Munugode Bypoll: కారుకు ‘ఎర్ర’ ఇంధనం.. విజయంలో వామపక్షాల కీలక పాత్ర

మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయంలో వామపక్షాలు తమదైన పాత్ర పోషించాయి. సీపీఐ, సీపీఎంలకు పట్టున్న ప్రాంతాల్లో కమలంతో పోల్చితే కారు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

Updated : 07 Nov 2022 06:47 IST

28 బూత్‌లలో తెరాసకు గతంలోకన్నా 2,564 ఓట్లు అధికం

ఈనాడు, నల్గొండ, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికలో తెరాస విజయంలో వామపక్షాలు తమదైన పాత్ర పోషించాయి. సీపీఐ, సీపీఎంలకు పట్టున్న ప్రాంతాల్లో కమలంతో పోల్చితే కారు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. స్థానికసంస్థల్లో వామపక్షాలు గెలుపొందిన ఎంపీటీసీ, సర్పంచి స్థానాల్లో ఆ పార్టీల కార్యకర్తలు కారుతో కలిసి నడిచారు. చౌటుప్పల్‌, మునుగోడు, నారాయణపురం, చండూరు మండలాల్లో సీపీఐ, సీపీఎం ప్రతినిధులు ఉన్న 28 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో తెరాసకు 2018 సార్వత్రిక ఎన్నికల్లో పోలైన ఓట్లతో పోల్చితే 2,564 అధికంగా పోలయ్యాయి. మర్రిగూడ, గట్టుప్పల, నాంపల్లిల్లోనూ వామపక్షాలకు ఓటుబ్యాంకు ఉంది.

2018లో తెరాసకు 7,554 ఓట్లు

స్థానిక సంస్థల్లో సీపీఐ, సీపీఎం ప్రతినిధులున్న 28 పోలింగ్‌ బూత్‌లలో తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి 2018 ఎన్నికల్లో 7,554 ఓట్లు పోలయ్యాయి.  రాజగోపాల్‌రెడ్డికి 10,045 ఓట్లు వచ్చాయి. ప్రస్తుత ఎన్నికలో కూసుకుంట్లకు 2,564 ఓట్లు పెరిగి మొత్తం 10,118 ఓట్లు వచ్చాయి. రాజగోపాల్‌రెడ్డికి 9,536 పోలయ్యాయి.


తెరాస.. కమ్యూనిస్టుల ఐక్యతకు నిదర్శనం

మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టులు బలపర్చిన తెరాస అభ్యర్థి గెలవడం శుభపరిణామం. ప్రధానంగా తెరాస, కమ్యూనిస్టుల ఐక్యతకు నిదర్శనం 

- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

ఓటమి రాజగోపాల్‌రెడ్డిది కాదు.. మోదీది

ఉప ఎన్నికలో ఓటమి భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది కాదు. ఇది ప్రధాని మోదీ పరాజయం. ఈ ఎన్నికతో సీపీఐ, సీపీఎంల విధానం సరైనదేనని నిరూపితమైంది.

- నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి

భాజపాకు చెంపపెట్టు

ఉప ఎన్నిక ఫలితం ప్రధాని మోదీ, భాజపాలకు చెంపపెట్టులాంటిది. మునుగోడులో ప్రజాస్వామ్యం విజయం సాధించింది.

- కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

భాజపాకు మునుగోడు ప్రజల చెక్‌

తెలంగాణ గడ్డ మీద ఫాసిస్టు విధానాలతో పాగా వేయాలనుకున్న భాజపాకు మునుగోడు ప్రజలు చెక్‌ పెట్టారు.

- పోటు రంగారావు, సీపీఐ ఎంఎల్‌ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని