Gorantala Madhav: మరో వివాదంలో వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. మూడున్నరేళ్లుగా అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు.

Updated : 09 Nov 2022 06:43 IST

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. మూడున్నరేళ్లుగా అద్దె, విద్యుత్తు బిల్లులు చెల్లించకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఇంటి యజమాని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని రాంనగర్‌ 80 అడుగుల రోడ్డులో ఏడున్నర సెంట్లలో రెండంతస్తుల ఇల్లు ఉంది. మాధవ్‌ ఎంపీగా గెలిచాక తాను ఉండటం కోసం మల్లికార్జునరెడ్డి ఇంటిని అద్దెకు అడిగారు. 6 నెలలే ఉండి వేరే ఇంటికి మారతానని ఒప్పందం కుదుర్చుకున్నారు. గడువు దాటినా ఖాళీ చేయలేదు.. సరికదా అద్దె కట్టడంలేదు. మరికొన్ని నెలలపాటు ఇంట్లో ఉండేలా పెద్దమనుషుల ద్వారా వ్యవహారం నడిపారు. మూడేళ్లయినా అద్దెకానీ, విద్యుత్తు బిల్లులుకానీ చెల్లించకపోవడంతో ఈ ఏడాది సెప్టెంబరులో ఖాళీ చేయాలని యజమాని కోరారు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పోలీసులు, పలువురు రాజకీయ నాయకులు కల్పించుకుని మరో 2 నెలలు (అక్టోబరు వరకు) గడువు ఇప్పించారు. అయినా మారకపోవడంతో సోమవారం యజమాని కొందరు పెద్దలతో కలిసి వెళ్లి తన ఇంటిని ఖాళీ చేయాలని కోరడానికి ప్రయత్నించగా ఎంపీ వాగ్వాదానికి దిగారు. తాను ఇల్లు మారేది లేదంటూ తెగేసి చెబుతున్నారని మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. సీఐలు శివరాముడు, జాకీర్‌ హుస్సేన్‌ సర్ది చెప్పడానికి ప్రయత్నించినా వినకపోగా తనకే హెచ్చరికలు జారీచేశారని తెలిపారు. తనకు అద్దె కింద రూ.13 లక్షలు, విద్యుత్తు బిల్లు కింద రూ. 2,50,413 చెల్లించాల్సి ఉందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని