‘ప్యాకేజీలు’ మా సంస్కృతి కాదు

పదవులు ఇచ్చి ప్యాకేజీలు పొందడం కాంగ్రెస్‌ సంస్కృతి కాదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ పేర్కొన్నారు.

Updated : 26 Nov 2022 03:58 IST

మాణికం ఠాగూర్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: పదవులు ఇచ్చి ప్యాకేజీలు పొందడం కాంగ్రెస్‌ సంస్కృతి కాదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని పీˆసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఠాగూర్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ వైస్‌ ఛైర్మన్‌గా ఉన్నందుకు ఏమిచ్చారు? మంత్రిగా ఉన్నప్పుడు ఏమిచ్చారు? అని శశిధర్‌రెడ్డిని ప్రశ్నించారు. ఇప్పుడు మీరు భాజపాలో చేరినందున ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: ఉత్తమ్‌

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, సంక్షేమ పథకాలు, ఇతరత్రా ఖర్చులకు నిధులు లేక దాదాపు దివాలా తీసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఆర్థిక ఆంక్షలు విధించి తెలంగాణను ఆర్థికంగా చితకబాదేందుకు ప్రయత్నిస్తోందని, ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి ఇదే కారణమన్న సీఎం కేసీఆర్‌ వాదనను ఉత్తమ్‌ ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని