బీ టీమ్‌ రగడ కలిసొచ్చేదెవరికి?

‘పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింద’ని నానుడి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లోనూ ఈ తరహా పరిస్థితే నెలకొంది.

Published : 21 Nov 2022 03:45 IST

ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను గుత్తగా పొందే యత్నాల్లో కాంగ్రెస్‌, ఆప్‌
పరస్పరం విమర్శల్లో ఆ రెండు పార్టీలు
విజయం మరింత సులభమంటున్నభాజపా
గుజరాత్‌ ఎన్నికల్లో పార్టీల వ్యూహాలు
(అహ్మదాబాద్‌ నుంచి నీరేంద్రదేవ్‌)

‘పిట్ట పోరు పిట్టపోరు పిల్లి తీర్చింద’ని నానుడి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లోనూ ఈ తరహా పరిస్థితే నెలకొంది. దీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న భాజపాపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇదే తమ విజయానికి దోహదపడే ప్రధానాంశమని మూడు దశాబ్దాలుగా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రంలో తొలిసారి పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగిన ఆప్‌ భారీ ఆశలు పెట్టుకున్నాయి. తాజాగా నెలకొన్న ముక్కోణపు పోటీలో రెండు విపక్షాల మధ్య చీలిపోనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో 2017లో కన్నా ఈ దఫా తాము సునాయాసంగా గెలవబోతున్నామని భాజపా నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్‌, ఆప్‌లు తమ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీని విమర్శిస్తూనే అవి రెండూ పరస్పరం ఆరోపణలు సంధించుకుంటున్నాయి. ‘భాజపా..బి- టీమ్‌ ఆప్‌’ అని హస్తం పార్టీ అంటుంటే....‘కమలం...హస్తం మధ్య ఐఎల్‌యు(ఐ లవ్‌ యు) ఒప్పందం ఉందని, గుజరాత్‌లో తమను తొక్కివేసేందుకే ఆ రెండు పెద్ద పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆప్‌ నేతలు చెబుతున్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీని ప్రశ్నించడం ద్వారా చేసిన హడావిడి ఇప్పుడేమైందని ఆప్‌ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్‌, భాజపా మధ్య అవగాహనతోనే ఈడీ దర్యాప్తు నిలిచిపోయిందని ఆరోపించింది. అదే సమయంలో దిల్లీ ఉపముఖ్యమంత్రి, తమ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియాపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు తీవ్రంచేయడం తమ వాదనలకు బలాన్ని చేకూర్చుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో ఈ దఫా 150 స్థానాల్లో విజయం సాధించబోతున్నామని భాజపా నేత, కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ భరోసా వ్యక్తం చేయడం గమనార్హం.

సామాజిక కూర్పుపై వ్యూహాలు

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కూడగట్టి లక్ష్యాన్ని సాధించాలని విపక్షాలు పోటీ పడుతుంటే ఇప్పటి వరకూ తమకు దూరంగా ఉన్న సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి భాజపా ప్రయత్నిస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన పాటీదార్లు, ఆదివాసీలు, దళితులను తన వైపు తిప్పుకునే వ్యూహాన్ని కమల దళం అమలుపరుస్తోంది. తొలి జాబితాలో భాజపా 14 మంది మహిళలు, 43 మంది పాటీదార్లు, 14 మంది బ్రాహ్మణులు, 14 మంది ఎస్సీలు, 24 మంది ఎస్టీలను అభ్యర్థులుగా ప్రకటించి సమతూకాన్ని చాటింది.

* అభివృద్ధి, హిందుత్వ నినాదం, మోదీ నాయకత్వం భాజపా ప్రధాన అస్త్రాలు.

* దీనికి పోటీగా ఆప్‌ మిశ్రమ వ్యూహాన్ని అమలుచేస్తోంది. వివిధ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడంతో పాటు హిందుత్వవాదుల్లో సానుకూల అభిప్రాయాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తోంది. కరెన్సీ నోట్లపై గణేశ్‌, లక్ష్మీ దేవి చిత్రాలను ముద్రించాలని ప్రధాని మోదీకి లేఖరాయడం దీనిలో భాగమే.

* ఓబీసీలు, ఆదివాసీలు, హిందూ జాట్‌లు, ముస్లింల ఓట్లను సంఘటితం చేసుకోవడం ద్వారా 1985లో మాధవ్‌సింహ్‌ సోలంకి నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ భారీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో 149 స్థానాలను దక్కించుకుంది. నరేంద్ర మోదీ హవా కొనసాగిన సమయంలోనూ భాజపా అత్యధికంగా సాధించిన అసెంబ్లీ స్థానాలు 127 మాత్రమే. ఇప్పుడు ఆప్‌ కూడా 1985నాటి కాంగ్రెస్‌ తరహా సమీకరణను సాధించాలని ప్రయత్నిస్తోంది. దానికి అదనంగా హిందుత్వవాదుల ఓట్లు పొందాలని చూస్తోంది.

* ముస్లింలు బలంగా ఉన్న ప్రాంతాల్లో అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఎంఐఎం పోటీ చేయడం ఈ సారి భాజపాకు కలిసి రానుంది. ఈ వర్గం ఓట్లు కాంగ్రెస్‌, ఆప్‌, ఎంఐఎంల మధ్య చీలిపోవడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అదే గనుక జరిగితే కాంగ్రెస్‌ పార్టీ అధికంగా నష్టపోనుంది. వ్యూహకర్త అహ్మద్‌పటేల్‌ మరణించడం హస్తం పార్టీకి తీరని లోటు. ఆ నష్టాన్ని భర్తీ చేసే నేత మరొకరు ఆ పార్టీలో లేరు.

* కమలం పార్టీకి పట్టున్న పట్టణ ప్రాంతాల్లో ఆప్‌కు ఆదరణ కనిపిస్తున్నందున అక్కడి ఓట్లలో చీలిక తమకు లబ్ధి కలిగిస్తుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిలుపు కొనేందుకు ప్రయత్నిస్తోంది.


సీఎం అభ్యర్థుల్లో సత్తా ఎంత?

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తోన్న లోపం రాష్ట్ర స్థాయిలో ప్రజాబలమున్న ముఖ్యమంత్రి అభ్యర్థులు లోపించడం. భాజపా, కాంగ్రెస్‌, ఆప్‌...మూడింటిలోనూ ఈ వెలితి కనిపిస్తోంది. మోదీ ప్రధాని అయ్యాక రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చింది. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్‌ మూడో వారు. తమ సీఎం అభ్యర్థిగా ఇసుదాన్‌ గాఢ్వీని ఆప్‌ ఆలస్యంగా ప్రకటించింది. అతనికి పంజాబ్‌ ఆప్‌ సీఎం భగవంత్‌ మాన్‌ మాదిరిగా విశేష ప్రజాదరణ ఏమీ లేదు. ఉత్తరాఖండ్‌, గోవా ఎన్నికల్లో చవిచూసిన నాయకత్వ లోపాన్నే గుజరాత్‌లోనూ ఆప్‌ ఎదుర్కొంటోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీలో తమ సీఎం అభ్యర్థి ఎవరో వెల్లడించలేని పరిస్థితి నెలకొంది.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు