Munugode bypoll: భాజపాకు కర్రుకాల్చి వాతపెట్టారు

మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి అభివృద్ధికి, ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ నాయకత్వానికి పట్టంగట్టారని.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Updated : 07 Nov 2022 07:32 IST

ఉప ఎన్నికలో ఆ పార్టీ దుర్మార్గాలెన్నో
మునుగోడు తీర్పు మోదీ, షాలకు చెంపపెట్టు లాంటిది: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించి అభివృద్ధికి, ఆత్మగౌరవానికి, కేసీఆర్‌ నాయకత్వానికి పట్టంగట్టారని.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ అన్నారు. డబ్బు, పొగరుతో కళ్లునెత్తికెక్కి బలవంతపు ఉపఎన్నికను రుద్దిన నరేంద్రమోదీ, అమిత్‌షాల అహంకారానికి చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారన్నారు. భాజపాను తొక్కి... కర్రు కాల్చి వాతపెట్టారని వ్యాఖ్యానించారు. 2018 శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలను తెరాసకు కట్టబెట్టిన ప్రజలకు ప్రణమిల్లుతున్నామన్నారు. తమ అభ్యర్థికి మరింత మెజారిటీ రావాల్సి ఉందని, అయితే భాజపా జనం గొంతు నొక్కాలని ప్రయత్నించిందన్నారు.  ఎన్నికల సంఘం ఆమోదం అనంతరం భారత్‌ రాష్ట్ర సమితి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. మునుగోడు ఉపఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే తెలంగాణ భవన్‌లో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ తదితర నేతలతో కలిసి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు. తెరాస కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సామాజిక మాధ్యమ యోధులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి పార్టీని గెలిపించారంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తలను అద్భుతంగా నడిపించిన సీపీఐ, సీపీఎం నాయకులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం, పల్లా వెంకట్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, యాదగిరిరావులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇది రాజకీయ ఆత్మహత్య

‘‘రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలుంటాయని పెద్దలు చెప్పారు. ఈ ఉపఎన్నికలో అదే జరిగింది.. ఎన్నికల్లో ఇక్కడ కనిపించిన ముఖం రాజగోపాల్‌రెడ్డిదే అయినా..వెనకుండి నాటకమంతా నడిపింది అమిత్‌షా, మోదీలని ప్రజలకు స్పష్టంగా తెలుసు. దిల్లీ నుంచి రూ.వందల కోట్లను తరలించారు. ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన వెంటనే రూ.కోటితో దొరికింది భాజపా రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడు, కరీంనగర్‌ కార్పొరేటర్‌ భర్త వేణు. తర్వాత ఈటల రాజేందర్‌ పీఏ శ్రీనివాస్‌ రూ.90 లక్షలతో దొరికారు. మాజీ ఎంపీ వివేక్‌ గుజరాత్‌ నుంచి హవాలా ద్వారా రూ.2 కోట్లు తెప్పించారు. ఆయన అనుచరుడు రూ.కోటితో పట్టుబడ్డారు. వివేక్‌ గతంలో ఈటల రాజేందర్‌కు, ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డికి డబ్బులు పంపిణీ చేశారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారగానే.. ఆయన కంపెనీకి రూ.75 కోట్లను తమ కంపెనీ నుంచి బదిలీ చేశారు. హుజూరాబాద్‌ ఎన్నికలప్పుడు ఈటలకు చెందిన జమున హేచరీస్‌కు రూ.25 కోట్లు బదిలీ చేశారు. ఎక్కడ ఉపఎన్నిక జరిగినా.. ఒక హవాలా ఆపరేటర్‌ మాదిరిగా వివేక్‌ను అడ్డం పెట్టుకున్నారు. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్‌ఫ్రా రూ.5.25 కోట్లను మునుగోడులోని ఓటర్లు, భాజపా నేతల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని మేం ఈసీకి ఫిర్యాదు చేశాం. భాజపా ఒత్తిడితో ఈసీ ప్రేక్షకపాత్ర పోషించింది. కేంద్రం నుంచి 15 కంపెనీల సీఆర్‌పీఎఫ్‌ పోలీసులను దించారు. జగదీశ్‌రెడ్డిపై అన్యాయంగా నిషేధం విధించారు. ఆయన పీఏ ఇంట్లో డబ్బు దొరికిందని బూటకపు ప్రచారం చేశారు. మా పార్టీ గుర్తును పోలిన గుర్తులు గతంలో రద్దయినా మళ్లీ వాటిని జాబితాలో చేర్చారు. వాటికి ఆరువేల ఓట్లు పోలయ్యాయి. పలివెలలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మరో 12 మంది కార్యకర్తలపై దాడి చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానంటూ బండి సంజయ్‌ అర్ధరాత్రి నాటకాలు వేశారు.   వారు ఎన్ని చేసినా తెరాస గెలుపును అడ్డుకోలేకపోయారు. మేం గతంలో కొన్ని ఉప ఎన్నికల్లో ఓడాం. అయినా కుంగిపోలేదు. గెలుపు ఓటములను హుందాగా స్వీకరించే స్థితప్రజ్ఞత తెరాసకు ఉంది. భాజపాకు ఓటమిని ఒప్పుకొనే ధైర్యం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీని భాజపా రప్పించింది. కేంద్రమంత్రులతో ప్రచారం చేయించింది.  మేం కార్యకర్తల్లా పనిచేస్తే దానిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. భాజపా ఇష్టారాజ్యంగా అధికార దుర్వినియోగం చేసినా... మాకు ప్రజల ఆశీర్వాదం లభించింది. భారత్‌ రాష్ట్ర సమితి వస్తే తమ పీఠం కదులుతుందనే భయంతో ప్రధాని మోదీ పార్టీ పేరు మార్పిడిని అడ్డుకుంటున్నారు. దానిని త్వరలో తేలుస్తాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

హామీ మేరకు దత్తత

మునుగోడు ప్రజలకు తాను హామీ ఇచ్చినట్లుగానే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నానని, పెండింగులో ఉన్న పనులను వెంటనే చేపట్టి పూర్తి చేసేందుకు కృషి చేస్తానని కేటీఆర్‌ ట్విటర్‌లో తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి ఆయన అభినందనలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు