మిల్లర్ల పాత్ర నిరూపిస్తే సీఎం రాజీనామా చేస్తారా?

ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఉందని నిరూపిస్తే ముఖ్యమంత్రి జగన్‌ తన పదవికి రాజీనామా చేస్తారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాలు విసిరారు.

Updated : 25 Nov 2022 05:14 IST

ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంపై సోము వీర్రాజు ప్రశ్న

ఈనాడు, అమరావతి: ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర ఉందని నిరూపిస్తే ముఖ్యమంత్రి జగన్‌ తన పదవికి రాజీనామా చేస్తారా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాలు విసిరారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర లేదని సీఎం జగన్‌ చెబుతుండడంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. కాకినాడ పోర్టు మిల్లర్ల స్మగ్లింగుకు కేంద్రంగా ఉందని ఆరోపించారు. రైతులకు న్యాయం చేయలేని పక్షంలో ధాన్యం కొనుగోలు బాధ్యతలను ఎఫ్‌సీఐకి  అప్పగించాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో గురువారం పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వం వద్ద డ్రెడ్జింగ్‌ మిషన్లు ఉన్నాయా? ఉంటే అవి ఏమయ్యాయి? కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు ఎందుకు మళ్లీ టెండరు పిలిచారు. ఎవరి కోసం? రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలకు ఇష్టంవచ్చినట్లుగా  అనుమతులు ఇస్తోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మధ్యన ఉండే ఉప్పుటేరు స్ట్రైట్‌ కట్‌లో డ్రెడ్జింగ్‌ నిర్వహించి ఎన్నో సంవత్సరాలైంది’ అని మండిపడ్డారు. ‘భూహక్కు పత్రాల మంజూరులో చాలా తప్పులు ఉంటున్నాయి. భూముల రీ-సర్వే పథకం కేంద్రానిదే. సీఎం జగన్‌ తన పథకంగా ప్రచారం చేసుకుంటున్నారు. పేదల పేరుతో చుక్కల భూములను వైకాపా నేతలు కబ్జా చేస్తున్నారు. పేదలకు ఇంటి స్థలాల పంపిణీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీఎత్తున అవినీతికి పాల్పడింది. అవినీతి కారణంగా పట్టా ఖరీదు రూ.44వేలు అయింది. పేదలకు టిడ్కో ఇళ్ల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలపై త్వరలో ఉద్యమం చేపడతాం’ అని సోము వీర్రాజు అన్నారు. పుట్టపర్తిలో కొండల మధ్య ఉన్న చెరువు తవ్వేస్తున్నారని..ఇందుకు సంబంధించిన జీఓ 217ను వెంటనే ఉపసంహరించాలని కోరారు. ‘రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో బీసీ సామాజిక చైతన్య సభలు నిర్వహిస్తాం. ఈ నెల 27న ఏలూరులో భాజపా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో జరిగే తొలి సభలో జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్‌, జాతీయ నేతలు పాల్గొంటారు. యువ మోర్చా ఆధ్వర్యంలో జనవరి తొలివారంలో కబడ్డీ పోటీలు జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి’ అని ఆయన తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఏలూరులో జరగనున్న బీసీ సామాజిక చైతన్య సభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని