Prashant kishor: జగన్‌కు సాయపడటం కంటే కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి పాటుపడాల్సింది

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వంటివారు తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు తాను సాయపడడం కన్నా.. కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి కృషి చేసి ఉంటే బాగుండేదని జన సురాజ్‌ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు.

Updated : 31 Oct 2022 07:38 IST

ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలు

పట్నా: ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ వంటివారు తమ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు తాను సాయపడడం కన్నా.. కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి కృషి చేసి ఉంటే బాగుండేదని జన సురాజ్‌ వ్యవస్థాపకుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. అసలైన ‘మహాత్మాగాంధీ కాంగ్రెస్‌’కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడించగలమనేది తనకు చాలా ఆలస్యంగా అర్థమైందని చెప్పారు. బిహార్‌లో 3,500 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న పీకే.. ఆదివారం పశ్చిమ చంపారన్‌ జిల్లా లౌరియాలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ నేతృత్వంలోని కమలదళం విజయ యాత్రను అడ్డుకోవడంలో విపక్షాల కూటమి సమర్థతపై అనుమానాలు వ్యక్తంచేశారు. భాజపాను అర్థం చేసుకోలేనిదే ఆ పార్టీని ఓడించలేరని విశ్లేషించారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఓ కప్పులో పైపైన ఉండే నురుగు భాజపా అయితే దానికింద ఉండే అసలైన కాఫీయే ‘రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌’ (ఆరెస్సెస్‌) అని వ్యాఖ్యానించారు. సామాజిక వ్యవస్థలోఆరెస్సెస్‌ భాగమైపోయిందనీ, షార్ట్‌కట్స్‌తో దానిని ఓడించలేరని చెప్పారు.

నీతీశ్‌తో అందుకే కటీఫ్‌

నీతీశ్‌ కుమార్‌పైనా ప్రశాంత్‌ కిశోర్‌ విమర్శల దాడి కొనసాగించారు. ‘‘పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ ఎంపీలు పార్లమెంటులో అనుకూలంగా ఓటేశారని తెలిసి చాలా బాధపడ్డా. నీతీశ్‌ను నిలదీశా. బిహార్‌లో ఎన్‌ఆర్‌సీ అమలు కానివ్వనని హామీ ఇచ్చారు. రెండు నాల్కల ధోరణి చూశాకే ఆయనతో కలిసి పని చేయలేనని నాకు అర్థమైంది’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని