కలుపుకొని వెళ్లడం లేదా.. కలిసిరావడం లేదా?

తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిసారించింది. 2018 శాసనసభ ఎన్నికల అనంతరం అయిదు ఉపఎన్నికలు జరిగితే ఒక్కదాంట్లోనూ విజయం సాధించకపోవడం, నేతల రాజీనామాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలని యోచిస్తోంది.

Updated : 25 Nov 2022 09:43 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ప్రశ్నించిన అధిష్ఠానం
వరుస ఓటములు, సీనియర్‌ నేతల రాజీనామాలపై చర్చ

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై కాంగ్రెస్‌ అధిష్ఠానం దృష్టిసారించింది. 2018 శాసనసభ ఎన్నికల అనంతరం అయిదు ఉపఎన్నికలు జరిగితే ఒక్కదాంట్లోనూ విజయం సాధించకపోవడం, నేతల రాజీనామాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దాలని యోచిస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మల్లికార్జున ఖర్గే వివిధ రాష్ట్రాల్లో సంస్థాగత పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని అధిష్ఠానం దిల్లీ పిలిపించింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్‌ చౌదరి, నదీం జావెద్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గురువారం దిల్లీలో సమావేశమయ్యారు. తొలుత రేవంత్‌రెడ్డిని మాణికం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శులు పలు అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది. ముఖ్యనేతలకు అందుబాటులోకి రావడం లేదని, పీసీసీ నుంచి సరైన సమాచారం ఉండడం లేదని ఏఐసీసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. దీనిపై వివరణ అడిగినట్లు సమాచారం. ‘మీరు కలుపుకొని వెళ్లడం లేదా.. వారు కలిసి రావడం లేదా.. లోపం ఎక్కడుంది.. సమన్వయం ఎందుకు దెబ్బతింటోంది?’ అని రేవంత్‌ను ఆరా తీసినట్లు తెలిసింది. కొందరు సీనియర్ల తీరుతో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ సందర్భంగా ఆయన ఏకరవు పెట్టినట్లు సమాచారం. నియోజకవర్గస్థాయి నేతలకు సాధ్యమైనంత ఎక్కువగా అందుబాటులో ఉండాలని అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది. మునుగోడులో చాలా ముందుగానే అభ్యర్థిని ప్రకటించినా.. పెద్దఎత్తున నేతలను మోహరించినా ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంపైనా చర్చ కొనసాగింది.  అసంతృప్తిగా ఉన్న సీనియర్‌ నేతలతో మాట్లాడాలని, అందరినీ కలుపుకొని పోవాలని రేవంత్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం. పార్టీ వదిలి వెళ్లే నేతల విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలని, చేరికలపై దృష్టిసారించాలని ఆదేశించినట్లు తెలిసింది. పీసీసీ కార్యవర్గం కూర్పు, డీసీసీ అధ్యక్షుల నియామకం, సంస్థాగత మార్పుచేర్పులను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని