Kiran Royal: జనసేన నేత కిరణ్‌ రాయల్‌ అరెస్టు.. బెయిలు

జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ బాధ్యుడు కిరణ్‌ రాయల్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన నగరి పోలీసులు శనివారం అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు.

Updated : 13 Nov 2022 13:09 IST

నగరి, తిరుపతి (విద్య), న్యూస్‌టుడే: జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ బాధ్యుడు కిరణ్‌ రాయల్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన నగరి పోలీసులు శనివారం అక్కడి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నగరి జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి విష్ణువర్మ రిమాండును విధించారు. వెంటనే బెయిలు కోసం న్యాయవాదులు దరఖాస్తు చేయగా.. మంజూరు చేశారు. దీంతో కిరణ్‌ రాయల్‌ శనివారం మధ్యాహ్నం 1.15 గంటలకు విడుదలై కోర్టు నుంచి బయటకు వచ్చారు. అనంతరం ఆయన.. జనసేన తిరుపతి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇది న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. జనసేన నాయకులు మంత్రి రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంవైపు వెళుతుండగా.. ఆ మార్గంలో ఆమె నివాసం ఉండటంతో పోలీసులు వారిని అడ్డుకుని తిరుపతివైపు తరలించారు.

రాజకీయ కక్షతోనే అరెస్టు

తనను రాజకీయ కక్షతోనే అరెస్టు చేయించినట్లు కిరణ్‌ రాయల్‌ తెలిపారు. శనివారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘మంత్రి రోజాపై చేసిన వ్యాఖ్యల మీద గతనెల 18న ఓ కార్పొరేటర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాత్రి పూట పోలీసులు దౌర్జన్యంగా ఉగ్రవాది కంటే ఘోరంగా అరెస్టు చేశారు. తిరుపతి మొత్తం ఒకటిన్నరగంట పాటు తిప్పి రాత్రి 10.30 గంటలకు నగరికి తీసుకెళ్లారు. ఓ కానిస్టేబుల్‌ ఫోన్‌ నుంచి మంత్రి రోజా నాతో మాట్లాడారు. తనను దూషించినందుకు అరెస్టు చేస్తున్నారని, మీ ఇంట్లో ఆడవాళ్లను అలా మాట్లాడతావా? అని అడిగారు. పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి మీరు మాట్లాడారు కదా? అని అడిగా. నన్ను అక్రమంగా అరెస్టు చేయించడానికి తితిదే ఈవో ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మంత్రి రోజారెడ్డి కారణం. స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు కట్టారు. రాత్రి బెయిలబుల్‌ కేసులు రాసి.. ఉదయానికి నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెట్టారు. మంత్రి రోజా అధికార దుర్వినియోగంపై కోర్టులో కేసు వేస్తున్నాం. నన్ను ఏ విధంగా తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారో.. అదే రీతిలో అదే స్టేషన్‌లో 18 నెలల్లో రోజాను కూర్చోబెడతా’ అని తెలిపారు.


కిరణ్‌ రాయల్‌కు అండగా ఉంటాం: పవన్‌కల్యాణ్‌

ఈనాడు, అమరావతి: ‘జనసేన పార్టీలో ప్రతి కార్యకర్త, నాయకుడూ ఒక కుటుంబంలా కలిసిపోవడంవల్లే ఎవరికి ఏ ఇబ్బంది ఎదురైనా అండగా నిలుస్తున్నారు. ఈ సమైక్యతతోనే పాలకపక్ష అప్రజాస్వామిక విధానాలను బలంగా ఎదుర్కొంటున్నాం. కిరణ్‌ రాయల్‌పై అక్రమ కేసు బనాయించి ఆయన కుటుంబ సభ్యులను బంధించి, అరెస్టు చేసిన విధానాన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాల్సిందే’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కిరణ్‌ రాయల్‌ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. రాజకీయ కక్షతో కిరణ్‌ రాయల్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం బాధాకరమని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని