కమలం కార్యకలాపాలు వేగవంతం

అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమలదళం దృష్టి సారించింది. రాజకీయ కార్యకలాపాలను పెంచడంతో పాటుగా సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 80 నియోజకవర్గాలకు కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం నియమించారు.

Published : 16 Nov 2022 03:52 IST

80 అసెంబ్లీ స్థానాలకు కన్వీనర్ల నియామకం
త్వరలో కమిటీలు, సెల్స్‌ నియామకాలు సైతం

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమలదళం దృష్టి సారించింది. రాజకీయ కార్యకలాపాలను పెంచడంతో పాటుగా సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 80 నియోజకవర్గాలకు కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం నియమించారు. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రభారీలను నియమించిన విషయం తెలిసిందే. వీరంతా స్థానికేతర నాయకులు. కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లను మాత్రం ఆ నియోజకవర్గానికి చెందిన వారినే నియమించారు. నియోజకవర్గ కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను పెంచడం.. జిల్లా, మండల పార్టీల మధ్య సమన్వయ బాధ్యతలను వీరికి అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఏడాది కూడా లేకపోవడంతో కార్యకలాపాలు పెంచేందుకు భాజపా సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాలని నిర్ణయించింది.

నియోజకవర్గ పరిధిని బట్టి..

కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకే జిల్లా పరిధిలో ఉంటే.. మరికొన్ని రెండు, మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఒకేజిల్లా పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గానికి కన్వీనర్‌ని నియమించారు. రెండు జిల్లాల పరిధిలో ఉంటే కన్వీనర్‌తో పాటు మరో జాయింట్‌ కన్వీనర్‌ని, మూడు జిల్లాల పరిధిలో ఉంటే కన్వీనర్‌తో పాటు ఇద్దరు జాయింట్‌ కన్వీనర్లను నియమించారు.

పోటీకి అవకాశం లేదు

అసెంబ్లీ ప్రభారీలు పార్టీ బలోపేతం కోసమే పని చేయాలని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ల అవకాశం ఉండదని జాతీయ ప్రధానకార్యదర్శి సునీల్‌బన్సల్‌ వారితో కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లకు సైతం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉండదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ కోసం నిబద్ధతతో, పూర్తి సమయం కేటాయించేవారిని గుర్తించి ఎంపిక చేసినట్లు సమాచారం.

ఆశావహుల అనుకూలురకే

కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్ల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పలు నియోజకవర్గాల్లో బలమైన నాయకులు, ఎన్నికల్లో అభ్యర్థులు అవుతారని భావించే నాయకులు సూచించిన, అనుకూలమైన వారినే కన్వీనర్‌, జాయింట్‌ కన్వీనర్లుగా నియమించినట్లు భాజపా నేత ఒకరు తెలిపారు. 30 నియోజకవర్గాలకు కొద్దిరోజుల క్రితం కన్వీనర్లను భాజపా నియమించింది. దీంతో మొత్తం ఆ సంఖ్య 110కి చేరింది. మిగిలిన మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, షాద్‌నగర్‌, దేవరకద్ర, పాలకుర్తి, మునుగోడు, పెద్దపల్లి, రామగుండం, మంథని నియోజకవర్గాలకు నాలుగైదు రోజుల్లో కన్వీనర్లను నియమించనున్నట్లు తెలిసింది.

పది రోజుల్లో మిగతా కమిటీల నియామకం

పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులుగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరు, జాతీయ కౌన్సిల్‌కు లోక్‌సభ స్థానానికి ఒకరు ఉంటారు. పది రోజుల్లో ఈ సభ్యులనూ నియమించనున్నట్లు సమాచారం. పర్యావరణం, వర్తక-వాణిజ్యం, డాక్టర్లు, గీత కార్మిక, గొర్రెల కాపరులు, మత్స్యకారులుసహా దాదాపు 40 సెల్స్‌, స్వచ్ఛభారత్‌, పార్టీ సభ్యత్వం సహా 28 రకాల కమిటీలను త్వరలోనియమించనున్నట్లు తెలిసింది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని