కలలోనూ కేసీఆర్‌కు కీడు తలపెట్టను

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీడు చేసే ఆలోచన కలలో కూడా తనకు లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాను ఏనాడు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు.

Updated : 26 Nov 2022 07:24 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
సిట్‌ నోటీసులు అందినట్లు వెల్లడి

ఈనాడు, దిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కీడు చేసే ఆలోచన కలలో కూడా తనకు లేదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తాను ఏనాడు కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆంధ్ర ప్రజలు తెలంగాణకు వలస వస్తున్నారని తాను గతంలోనే పలుమార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్‌ హైదరాబాద్‌ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దారని వెల్లడించినట్లు తెలిపారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న పనికిమాలిన ఆలోచనలు తనకు ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై ఇష్టమున్న వ్యక్తిగా, ఆ ప్రభుత్వానికి హాని చేయాలనే ఆలోచన లేదన్నారు. తెలంగాణలో పని చేస్తూ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస శ్రేణులకు ఆయన సూచించారు. తెలంగాణ సిట్‌ తనకు సీఆర్‌పీసీ 41 కింద తనకు నోటీసు అందచేసిందని, దానికి సమాధానం ఇస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డితో గొడవలు ఉన్నట్లుగా తనకు కేసీఆర్‌తో లేవన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి తన మాట వినే కొందరి అధికారులను ప్రభావితం చేసి ఇటువంటి పనులు చేయిస్తున్నారని ఎంపీ రఘురామ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని