Dharmana: జగన్‌కు జై అనడానికి ఇబ్బందేంటి?.. ఉత్తరాంధ్రులు నోరెందుకు విప్పడం లేదు: మంత్రి ధర్మాన

ప్రాంతాల అభివృద్ధి కంటే మంత్రి పదవి తనకు గొప్ప కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్రవాసులు నోరెందుకు విప్పడం లేదు.

Updated : 24 Oct 2022 09:38 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: ప్రాంతాల అభివృద్ధి కంటే మంత్రి పదవి తనకు గొప్ప కాదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. విశాఖ రాజధాని సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘విశాఖ రాజధాని కోసం ఉత్తరాంధ్రవాసులు నోరెందుకు విప్పడం లేదు. ఎందుకంత కష్టంగా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డికి జై అనడానికి వచ్చిన ఇబ్బందేంటి. మా ప్రభుత్వం ఏదైనా తప్పు చేసిందని చెబితే సరిదిద్దుకుంటాం. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడం కంటే మంత్రి పదవేం నాకు గొప్ప కాదు. నేను రేపో మాపో రాజకీయాల నుంచి పదవీ విరమణ పొందనున్నాను. రాజధాని విషయంలో యువతే ఆలోచించుకోవాలి.

విశాఖపట్నంలో రాజధాని నిర్మాణానికి కేవలం రూ.1,500 కోట్లు సరిపోతాయి. అమరావతిలా రూ.లక్షల కోట్లు అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేర్చేందుకు మేం సమిధలుగా మారుతాం. ఈ విషయం జగన్‌మోహన్‌రెడ్డికి కూడా చెప్పాను. రాజధానుల కోసం ఇంత రాద్దాంతం అవసరం లేదని గతంలో శివరామకృష్ణన్‌ కమిటీ సూచించింది. అది అమలు చేస్తే అయిపోతుంది. ఉత్తరాంధ్రలో రాజధాని ఉద్యమం నడపడానికి ధర్మాన నాయకుడా.. మరెవరూ లేరా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యమంలోకి ఎవరైనా రావొచ్చు. మన ప్రాంతానికి వచ్చిన హక్కుల్ని ఇతరులు లాక్కోవడంపై ప్రతి ఒక్కరూ గొంతెత్తాలి’ అని అన్నారు. సమావేశంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని