ఈసారి పటేళ్ల మద్దతు కమలానికే..!

ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గుజరాత్‌లో పటేళ్లకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని భాజపా నేత హార్దిక్‌ పటేల్‌ తెలిపారు.

Updated : 21 Nov 2022 06:16 IST

ఈడబ్ల్యూఎస్‌ కోటాతో చాలా సమస్యలకు పరిష్కారం
భాజపా నేత హార్దిక్‌ పటేల్‌ వెల్లడి

అహ్మదాబాద్‌: ఆర్థికంగా వెనకబడ్డ వర్గాల(ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో గుజరాత్‌లో పటేళ్లకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని భాజపా నేత హార్దిక్‌ పటేల్‌ తెలిపారు. అందువల్ల ఈ సామాజిక వర్గం ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి మద్దతు తెలుపుతుందని చెప్పారు.

2015లో పాటీదార్‌ కోటా ఉద్యమానికి హార్దిక్‌ నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. నాటి ఆందోళన ప్రభావం 2017 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో కనిపించిందని ఆయన తెలిపారు. అప్పట్లో హార్దిక్‌ కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు. ‘‘పాటీదార్లు ఐక్యంగా ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా నిలవాలని వారు నిర్ణయించారు. 2017 అసెంబ్లీ ఎన్నికలు భిన్నం. ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద పటేళ్లు సహా ఇతర వర్గాల్లోని పేదలకు రిజర్వేషన్‌ ప్రయోజనాలను కల్పిస్తున్నారు. అందువల్ల భాజపా భారీ విజయానికి పాటీదార్లు కృషి చేస్తారు’’ అని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్‌పై మోదీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. 50కిపైగా సామాజిక వర్గాల్లోని పేదలకు ఇది ప్రయోజనం కలిగిస్తుందని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని