Munugode Bypoll: వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాలతో పార్టీకి నష్టం: పాల్వాయి స్రవంతి

తెరాస ధన, అంగ బలాలతో మద్యాన్ని ఏరులై పారించి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిందని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు.

Updated : 08 Nov 2022 06:45 IST

మునుగోడు(చండూరు), న్యూస్‌టుడే: తెరాస ధన, అంగ బలాలతో మద్యాన్ని ఏరులై పారించి మునుగోడు ఉప ఎన్నికలో గెలుపొందిందని కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆరోపించారు. నల్గొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలో తెరాస, భాజపాలు రూ.500 కోట్లు ఖర్చు చేశాయని ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ గురించి ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదన్నారు. తాను సీఎం కేసీఆర్‌ను కలిసినట్లుగా మార్ఫింగ్‌ ఫొటోలతో తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. దుబ్బాక, హుజూరాబాద్‌లలో సైతం ఇలాగే నీచంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోవర్టు రాజకీయాలు పార్టీకి నష్టం చేశాయని పేర్కొన్నారు. ఆయన విషయం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు. ఎన్నికలో ప్రలోభాల తీరు చూస్తుంటే కొత్తగా ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే భయపడాల్సిన పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాష్‌నేత, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని