జైలు భయంతోనే ఫోను పోయిందంటూ విజయసాయి నాటకం

దిల్లీ మద్యం కుంభకోణంలో తన ప్రమేయం బయటపడుతుందనే భయంతోనే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఫోను పోయిందంటూ నాటకాలాడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

Updated : 25 Nov 2022 06:43 IST

దిల్లీ లిక్కర్‌ స్కాం ఆధారాలు రూపుమాపడానికి ఇదో ఎత్తుగడ
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: దిల్లీ మద్యం కుంభకోణంలో తన ప్రమేయం బయటపడుతుందనే భయంతోనే వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఫోను పోయిందంటూ నాటకాలాడుతున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. లిక్కర్‌ స్కాం ఆధారాలను రూపుమాపి, ఈడీని తప్పుదోవపట్టించడానికే నక్కజిత్తులు ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. నిందితులు ఇప్పటికే 140 ఫోన్లు మార్చారని, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి ఒక్కరే 30 ఫోన్లు మార్చినట్లు రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి ఫోన్‌ పోవడం అనుమానాలకు తావిస్తోందని మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం బొండా ఉమామహేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. ‘విజయసాయి ఫోను నిజంగానే పోయిందా? గతంలో ఏ-2గా చంచల్‌గూడకు పోయినట్టు... ఇప్పుడు తీహాడ్‌ జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో గిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారా? ఏపీ సీఐడీ అధికారులు గతంలో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుతో వ్యవహరించినట్టు... ఈడీ విజయసాయిరెడ్డిని విచారిస్తే ఫోన్‌ గంటలో బయటపడుతుంది. కట్టుదిట్టమైన భద్రత ఉండే తాడేపల్లి ప్యాలెస్‌లో ఫోన్‌ పోవడం అసాధ్యం? ఒకవేళ పోయినా ఐఫోన్‌ను తేలిగ్గా ట్రాక్‌ చేయొచ్చు. తాడేపల్లి పోలీసులు విజయసాయిరెడ్డి చెప్పినట్టే చేస్తారు తప్ప స్వతంత్రంగా వ్యవహరించరు’ అని బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.


జగన్‌ మోసం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

అప్పుల్లో దేశంలో ఏపీని మొదటి స్థానంలో నిలిపిన సీఎం జగన్‌రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనేనని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. కేంద్రం, కాగ్‌, కోర్టులు ఇలా అందర్నీ జగన్‌ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి?’ అని ప్రశ్నిస్తూ గురువారం ఆయన ట్వీట్‌ చేశారు.  ‘అన్నింటికంటే ముఖ్యంగా నమ్మి ఓట్లేసిన ప్రజలనే జగన్‌ మోసం చేస్తున్నారు. ఆయన మోసాలు ఇప్పటికిప్పుడే బయటపడకపోవచ్చు. కానీ, ప్రజలు వాస్తవాలను గ్రహించిన రోజు... జనం ఆస్తులు కరిగించేసి, కొండల్ని మింగేసి, ప్రజల నెత్తిన రూ.లక్షల అప్పును మిగిల్చిన జగన్‌రెడ్డికి చరిత్రలో మిగిలేది చెత్త పేజీనే’ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.


సీఎం మాట్లాడుతుంటే ప్రజలు పారిపోతున్నారు: తెదేపా నేత యనమల

విప్లవాత్మక మార్పులు తెస్తున్నానంటూ రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలను సీఎం జగన్‌ పెంచిపోషిస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. సీఎం సభలకు అంగన్‌వాడీ కార్యకర్తల్ని, డ్వాక్రా మహిళల్ని, విద్యార్థుల్ని బలవంతంగా తరలించడమేనా వైకాపా చేస్తున్న అభివృద్ధి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూముల్ని గుర్తించి కబ్జా చేసేందుకే రీసర్వే చేస్తున్నారని గురువారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జగన్‌ ప్రచార పిచ్చి తారస్థాయికి చేరింది. ఆయన పరిపాలన అద్భుతంగా ఉంటే బెదిరించినా, పోలీసులను కాపలా పెట్టినా బహిరంగ సభల్లో బారికేడ్లు దూకి మరీ ప్రజలెందుకు పారిపోతున్నారు? సీఎం సభలంటే కిలోమీటర్ల మేర బారికేడ్ల ఏర్పాటు, పాఠశాలలు, దుకాణాల మూసివేత జగన్‌ అభద్రతాభావానికి నిదర్శనం కాదా?’ అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.


నెల్లూరులో సీబీఐ విచారణ సక్రమంగా సాగదు: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

నెల్లూరు ఎస్పీగా విజయారావు ఉంటే సీబీఐ విచారణ సక్రమంగా సాగదని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. నెల్లూరు కోర్టులో ఫైల్‌ చోరీ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఏపీసీఐడీ, విజిలెన్స్‌, సాధారణ పోలీసులు తమ విశ్వసనీయత కోల్పోయినట్లు మరోసారి రుజువైందని మండిపడ్డారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి నైతిక విలువలుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ... ‘గతంలో తప్పుడు పత్రాలు సృష్టించి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాపై అసత్య ఆరోపణలు చేశారు. దీనిపై నేను ఫిర్యాదు చేయడంతో నకిలీ పత్రాలు తయారు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. వాటిని చేయించిన కాకాణి సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్‌ తెచ్చుకున్నారు. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నెల్లూరు కోర్టు నుంచి ఈ కేసుకు సంబంధించిన పత్రాలు చోరీ అయ్యాయి. వేలాది కేసుల ఫైళ్లు ఉండగా... దొంగలకు కాకాణి కేసు రిజిస్టర్లే దొరికాయా? పాత ఇనుము దొంగతనం చేసేందుకు కోర్టు ఆవరణలోకి వెళ్లిన ఇద్దరు నిందితులు కుక్క అరుపులకు భయపడి భవనంలోకి చొరబడి... బీరువాలోని ఫైళ్లు ఎత్తుకెళతారా? ఈ విషయాన్ని ఎస్పీ స్వయంగా చెబుతారా? కొందరు పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనం. కాకాణిపై ఎస్సీల భూముల ఆక్రమణ, రిటైర్డు ఉద్యోగుల స్థలాలు కబ్జా తదితర అనేక కేసులు ఉన్నాయి. తక్షణం ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts