రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రక్షాళన!

రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక మార్పులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సీనియర్లు, యువ నాయకుల కలబోతగా ఉండేలా కొత్త కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

Updated : 26 Nov 2022 04:00 IST

పాత, కొత్తల మేలుకలయికగా కమిటీల పునర్‌వ్యవస్థీకరణ
వారం రోజుల్లో ప్రకటన!

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక మార్పులకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. సీనియర్లు, యువ నాయకుల కలబోతగా ఉండేలా కొత్త కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలపై ప్రాథమికంగా చర్చించారు. గత రెండు రోజులుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, రోహిత్‌ చౌదరి, నదీం జావెద్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిలు దిల్లీలో ఈ విషయమై కసరత్తు చేశారు. గురువారం పార్టీలో సమస్యలు, సమన్వయంపై చర్చించిన నేతలు శుక్రవారం నూతన కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయనున్నారు. అన్నివర్గాల వారికి సమప్రాధాన్యం ఇచ్చేలా సమాలోచనలు జరుపుతున్నారు.వారం రోజుల్లోనే పీసీసీ నూతన కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామక ప్రకటన వెలువడనుందని సమాచారం. పదవులు భర్తీ చేస్తే క్షేత్రస్థాయి నుంచి బలోపేతానికి అవకాశం ఉంటుందని రేవంత్‌రెడ్డి అధిష్ఠానానికి తెలపడంతో ఆ ప్రక్రియను ప్రారంభించారు.

అన్ని సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూ యువ నాయకత్వం, పార్టీ పట్ల కీలకంగా ఉన్నవారిని పదవుల్లో సముచిత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యులు స్పష్టం చేశారు. హోదాలు అనుభవిస్తూ క్షేత్ర స్థాయిలో చురుగ్గా లేనివారిని దూరం పెట్టాలని నిర్ణయించారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి పార్టీని వీడి భాజపాలో చేరిన అంశంపై సమీక్షించుకుంటున్నట్లు తెలిసింది. ఎప్పుడూలేని విధంగా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను ఇన్‌ఛార్జీలుగా నియమించి, పూర్తి స్థాయిలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలు అప్పగించినా పార్టీ కార్యక్రమాల్లో మార్పులు రాకపోవడం, అసంతృప్త నేతలను నిలువరించలేకపోవడం వంటి అంశాలపై కూడా సమీక్షిస్తున్నారు. త్వరలోనే పీసీసీ కమిటీలను పూర్తిస్థాయిలో పునర్‌వ్యవస్థీకరించాలని యోచిస్తున్నారు. దీంతోపాటు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించనున్నారు. రాష్ట్ర, జిల్లా కార్యవర్గాలలో ఎవరెవరిని నియమించాలనే దానిపై జిల్లాల ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి ఏఐసీసీ కార్యదర్శులు సమాచారం సేకరిస్తున్నారు. వాస్తవానికి మూడు నెలల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైనా భారత్‌ జోడో యాత్ర, మునుగోడు ఉప ఎన్నికతో మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ఆటంకాలు లేకపోవడంతో కసరత్తును వేగవంతం చేశారు. ముఖ్య నేతల సలహాలు తీసుకున్నప్పటికీ అవే పూర్తి ప్రామాణికం కాదని, అంతర్గత సర్వే, పనితీరు, సామాజిక సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని