ఆక్వా రైతులకు యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే

జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్తును రూ.1.50కే అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దీన్ని తమ ఎన్నికల ప్రణాళికలోనూ పొందుపరుస్తామని, అధికారంలోకి వచ్చిన తొలిరోజే అమలులోకి తెస్తామని ప్రకటించారు.

Updated : 25 Nov 2022 05:25 IST

ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌ పరిమితులుండవు  
ఏరియేటర్లు, బోర్లు, మోటార్ల ఏర్పాటుకు 50% రాయితీ  
ఎన్నికల ప్రణాళికలోనూ చేరుస్తామని హామీ
ఆక్వా రైతుల సదస్సులో చంద్రబాబు ప్రకటన

ఈనాడు, అమరావతి: జోన్‌తో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్‌ విద్యుత్తును రూ.1.50కే అందిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దీన్ని తమ ఎన్నికల ప్రణాళికలోనూ పొందుపరుస్తామని, అధికారంలోకి వచ్చిన తొలిరోజే అమలులోకి తెస్తామని ప్రకటించారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘ఆక్వా రైతులకి ఇదేం ఖర్మ’ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ‘తెదేపా హయాంలో యూనిట్‌ విద్యుత్తు రూ.2కే ఇచ్చేవాళ్లం. జగన్‌ వచ్చి అర్ధ రూపాయి తగ్గిస్తానని గాలం వేయడంతో ఆక్వా రైతులు బుట్టలో పడిపోయారు. ఆయన కొట్టిన దెబ్బకు ఇప్పుడు పరిశ్రమే మనుగడ కోల్పోయే దుస్థితి దాపురించింది. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని, తీరంలో ఆక్వా రంగాన్ని దెబ్బతీశారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి? రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలి.

కొత్త చట్టాలతో వ్యాపారుల్ని గుప్పిట పట్టి.. వసూళ్లు

వ్యాపారుల్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకే ఆక్వారంగంలో సీడ్‌, ఫీడ్‌ చట్టాలు తెచ్చారు. దాణా తయారీదారులు ఎవరెంత ఉత్పత్తి చేస్తున్నారో తెలుసుకుని టన్నుకు రూ.5వేల చొప్పున జేట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ఒక్క దాణా ద్వారానే రూ.750 కోట్లు వస్తున్నాయంటే ఈ సీఎం ఎంత గొప్పవాడో? తెలుసుకోవచ్చు. జేట్యాక్స్‌ చెల్లించాలంటూ చేపలు, రొయ్యలమ్మే వాళ్లపైనా ఒత్తిడి చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చిన ట్రాన్స్‌ఫార్మర్లకు ఇప్పుడు రూ.లక్షలు చెల్లించాలంటే రైతులెలా బతకాలి. 100 కౌంట్‌ రొయ్యకు రూ.240 ధర నిర్ణయించి... తర్వాత రూ.210కి తగ్గించారు. ఆ ధరకు ఎక్కడైనా కొన్నారా? మంత్రుల ఉపసంఘం ఎందుకు? జగన్‌ రెండు రకాల బటన్‌లను నొక్కుతున్నారు. అందులో ఒకటి నొక్కితే వారం, పది రోజులకు రెండు, మూడు వేల మంది ఖాతాల్లో సొమ్ములు జమ అవుతాయి. తన ఇంట్లోకి సొమ్ము వచ్చే రెండో బటన్‌ను రోజూ నొక్కుతుంటారు.

దెబ్బకొట్టి.. ఆనందపడుతున్న జగన్‌

వైకాపా అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతుపై ఎకరాకు విద్యుత్తు ఛార్జీల రూపంలో రూ.26,862, మేత ధర పెంపుతో రూ.72,250 భారం మోపారు. జనరేటర్లకు రూ.70 వేల అదనపు ఖర్చవుతోంది. ఆక్వాపై మార్కెట్‌ రుసుము పెంపుతో రూ.13,500 కోట్ల భారం మోపారు. ప్రాసెసింగ్‌ పరిశ్రమలకిచ్చే నీటి ధరను వందరెట్లు పెంచారు. ఆక్వా సంక్షోభంపై పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మేం సదస్సు నిర్వహించిన తర్వాత రోజే... రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోందని, తమకేమీ ఇబ్బందుల్లేవని రొయ్యల వ్యాపారుల సంఘం మెడపై కత్తి పెట్టి ప్రకటన ఇప్పించారు.

కాడిపడేసిన వైకాపా నేతలు

నేను కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరుకు వెళ్తే... అనూహ్య స్పందన వచ్చింది. దాంతో వైకాపాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆపార్టీ నేతలు ఎక్కడికక్కడే కాడి పడేశారు. ఏకంగా 8 మంది జిల్లా పార్టీ అధ్యక్షుల్నే మార్చేసుకున్నారు. ఈ లెక్కన వైకాపాకు 175 సీట్లు కాదు, వచ్చేది గుండుసున్నాయే.. కుప్పం కాదు, పులివెందులలోనూ గెలిచే పరిస్థితి ఉండదు.

మారకుంటే మనిషికి, పశువుకు మధ్య తేడా లేదు 

అమరావతికి భూములిచ్చిన రైతులపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పిస్తూ.. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆదోని, ఎమ్మిగనూరులో మూడు రాజధానులు కావాలా? ఒక రాజధాని కావాలా అంటే.. అంతా ముక్తకంఠంతో ఒకే రాజధాని కావాలని చెప్పారు. సిగ్గుంటే ఇప్పుడైనా మారాలి. తప్పులు చేయడం సహజం. సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. లేదంటే మనిషికి పశువుకు తేడా లేదు.

మంత్రితో రాజీనామా చేయించండి

నెల్లూరు కోర్టులో దస్త్రాల మాయంపై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో.. అందులో ప్రమేయమున్న వ్యవసాయ శాఖ మంత్రితో రాజీనామా చేయించాలి. అయినా... సీఎంపైనే ఎన్నో కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మంత్రితో రాజీనామా ఎలా చేయిస్తారు? అంతా దొంగలు, దోపిడీదారుల బ్యాచ్‌. ఈ కేసులో మాజీ మంత్రి సోమిరెడ్డి గట్టిగా పోరాడారు’ అని చంద్రబాబు ప్రశంసించారు.


చంద్రబాబు హామీలు

* ఆక్వా రైతులందరికీ ఒక యూనిట్‌ విద్యుత్తు రూ.1.50కే సరఫరా. 

* 24 గంటలు నిరంతరంగా విద్యుత్తు సరఫరా చేస్తాం. 

* తెదేపా హయాంలోని ధరలకే ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు ఏర్పాటు చేస్తాం. 

* ఏరియేటర్లు, బోర్లు, మోటార్ల ఏర్పాటుకు 50% రాయితీ ధర ప్రకటిస్తాం. 

* నాణ్యమైన విత్తనం, దాణా అందిస్తాం. ధరలను నియంత్రిస్తాం. రొయ్యలు, చేపల కొనుగోలుపై మార్కెట్‌ రుసుము తగ్గిస్తాం. 

* ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు నీటిపన్ను ధరను తగ్గిస్తాం. శీతల గోదాములను నిర్మిస్తాం. 

* టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌, రాష్ట్ర జీఎస్టీ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల వేధింపులు ఉండవు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని