Munugode bypoll: ఓటుకు పోటెత్తారు

చెదురుమదురు ఘటనలు..ఉద్రిక్తత నడుమ మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ సమయానికి బారులు తీరిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు.

Updated : 04 Nov 2022 07:43 IST

మునుగోడులో 93.13% పోలింగ్‌
ఉద్రిక్తత నడుమ ఉప ఎన్నిక
కొన్ని ప్రాంతాల్లో భాజపా, తెరాస శ్రేణుల ఘర్షణలు
పలు గ్రామాల్లో రాత్రి 10.30 వరకు సాగిన ఓటింగ్‌
6న ఓట్ల లెక్కింపు

ప్రస్తుత ఓటింగ్‌ శాతం.. 93.13

2018 ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం.. 91.31

ఈనాడు, నల్గొండ : చెదురుమదురు ఘటనలు..ఉద్రిక్తత నడుమ మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్‌ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఆ సమయానికి బారులు తీరిన వారందరికీ ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం కల్పించారు. రాత్రి 10.30 గంటల వరకు ఓటు వేశారు. చివరి ఈవీఎం అర్ధరాత్రి దాటాక 1.30 గంటల ప్రాంతంలో స్ట్రాంగ్‌రూంకి చేరింది. శుక్రవారం వేకువజామున 4.40 గంటలకు స్ట్రాంగ్‌రూంకు సీల్‌ వేశారు. ఉప ఎన్నికలో రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 93.13 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 2,41,805 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 2,25,192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.

 విజయంపై ప్రధానపార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈ నెల 6న నల్గొండలో జరగనున్న ఓట్ల లెక్కింపులో వారి భవితవ్యం తేలనుంది. ఉదయం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా పలుచోట్ల తెరాస, భాజపా శ్రేణులు ఘర్షణకు దిగాయి. పరస్పరం ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలో పోలింగ్‌ ఉదయం కొంత మందకొడిగా ప్రారంభమైంది. ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని బూత్‌ల్లో పోలింగ్‌ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట ముగిసేసరికి 41.30 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. ఆ తర్వాత ఓటర్లు వరుస కట్టారు. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య దాదాపు 36 శాతం పోలింగ్‌ నమోదు కావడం విశేషం. వృద్ధులు, వికలాంగులకు సరిపడా వీల్‌చైర్లు లేకపోవడంతో ఓటేయడానికి వారు ఇబ్బంది పడ్డారు. తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్థులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, స్రవంతి సహా పోటీ చేసిన 47మంది అభ్యర్థుల్లో 15 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నకిరేకల్‌ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన బ్రాహ్మణవెల్లంలో ఓటు హక్కు ఉంది.

ఉదయం నుంచే ఘర్షణలు

నియోజకవర్గ వ్యాప్తంగా ఉదయం నుంచే తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. 

* మునుగోడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ బూత్‌ వద్ద తెరాస, భాజపా కండువాలతో ప్రచారం నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించగా.. పోలీసులు పరిస్థితి చక్కదిద్దారు. డబ్బులు పంపిణీ చేయడానికి వెళ్తున్నారనే కారణంతో మునుగోడు సెంటర్‌లో మాజీ ఎంపీ వివేక్‌ పీఏ రమణారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

*  చండూరు పురపాలికలో స్థానికేతరులు ఉన్నారని భాజపా నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తెరాస, భాజపా నేతల మధ్య తోపులాట చేసుకోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తాను ఓటు వేయడానికి వరుసలో నిల్చుంటే కొట్టారని చండూరు పురపాలిక వైస్‌ ఛైర్మన్‌ సుజాత భర్త దోటి వెంకటేశ్‌ యాదవ్‌ ఆరోపించారు. ఓటర్లకు పంపిణీ చేయడానికి తీసుకొచ్చిన రూ.2 లక్షలను చండూరులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

*  చండూరు పురపాలిక పరిధిలోని బంగారిగడ్డలోని లెనిన్‌ కాలనీలో తమకు డబ్బులు అందలేదని కొంత మంది మహిళలు ఓ ప్రధాన పార్టీ నాయకులు ముందు నిరసన తెలిపారు. దీంతో సదరు పార్టీ నాయకులు డబ్బులివ్వడంతో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

*  మర్రిగూడ మండలకేంద్రంలో సిద్దిపేటకు చెందిన తెరాస కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని.. పోలింగ్‌ నిలిపేయాలని ఆందోళన చేశారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఇదే మండలం శివన్నగూడెంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించడానికి వచ్చిన భాజపా అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిని ఇతర పార్టీల నాయకులు అడ్డుకున్నారు. మర్రిగూడలో తమపై పోలీసులు అకారణంగా దాడులు చేస్తున్నారని భాజపా కార్యకర్తలు రాజగోపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్‌రావుతో పాటూ పలువురు సీఐ, ఎస్సైలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మండలంలోని సరంపేట వద్ద రాజగోపాల్‌రెడ్డి కాన్వాయ్‌పై తెరాస నాయకులు రాళ్లు రువ్వడంతో పోలీసులు జోక్యం చేసుకొని ఆయన్ను అక్కడినుంచి పంపించేశారు. ఈ ఘటనలో ఓ పోలీసుఅధికారి పక్కనే ఉన్న మురుగుకాల్వలో పడటంతో స్వల్ప గాయాలయ్యాయి.

*  నాంపల్లి మండలం మల్లపురాజుపల్లిలో ఓ కారులో పట్టుబడ్డ రూ.10 లక్షలను పోలీసులు ఎన్నికల అధికారులకు అప్పగించారు.

*  376 ఓట్లున్న గట్టుప్పల మండలం రంగం తండా వాసులు ఎన్నిక బహిష్కరించారు. తమ తండాలో మౌలిక వసతులు లేవని, తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు వేస్తామని తేల్చిచెప్పడంతో ఉన్నతాధికారులు ఆ గ్రామ సర్పంచితో మాట్లాడటంతో వారు ఓటేశారు. మండల కేంద్రంలోనే ఓ పార్టీకిచెందిన నాయకుడి ఇంట్లో రూ. 2.93 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు.

*  రెండు చేతుల అన్ని వేళ్లకూ ఉంగరాలు ధరించి తన గుర్తును ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించడానికి స్వతంత్ర అభ్యర్థి కేఏ పాల్‌ ప్రయత్నించారు.


నాపై దుష్ప్రచారం చేస్తున్నారు

-కాంగ్రెస్‌ అభ్యర్థి స్రవంతి 

మార్ఫింగ్‌ ఫొటోతో తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. సీఈవో వికాస్‌రాజ్‌కి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఆయనకు అందించగా... దాన్ని ధ్రువీకరించిన సీఈవో సంబంధిత మాధ్యమాలకు పంపి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. 


పోలీసుల జీపుల్లో డబ్బులు పంచారు

-భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

తెరాస నాయకులు పోలీసులు జీపుల్లోనే డబ్బులు తీసుకొచ్చి ఓటర్లకు పంచారని భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. తనపై తెరాస వాళ్లు రాళ్లు రువ్వినా పోలీసులు చేష్టలుడిగి చూశారని, భాజపా కార్యకర్తలపై అకారణంగా లాఠీఛార్జి చేశారని మండిపడ్డారు. 


భాజపా నగదు, మద్యం పంపిణీ చేస్తోంది

-మంత్రి జగదీశ్‌రెడ్డి 

చౌటుప్పల్‌, నారాయణపురం, చండూరు, నాంపల్లి మండలాల్లో భాజపా మద్యం, నగదు పంపిణీ చేస్తోందని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు మంత్రి జగదీశ్‌రెడ్డి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. 


ప్రశాంతంగా ఉప ఎన్నిక

‘మునుగోడు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. రాత్రి 10.30 గంటల వరకు 92 శాతం పోలింగ్‌ నమోదైంది. వివిధ రాజకీయ పార్టీల నుంచి మొత్తం 98 ఫిర్యాదులు వచ్చాయి. వాటిపై క్షేత్రస్థాయిలోని అధికారులు తక్షణం స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆ ఫిర్యాదులను పంపాం. నియోజకవర్గానికి సంబంధం లేని 70 మందిని బయటకు పంపాం. 3.29 కిలోల బంగారు ఆభరణాలను ...నగదు, ఇతర వస్తువులు కలిపి రూ. 8.27 కోట్లను స్వాధీనం చేసుకున్నాం. పోలింగు సందర్భంగా ఆటంకాల కారణంగా ఆరు బ్యాలెట్‌, మూడు కంట్రోల్‌ యూనిట్లు, తొమ్మిది వీవీప్యాడ్స్‌ను మార్చాం. ఓటింగ్‌ యంత్రాలను స్ట్రాంగ్‌ రూములో భద్రం చేస్తాం. ఆదివారం ఓట్ల లెక్కింపు కోసం ప్రణాళిక సిద్ధం చేశాం.

- గురువారం రాత్రి విలేకరులతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ 


అలకలు.. అసంతృప్తులు
తక్కువ మొత్తం ఇచ్చారని ఓటేయడానికి మొరాయింపు

మునుగోడు నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి: మునుగోడు ఉప ఎన్నికలో అనేక సిత్రాలు చోటుచేసుకున్నాయి. చివరి వరకు ప్రలోభాల పర్వం కొనసాగింది. తక్కువ మొత్తం ఇచ్చారని చాలా ప్రాంతాల్లో ఓటర్లు ఇళ్లనుంచి బయటకు రాలేదు. దీంతో బతిమాలి మరో రూ.వెయ్యి చెల్లించి మరీ కొందరు నాయకులు పోలింగ్‌ కేంద్రాలకు వారిని పట్టుకొచ్చారు. 

కంగుతిన్న పార్టీల కేడర్‌

ఉప ఎన్నికలో కొన్ని పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు పంచుతాయని కొద్ది రోజులుగా ఎదురుచూశామని పోలింగ్‌ ఉదయం వరకు ఎవరూ పట్టించుకోలేదని కొన్ని మండలాల్లో గ్రామీణులు బహిరంగంగానే విమర్శలు చేశారు. ఒక పార్టీ రూ.వెయ్యి పంపిణీ చేయగా తీసుకునేందుకు చాలా చోట్ల తిరస్కరించారు. గట్టుప్పల, చండూరు మండలాలలో పోలింగ్‌ ప్రారంభమైన రెండు గంటల తరువాత కూడా ఓటర్లు రాకపోవడంతో స్థానిక నాయకులకు చెమటలు పట్టాయి. మర్రిగూడ, నారాయణపురం, మునుగోడు మండలాల్లో ప్రధాన రహదారుల వెంట ఉన్న కొన్ని గ్రామాల ఓటర్లు కూడా మధ్యాహ్నం వరకు ఓటేసేందుకు బయటకు రాలేదు. అప్పటికే కొంత మొత్తం ఇచ్చిన ఓ పార్టీ చివరికి మరికొంత ఇచ్చి సర్దిచెప్పినట్లు తెలిసింది. మరో పార్టీ పది గంటల సమయంలో రహస్యంగా రూ.ఐదొందలు పంపిణీ చేసి వారి అనుచరులను సంతృప్తి పరిచినట్లు సమాచారం. చౌటుప్పల్‌, నారాయణపురం మండలాల్లో కొందరు వృద్ధులు ఏ గుర్తుకు ఓటేశారో సరిగా చెప్పకపోవడంతో నాయకులు అయోమయానికి గురయ్యారు.   

పట్నం ఓటు.. చాలా ఖరీదు గురూ!

ముంబయి, హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, రామంతాపూర్‌ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ప్రత్యేక వాహనాల్లో మధ్యాహ్నం తరువాత గ్రామాలకు చేరుకున్నారు. చౌటుప్పల్‌, నారాయణపురం, చండూరు, మర్రిగూడ, మునుగోడు మండలాలకు చెందిన వారు పెద్దఎత్తున రావడంతో కొన్ని పార్టీలు అక్కడిక్కడే రూ.4 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు తమకు రూ.3 వేలే ఇచ్చి బయటి నుంచి వచ్చిన వారికి ఎక్కువ ఇవ్వడం ఏంటంటూ కొన్నిచోట్ల నిలదీశారు.


తూర్పు అంధేరీలో ఓటర్ల నిరాసక్తత

దిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో మహారాష్ట్రలోని తూర్పు అంధేరీలో అతి తక్కువగా దాదాపు 32% ఓట్లు పోలయ్యాయి. మునుగోడును మినహాయించి చూస్తే, మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో 51 నుంచి 75 శాతానికి పైగా ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. యూపీలో కొన్ని పోలింగ్‌ బూత్‌లను అధికార భాజపా ఆక్రమించుకుందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని