సౌరవిద్యుత్‌తో ఆదాయం పొందాలి

విద్యుత్‌ను ఉచితంగా పొందే కంటే దాని ద్వారా ఆదాయం పొందే సరైన సమయమిది అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Published : 25 Nov 2022 04:23 IST

గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మొదాసా/పలన్‌పుర్‌: విద్యుత్‌ను ఉచితంగా పొందే కంటే దాని ద్వారా ఆదాయం పొందే సరైన సమయమిది అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఉత్తర గుజరాత్‌లోని ఆరావళి జిల్లా మొదాసా పట్టణంలో, బనాస్‌కాంఠా జిల్లా పలన్‌పుర్‌ పట్టణంలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. గుజరాత్‌ ప్రజలంతా ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని తమ అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందాలని తాను భావిస్తున్నానన్నారు. మెహ్‌సానా జిల్లాలోని మొధేరా గ్రామం యావత్తూ సౌరవిద్యుత్‌ ఉత్పత్తిలో ఎలా ముందుకు సాగుతోందో గమనించాలన్నారు. అక్కడి ప్రజలంతా సౌర విద్యుత్తును తమ అవసరాలకు వినియోగించుకుని మిగిలిన దానిని ప్రభుత్వానికి విక్రయిస్తూ ఆదాయం పొందుతున్నారని, ఇదే పరిస్థితిని గుజరాత్‌ అంతటా విస్తరించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. తమకు అధికారం అప్పగిస్తే 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ను అందిస్తామంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విభజించు, పాలించు విధానాన్నే కాంగ్రెస్‌ అనుసరిస్తుందని, ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదానిపైనే ఆ పార్టీ దృష్టి అంతా అని మోదీ ఆక్షేపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు వచ్చే 25 ఏళ్ల గుజరాత్‌ భవిష్యత్తును నిర్దేశించేవని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రంలోని అధికార భాజపా గుజరాత్‌లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాయని వివరించారు.


భాజపా దుష్పరిపాలనపై మోదీ మాట్లాడాలి: ఖర్గే

దిల్లీ: గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమ పార్టీపై విరుచుకుపడటాన్ని కాంగ్రెస్‌ తిప్పికొట్టింది. తమ పార్టీపై విమర్శలు చేసే బదులు గుజరాత్‌లో భాజపా దుష్పరిపాలనపై మోదీ మాట్లాడితే బాగుంటుందని హితవు పలికింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ముకు మద్దతివ్వలేదంటూ ప్రధాని మోదీ బుధవారం కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. దీనిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్విటర్‌లో స్పందించారు. ‘‘నరేంద్ర మోదీ జీ.. కాంగ్రెస్‌ను ఆడిపోసుకోవడాన్ని కట్టిపెట్టి గుజరాత్‌లో భాజపా దుష్పరిపాలనపై మాట్లాడండి’’ అని హిందీలో ట్వీట్‌ చేశారు. ‘‘గుజరాత్‌లో చిన్నారుల భవిష్యత్తు ఎందుకు నాశనం అయ్యింది. పౌష్టికాహారలోపం, తక్కువ బరువు చిన్నారుల విభాగంలో 30 రాష్ట్రాల్లో గుజరాత్‌ 29వ ర్యాంకులో నిలిచిందెందుకు? శిశుమరణాల రేటులో 19వ స్థానంలో ఉందేమిటి?’’ అని ఖర్గే ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని