YSRCP: ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా జన సమీకరణ

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అధికార వైకాపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.

Updated : 10 Nov 2022 07:22 IST

సభ ఏర్పాట్లపై వైకాపా తీవ్ర కసరత్తు
నియోజకవర్గాలకు బాధ్యుల నియామకం
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సమన్వయం

ఈనాడు, అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అధికార వైకాపా తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రధానిని ప్రసన్నం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. 12న ఏయూలో ప్రధాని సభకు 2 లక్షల నుంచి 3 లక్షల మందిని సమీకరించేలా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసింది. దీని కోసం ఉత్తరాంధ్రలోని దాదాపు అన్ని నియోజకవర్గాలకూ బాధ్యులను నియమించింది. విశాఖ నగర పాలక సంస్థలో వైకాపా కార్పొరేటర్లకు జనసమీకరణ లక్ష్యాలను నిర్దేశించింది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల నుంచి జనాలను తరలించేలా సన్నాహాలు చేస్తోంది. వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాట్లను సమన్వయం చేస్తున్నారు. ఆయన నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి ముత్యాల నాయుడు, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు తదితరులతో ప్రత్యేకంగా పర్యవేక్షక బృందాన్ని నియమించారు. వైకాపా విశాఖ ప్రాంతీయ సమన్వయకర్త, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి విశాఖ నేతలతో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12న ప్రధాని సభ నిర్వహించనున్న ఆంధ్ర విశ్వ విద్యాలయం క్రీడా మైదానం జనాభా సామర్థ్యం దాదాపు 1.30 లక్షలు. సభ విజయవంతం చేయడంలో భాగంగా దీనికి ఎదురుగా ఉన్న మరో మైదానాన్నీ సిద్ధం చేయిస్తున్నారు. జనాలను తరలించేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతోపాటు ఇతర వాహనాలను సమకూరుస్తున్నారు. విశాఖలో అడుగడుగునా స్వాగత తోరణాలనూ పెట్టనున్నారు. సభకు వచ్చే జనంతో పాటు ఆ రోజు విధుల్లో ఉండే సిబ్బందికి దాదాపు 5 లక్షల మేర ఆహార పొట్లాలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని విశాఖ పర్యటన అధికారిక పర్యటన అయినందున రాష్ట్ర ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేస్తున్నామని వైకాపా నేతలు ప్రకటిస్తున్నారు. దానికనుగుణంగా వారంతా ఈ ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో భాగస్వాములవడం గమనార్హం. గతంలో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని పాల్గొన్న సభకూ అధికార వైకాపాయే జన సమీకరణ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని తలదన్నేలా విశాఖలో ప్రధాని సభకు జన సమీకరణ జరిపేందుకు వైకాపా చేస్తున్న హడావుడి రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు