గుజరాత్‌ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో 21 శాతం మందిపై నేరారోపణలు

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల తొలి విడత పోరులో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21 శాతం మందికి నేర చరిత్ర ఉంది.

Published : 25 Nov 2022 05:19 IST

తొలి విడత ఎన్నికలపై ఏడీఆర్‌ నివేదిక

అహ్మదాబాద్‌: గుజరాత్‌ శాసనసభ ఎన్నికల తొలి విడత పోరులో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 21 శాతం మందికి నేర చరిత్ర ఉంది. మొదటి విడతలో మొత్తం 89 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 788 మంది బరిలో నిలిచారు. వీరిలో 166 మందిపై (21శాతం) క్రిమినల్‌ కేసులున్నాయి. అందులో 100 మందిపై (13శాతం) తీవ్రనేరాలైన హత్య, మానభంగాలు, కిడ్నాప్‌ లాంటి అభియోగాలున్నాయి. అభ్యర్థుల నేర చరిత్రల వివరాలను వారి ఎన్నికల అఫిడవిట్‌ల ఆధారంగా ఏడీఆర్‌ సేకరించి ఓ నివేదిక ద్వారా వెల్లడించింది.

* ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) 88 స్థానాలకు అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇందులో 36శాతం మందిపై (32) క్రిమినల్‌ కేసులున్నాయి. వీరిలో 26 మంది తీవ్రనేరాలకు పాల్పడినట్లుగా  ఆరోపణలున్నాయి.

* కాంగ్రెస్‌ పార్టీ 89 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ పార్టీ అభ్యర్థుల్లో 35శాతం (31) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 18 మందిపై తీవ్ర నేరాభియోగాలున్నాయి.

* అధికారపక్షమైన భాజపా అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తోంది. ఈ పార్టీ అభ్యర్థుల్లో 14 మందికి (16శాతం) నేర చరిత్ర ఉంది. వీరిలో 11 మందిపై తీవ్రనేరాలకు పాల్పడినట్లుగా కేసులున్నాయి.

* భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) 14 స్థానాలకు పోటీ చేస్తోంది. నలుగురు అభ్యర్థులు వివిధ నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి.

* గుజరాత్‌ శాసనసభకు 2017లో (తొలి విడతలో) పోటీ చేసిన అభ్యర్థుల్లో 15శాతం మందిపై క్రిమినల్‌ కేసులుంటే ఈ సారి అది 21 శాతానికి పెరగడం గమనార్హం.

బరిలో 211 మంది కోటీశ్వరులు

తొలి దశలో పోలింగ్‌ జరుగనున్న 89 స్థానాల్లో పోటీ చేస్తున్న మొత్తం 788 మంది అభ్యర్థుల్లో 211 మంది(27శాతం) కోటీశ్వరులని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. వీరిలో అత్యధికంగా 79 మంది భాజపా అభ్యర్థులేనని తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 65 మంది, ఆప్‌ తరఫున 33 మంది కోటీశ్వరులు బరిలోకి దిగారు. రాజ్‌కోట్‌ దక్షిణ అసెంబ్లీ స్థానంలో భాజపా అభ్యర్థి రాజేశ్‌ తిలాలా రూ.175 కోట్ల ఆస్తితో అందరికన్నా సంపన్నుడిగా నిలిచారు. రాజ్‌కోట్‌ పశ్చిమ సెగ్మెంట్‌లో స్వతంత్ర అభ్యర్థి భూపేంద్ర పటోలియా తనకు నయా పైసా ఆస్తి కూడా లేదని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని