టుకొని ఉద్యమంలో గొంతుకగా పనిచేశానని, అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పట్లో తెరాసను వీడానని దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సొంతగూటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో భాజపాలోకి వెళ్లాను. కానీ అందులో కొందరు నాయకులు మూస రాజకీయాలు చేస్తున్నారు. అక్కడ అంతా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులే. బడుగు, బలహీనవర్గాలకు స్థానమే లేదు. అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ కేసీఆర్‌ తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారు. నవభారత నిర్మాణం కోసం ఉడతా భక్తిగా తెరాసలో చేరుతున్నాను. చివరిశ్వాస వరకూ కేటీఆర్‌కు అండగా ఉంటాను’’ అని శ్రవణ్‌ తెలిపారు. ఉస్మానియా విద్యార్థి నేత దాసోజు శ్రవణ్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ప్రజారాజ్యం పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తెరాసలో చేరి పోలిట్‌బ్యూరో సభ్యుని స్థాయికి ఎదిగారు. 2014లో తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండు నెలల క్రితం భాజపాలో చేరారు. తాజాగా ఆ పార్టీని వీడి తెరాసలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని