భాజపాను అడ్డుకోవడమే లక్ష్యం

దేశంలో భాజపా అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు లెఫ్ట్‌ పార్టీలనీ ఒకేతాటిపైకి వచ్చి బలమైన ప్రతిపక్ష కూటమికి ప్రయత్నాలు చేయాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.

Updated : 25 Nov 2022 06:19 IST

అవసరమైతే ఇతర పార్టీలతో కలిసి పనిచేస్తాం
దేశంలో లెఫ్ట్‌ పార్టీలన్నీ ఒకేవేదిక పైకి రావాలి
జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న తెరాస నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
‘ఈనాడు’తో సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య

దేశంలో భాజపా అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు లెఫ్ట్‌ పార్టీలనీ ఒకేతాటిపైకి వచ్చి బలమైన ప్రతిపక్ష కూటమికి ప్రయత్నాలు చేయాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్‌ భట్టాచార్య అభిప్రాయపడ్డారు.ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో భాజపా ప్రాబల్యం తగ్గుతోందని, దీన్ని భర్తీచేసుకునేందుకు దక్షిణాదిలో ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భాజపా విధానాలను బలంగా వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ, జాతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరికీ సమాన పౌరహక్కు లభించేలా యువత, రైతులు బలమైన ఉద్యమం చేయాలని సూచించారు. సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ తెలంగాణ రాష్ట్ర జిల్లా ముఖ్యకార్యదర్శుల సమావేశాలకు హాజరైన ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 2023 ఫిబ్రవరి 15 నుంచి 20 వరకు పట్నాలో పార్టీ 11వ సమావేశాలు నిర్వహించనున్నామని చెప్పారు. 2024 ఎన్నికల్లో భాజపాను అడ్డుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలను వీటిలో చర్చిస్తామని వివరించారు.


దేశంలో భాజపా పాలనలో విద్వేషాలు పెరుగుతున్నాయంటున్నారు కదా?

జవాబు: భిన్నత్వంలో ఏకత్వమే భారత్‌ బలం. ప్రజల మధ్య విభజనకు భాజపా ప్రయత్నిస్తోంది. దీన్ని ఎదుర్కొనేందుకు.. ఐక్యత, అభివృద్ధి కోసం పోరాటం చేయాలి. ఈ భిన్నత్వాన్ని దేశానికి బలంగా మార్చాలి. భాజపా మతాలపై మాట్లాడే బదులు ప్రజల ఉమ్మడి సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారాలు చూపించాలి.


విపక్షాల్లో ఐక్యత లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సమయంలో భాజపాను అడ్డుకోవడంలో ప్రతిపక్షాల పాత్ర ఎలా ఉంటుంది?

జవాబు: దేశంలో ఏక పార్టీ, ఏక నాయకత్వ సిద్ధాంతంతో భాజపా ముందుకు వెళ్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీల ప్రభావం పోయిందని, ప్రతిపక్షాలన్నీ ఏకం కాలేవన్న ప్రచారాలను కొనసాగిస్తోంది. విపక్షాలు ఏకం కాకుండా కుట్రలు చేస్తోంది. మరోవైపు భాజపా ప్రాబల్యం నెమ్మదిగా తగ్గుతోంది. తమిళనాడులో పాగా వేయలేకపోయింది. ఝార్ఖండ్‌లో అధికారం లేదు. బిహార్‌లో అధికారం దూరమైంది. పశ్చిమబెంగాల్‌లో ఓడిపోయింది. తెలంగాణ ఉప ఎన్నికలో భాజపాను తెరాస అడ్డుకుంది. విపక్షాలలో నాయకులు ఎక్కువే. ఎక్కువమంది నాయకులున్నది బలమైన కూటమిగా మారుతుంది. ఇక్కడినుంచే దీటైన ప్రధానమంత్రి అభ్యర్థి వస్తారు.


దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ఏమంటారు?

జవాబు: కేంద్రం ప్రజల ఆస్తిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని విక్రయించి, ప్రైవేటు ఆస్తిగా మార్చుతోంది. దీంతో ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు వస్తాయి. ప్రైవేటీకరణ అంటే.. ‘ప్రైస్‌ రైజ్‌’ (ధరల పెరుగుదల) అని అర్థం.  రిజర్వేషన్లను కూడా అడ్డుకోవడమే. ప్రైవేటు విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలన్నీ పేదలు, అల్పాదాయ వర్గాలకు భారంగా మారుతాయి. నిత్యావసరాల ధరలు అందుబాటులో ఉండవు.


పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొనాలి?

జవాబు: ధరల పెరుగుదలను నియంత్రించేందుకు ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)ను మరింత విస్తృతం చేయాలి. పేదలకు నిత్యవసరాలన్నింటినీ అందుబాటు ధరల్లోనే పీడీఎస్‌ ద్వారా ఇవ్వాలి. కరోనా సమయంలో పేదల ఆదాయం తగ్గిపోతే.. కొందరి ఆదాయం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో దేశంలో సంపద పన్ను విధించాల్సిన అవసరముంది. ఎక్కువ మొత్తంలో కార్పొరేట్‌ పన్ను ద్వారా ఆదాయం సమకూర్చుకుని, పేదలకు మేలు జరిగేలా  వినియోగించాలి.


మీ ముందున్న ప్రధాన లక్ష్యాలు ఏమిటి? 

జవాబు: భాజపాను అడ్డుకోవడమే మా పార్టీ ప్రధాన లక్ష్యం. అవసరమైతే ఇతర పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మునుగోడు ఉపఎన్నికలో భాజపాను అడ్డుకోవడంలో తెరాసకు కమ్యూనిస్టుల సహకారం విలువైనది. తెలంగాణలో పార్టీ బలోపేతం, లెఫ్ట్‌ పార్టీల ఐక్యతతో పెద్ద విపక్షం కోసం పనిచేయాల్సిన అవసరముంది. జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న తెరాస నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం. ఆ పార్టీ దేశంలో ప్రధాన భూమిక పోషిస్తుందన్న నమ్మకం ఉంది. దక్షిణాదిలో వైకాపా, బీజేడీలు కేంద్ర నిర్ణయాల్ని వ్యతిరేకించవు. కానీ డీఎంకే, తెరాసలు భాజపాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి. ఈ రెండు పార్టీలు ఎంచుకున్న మార్గాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో భాజపాను అడ్డుకునేందుకు ప్రయత్నాలతో పాటు తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేలా పోరాటం చేస్తాం.

 ఈనాడు, హైదరాబాద్‌

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని