వికేంద్రీకరణ సభకు వైకాపా తంటాలు: అదిరించి.. బెదిరించి మహిళలను రప్పించారు!

ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ‘వికేంద్రీకరణకే మా మద్దతు’ పేరిట నిర్వహించిన సభకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకురావడం చర్చనీయాంశమైంది.

Updated : 17 Nov 2022 08:45 IST

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: ఒంగోలు కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ‘వికేంద్రీకరణకే మా మద్దతు’ పేరిట నిర్వహించిన సభకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకురావడం చర్చనీయాంశమైంది. ‘గ్రూపు సభ్యులంతా రావాలి. లేకుంటే ప్రభుత్వ పథకాలను ఆపేస్తాం’ అంటూ ఒంగోలు నగరం, నియోజకవర్గ మహిళలకు ఉదయం నుంచే ఆయా సమాఖ్యల రిసోర్సు పర్సన్లు (ఆర్‌పీలు), కమ్యూనిటీ ఆర్గనైజర్ల (సీవోలు) నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి.

వైకాపా సమావేశానికి తామెందుకంటూ మహిళలు ప్రశ్నించగా... అలా అయితే రుణాలు, పథకాలు ఇవ్వబోమని చెప్పడంతో చేసేదిలేక హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది సభ ప్రారంభం కాకముందే ఇళ్లకు వెళ్లిపోవడం ప్రారంభించారు. దీంతో సీసీలు, ఆర్‌పీలు, వైకాపా కార్పొరేటర్లు వారిని ఆపేందుకు పదేపదే ప్రయత్నించారు. మానవ హారం ఉందని, ఎవరూ వెళ్లొద్దని కోరారు. సభకు అంతా ఆడవాళ్లే కావాల్సి వచ్చారా.... పార్టీలో పురుష కార్యకర్తలు లేరా? పలువురు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్‌ గంగాడ సుజాత, డీసీసీబీ ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య, కార్పొరేటర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ నిర్వహణకు అనుకూలంగా ట్రంకురోడ్డును పూర్తిగా మూసివేశారు. కలెక్టరేట్‌ ముందు బారికేడ్లను పాతి వాహనాల రాకపోకలను దాదాపుగా అడ్డుకున్నారు. రెండుసార్లు 108 అంబులెన్సులు రావడంతో పోలీసులు పరుగెత్తుకెళ్లి వాటికి దారి కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని