YSRCP: వైకాపాలో కదిలిన పీఠాలు

అధికార వైకాపాలో అధ్యక్ష పీఠాలు కదిలాయి. 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చారు.

Updated : 24 Nov 2022 07:18 IST

8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల మార్పు
ప్రాంతీయ సమన్వయకర్త బాధ్యతల నుంచి సజ్జల, బుగ్గన, అనిల్‌, కొడాలికి ఉద్వాసన
ఎంపీ అయోధ్యరామిరెడ్డికి పార్టీ సమన్వయ బాధ్యతలు
అనుబంధ విభాగాల సమన్వయకర్తగా చెవిరెడ్డి

ఈనాడు, అమరావతి: అధికార వైకాపాలో అధ్యక్ష పీఠాలు కదిలాయి. 8 జిల్లాల్లో పార్టీ అధ్యక్షులను మార్చారు. ‘మీరు చేయగలిగితే చేయండి లేదా కొత్తవాళ్లకు బాధ్యతలు అప్పగిస్తా’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇటీవల ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సందర్భంగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులకు అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్పుచేర్పులు చేశారు. ముఖ్యమంత్రి హెచ్చరికల నేపథ్యంలో ముగ్గురు జిల్లా అధ్యక్షులు తాము చేయలేమని, తమ స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరినట్లు తెలిసింది. మిగిలిన 5 జిల్లాల్లో పార్టీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుని మార్చేసిందంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..

కుప్పం వైకాపా బాధ్యుడైన ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి అప్పగించారు. ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, అవంతి శ్రీనివాస్‌, సుచరిత, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, వై.బాలనాగిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను జిల్లా పార్టీ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రులు  కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌లనూ పార్టీ పదవుల నుంచి తొలగించారు.

బాలినేనికి మినహాయింపు

ప్రాంతీయ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌లను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ నలుగురితోపాటు బాలినేని కూడా సమన్వయకర్తగా విఫలమయ్యారని సెప్టెంబర్‌లో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమ సమీక్షలో సీఎం అసహనం వ్యక్తం చేశారు. వీరిలో ఇప్పుడు బాలినేనికి మాత్రమే కొనసాగింపు దక్కింది. సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైయస్సార్‌ జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి ఇచ్చారు. అనిల్‌ వద్ద ఉన్న వైయస్సార్‌, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించారు. బాలినేనికి ఇప్పటి వరకూ ఉన్న మూడు జిల్లాల్లో నెల్లూరును కొనసాగించారు. బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్‌రావుకు ఇచ్చారు. కొడాలి నాని వద్దనున్న పల్నాడు బాధ్యతను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి, గుంటూరు జిల్లా బాధ్యతను కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌కు అప్పగించారు. ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రితోపాటు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి కొత్తగా బాధ్యతలిచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ఎంపీ పీవీ మిథున్‌రెడ్డిల బాధ్యతల్లో ఎలాంటి మార్పూ లేదు. విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి బదలాయించారు. వైవీ నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు కేటాయించారు.

చెవిరెడ్డికి కీలక బాధ్యతలు

తిరుపతి జిల్లా వైకాపా అధ్యక్ష పదవి నుంచి తప్పించిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని కీలకమైన ఆ పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా నియమించారు. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డికి చెవిరెడ్డి సహాయకారిగా వ్యవహరిస్తారని వైకాపా కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు