మోదీ ప్రభలోనూ.. భాజపాకు అందని ద్రాక్షలు!
గుజరాత్‌లో భాజపాకు దాదాపు 30 ఏళ్లుగా తిరుగులేకపోవచ్చు... ఎన్నికలేవైనా వారిదే విజయం కావొచ్చు! అమిత్‌షాలాంటి నేతల వ్యూహాలు ఫలిస్తున్నా... మోదీ ప్రభంజనం కొనసాగుతున్నా రాష్ట్రంలో రెండు కోరికలు మాత్రం కమలనాథులను ఇంకా అందని ద్రాక్షలా ఊరిస్తునే ఉన్నాయి.
గుజరాత్‌లో భాజపాకు దాదాపు 30 ఏళ్లుగా తిరుగులేకపోవచ్చు... ఎన్నికలేవైనా వారిదే విజయం కావొచ్చు! అమిత్‌షాలాంటి నేతల వ్యూహాలు ఫలిస్తున్నా... మోదీ ప్రభంజనం కొనసాగుతున్నా రాష్ట్రంలో రెండు కోరికలు మాత్రం కమలనాథులను ఇంకా అందని ద్రాక్షలా ఊరిస్తునే ఉన్నాయి.
భాజపా కంచుకోటగా, మోదీ-షా ద్వయానికి తిరుగులేని ప్రయోగశాలగా మారినప్పటికీ గుజరాత్‌లో కమలనాథులకు రెండు అంశాలు కొరుకుడు పడనివిగా మిగిలే ఉన్నాయి. అవి- రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సృష్టించిన రికార్డు; ఇప్పటిదాకా తమ ఖాతాలో పడని 7 సీట్లు!
బొంబాయి నుంచి విడిపోయి 1960లో గుజరాత్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా 1962లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పటి 154 సీట్ల అసెంబ్లీలో 113 గెల్చుకొని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 1967లో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా పూర్వరూపమైన భారతీయ జన సంఘ్ (బీజేఎస్) రాష్ట్రంలో ఒక సీటుతో అరంగేట్రం చేసింది. ఎమర్జెన్సీ అనంతరం జనతా పార్టీలో కలిసిన జనసంఘ్, 1980లో దాన్నుంచి విడిపోయి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. భాజపా పేరిట తొలిసారి గుజరాత్ ఎన్నికల్లో అడుగుపెట్టిన కమలనాథులు 9 సీట్లు గెల్చుకున్నారు.
తిరుగులేని సోలంకి వ్యూహం
రాష్ట్ర ఆవిర్భావం నుంచీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ 1985 ఎన్నికల్లో కనీవినీ ఎరగని విజయం సాధించింది. 182 సీట్ల అసెంబ్లీలో 149 సీట్లు గెల్చుకొని కాంగ్రెస్ రికార్డు సృష్టించింది. కాంగ్రెస్ నేత మాధవ్‌సింహ్ సోలంకి సారథ్యంలో క్షత్రియ, ఆదివాసీ, హరిజన్, ముస్లిం... ఇలా వివిధ వర్గాలను ఆకట్టుకోవాలన్న వ్యూహం ఫలించి పార్టీ రికార్డు స్థాయిలో సీట్లను, 55శాతం ఓట్లను సాధించగలిగింది. ఆ రికార్డు ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది.
మండల్ రిజర్వేషన్ల వివాదాల మధ్య... జరిగిన 1990 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. జనతాదళ్‌కు 70 సీట్లురాగా, భాజపాకు 67 సీట్లు లభించాయి. అంతకుముందు రికార్డు సృష్టించిన కాంగ్రెస్ ఘోరంగా 33కు పడిపోయింది. భాజపా-జనతాదళ్ కలసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొద్దిరోజుల్లోనే జనతాదళ్ ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ కాంగ్రెస్‌లో కలసి పోయారు. అలా మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే అదే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చివరి అధికారం! తమకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తూ 1995లో భాజపా 121 సీట్లతో తొలిసారి గుజరాత్ పీఠాన్ని అధిరోహించింది. కేశూభాయ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కేశూభాయ్ పట్ల వ్యతిరేకత, ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో నరేంద్రమోదీని పార్టీ అధిష్ఠానం గుజరాత్‌కు పంపించటం... ఆయన హయాం మొదలవ్వటం నేటి దాకా జరుగుతున్న చరిత్ర! మోదీ సారథ్యంలో రాష్ట్రంలో భాజపా తిరుగులేని శక్తిగా ఆవిర్భవించినా... ఈ 30 ఏళ్లలో ఆయన ప్రభ ఎంతగా వెలిగినా... 1985లో కాంగ్రెస్ సాధించిన 149 సీట్ల రికార్డును మాత్రం కమలనాథులు ఇంకా బద్దలు కొట్టలేదు.
ఆ ఏడు నెగ్గేదెలా?
ఈ రికార్డుతో పాటు కొన్ని నియోజకవర్గాలు కూడా భాజపాను ఊరిస్తున్నాయి. ఇన్నిసార్లుగా అధికారంలోకి వస్తున్నా రాష్ట్రంలోని ఏడు నియోజకవర్గాల్లో భాజపా ఇంకా బోణీ కొట్టలేకపోతోంది. మోదీ ప్రభ ఎంతగా వెలిగినా బోర్సాద్, ఝగాడియా, వైరా, మహుధా, ఆంక్లవ్, దనిలిమ్డా, గర్బాడా నియోజకవర్గాల్లో భాజపా ఇప్పటిదాకా విజయం సాధించలేదు. ప్రతి ఎన్నికలోనూ ఈ సీట్లలో కమలనానికి ఓటమే ఎదురవుతోంది. వీటితో పాటు... ఖేడ్‌బ్రహ్మ, దంత, జస్దాన్, ధోరాజి సీట్లలో కూడా సాధారణ ఎన్నికల్లో పార్టీ నెగ్గలేదు. ఉప ఎన్నికల్లో మాత్రం ఇక్కడ గెలుస్తోంది. అందని ద్రాక్షగా ఉన్న ఈ సీట్లన్నింటిలోనూ ఆదివాసీలు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణంగా చెబుతారు. అయితే... ఈసారి ఈ సీట్లలో కొన్నింటిలోనైనా బోణీ కొడతామని భాజపా నమ్మకంతో ఉంది. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయటం తమకు కలసి వచ్చే అవకాశం ఉందని కమలనాథులు భావిస్తున్నారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Dhamki: ‘ధమ్కీ’కి బదులు ఆ సినిమా వేసిన థియేటర్ సిబ్బంది.. ప్రేక్షకులు షాక్
-
Politics News
Kishan Reddy: ఈ ఏడాది దేశానికి, తెలంగాణకు కీలకం: కిషన్‌రెడ్డి
-
Crime News
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
-
Sports News
IND vs AUS : ‘రోహిత్-కోహ్లీ’ మరో రెండు పరుగులు చేస్తే.. ప్రపంచ రికార్డే
-
Politics News
KTR: మన దగ్గరా అలాగే సమాధానం ఇవ్వాలేమో?: కేటీఆర్
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..