గుజరాత్‌ ఆప్‌ సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్‌

గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ టీవీ పాత్రికేయుడు, యాంకర్‌ ఇసుదాన్‌ గఢ్వీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన పేరును శుక్రవారం ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.

Published : 05 Nov 2022 04:35 IST

ఇసుదాన్‌ గఢ్వీ ఎంపికైనట్లు ప్రకటించిన కేజ్రీవాల్‌
‘ఈటీవీ గుజరాతీ’ ఛానల్‌లోనూ పాత్రికేయుడిగా విధులు

అహ్మదాబాద్‌: గుజరాత్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ టీవీ పాత్రికేయుడు, యాంకర్‌ ఇసుదాన్‌ గఢ్వీ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన పేరును శుక్రవారం ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. పార్టీ సీఎం అభ్యర్థి కోసం ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన పోల్‌లో 16 లక్షలపైగా ఓటర్లు పాల్గొన్నారని. ఇందులో దాదాపు 73% మంది గఢ్వీ వైపు మొగ్గు చూపారని కేజ్రీవాల్‌ తెలిపారు. వచ్చే నెల గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. సీఎం అభ్యర్థి రేసులో ఇసుదాన్‌తో పాటు.. పాటీదార్‌ సామాజిక వర్గానికి చెందిన ఆప్‌ గుజరాత్‌ పార్టీ అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా కూడా పోటీ పడ్డారు. అయితే వెనుకబడిన తరగతి వర్గానికి చెందిన గఢ్వీనే విజయం వరించింది. వెనుకబడిన తరగతులు.. గుజరాత్‌ జనాభాలో 48% ఉన్నారు. ఇటీవల పంజాబ్‌లో కూడా ఎన్నికల ముందు పార్టీ సీఎం అభ్యర్థిని ప్రజాభిప్రాయసేకరణ ద్వారానే ఆప్‌ ఎంపిక చేసింది. అదే సూత్రాన్ని గుజరాత్‌లోనూ అమలు చేసింది. 40 ఏళ్ల గఢ్వీ.. ద్వారకా జిల్లాలోని పిపలియా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు స్థానిక టీవీ ఛానల్‌లో పాత్రికేయుడిగా కెరీర్‌ ప్రారంభించారు. ‘ఈటీవీ గుజరాతీ’ ఛానల్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వహించారు. తర్వాత వీ ఛానల్‌కు సంపాదకుడు అయ్యారు. అక్కడ గ్రామీణ, రైతు సమస్యలపై ‘మహామంథన్‌’ పేరుతో నిర్వహించిన షో... గఢ్వీకి పేరు తెచ్చింది. ఇటీవల ఆప్‌ పార్టీలో చేరారు. ప్రస్తుతం పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని