వారసులకే పట్టం!

వారసత్వ రాజకీయాలపై సాధారణ సమయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకునే రాజకీయ పార్టీలు.. ఎన్నికల సమయంలో మాత్రం వాటిపై పెదవి విప్పవు! తమ నీతివాక్యాలకు తామే నీళ్లొదులుతుంటాయి!! గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.

Published : 25 Nov 2022 04:23 IST

గుజరాత్‌లో 20 టికెట్లు వారికే కేటాయించిన కాంగ్రెస్‌, భాజపా

అహ్మదాబాద్‌: వారసత్వ రాజకీయాలపై సాధారణ సమయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు గుప్పించుకునే రాజకీయ పార్టీలు.. ఎన్నికల సమయంలో మాత్రం వాటిపై పెదవి విప్పవు! తమ నీతివాక్యాలకు తామే నీళ్లొదులుతుంటాయి!! గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఈ దఫా అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్‌ కలిసి 20 మంది సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి. ఇందులో కాంగ్రెస్‌ వాటా 13 కాగా, భాజపా వాటా 7. సీనియర్‌ నాయకుల పిల్లలకే విజయావకాశాలు ఎక్కువగా ఉంటుండటం, ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో పార్టీలు వారసులవైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

* ఆదివాసీ సీనియర్‌ నేత, 10 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్‌సిన్హ్‌ రాఠ్వా కాంగ్రెస్‌తో తన దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని గత నెలలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చోటా ఉదయ్‌పుర్‌ స్థానాన్ని కమలదళం రాఠ్వా కుమారుడు రాజేంద్ర సిన్హ్‌కు కేటాయించింది. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ సంగ్రామ్‌సిన్హ్‌ రాఠ్వాను బరిలోకి దించింది. ఆయన రైల్వే శాఖ మాజీ మంత్రి నారాయణ్‌ రాఠ్వా కుమారుడు. రాజేంద్ర, సంగ్రామ్‌లిద్దరికీ ఇదే రాజకీయ అరంగేట్రం కావడం విశేషం.

* థస్రా స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న యోగేంద్ర పర్మార్‌.. మాజీ ఎమ్మెల్యే రామ్‌సిన్హ్‌ పర్మార్‌ కుమారుడు. రామ్‌సిన్హ్‌ గతంలో రెండుసార్లు (2007, 2012) కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2017లో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి భాజపాలో చేరారు.

* అహ్మదాబాద్‌లోని దనిలిమ్డా నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలో నిలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శైలేష్‌ పర్మార్‌.. మాజీ ఎమ్మెల్యే మనుభాయ్‌ పర్మార్‌ కుమారుడు.

* గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సిన్హ్‌ వాఘేలా కుమారుడు మహేంద్రసిన్హ్‌ వాఘేలా భాజపా నుంచి గత నెలలో మళ్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తాజా ఎన్నికల్లో ఆయన బాయడ్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 

* మరో మాజీ ముఖ్యమంత్రి అమర్‌సిన్హ్‌ చౌధరీ కుమారుడు తుషార్‌ చౌధరీ.. కాంగ్రెస్‌ అభ్యర్థిగా బర్డోలీ నుంచి బరిలోకి దిగారు. గతంలో ఆయన రెండుసార్లు ఎంపీగా చేశారు. వీరితో పాటు పలువురు సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీల పిల్లలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో ఆయా అసెంబ్లీ స్థానాల పోరు ఆసక్తికరంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు