సంక్షిప్త వార్తలు(5)

తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఇప్పటి వరకు పదోన్నతులతో విధులు నిర్వర్తించిన వారిని డిమోషన్‌(రివర్ట్‌) చేయడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated : 26 Nov 2022 05:40 IST

పదోన్నతులు పొందిన వారిని డిమోషన్‌ చేయడం సరికాదు: జీవన్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ విద్యుత్‌ శాఖలో ఇప్పటి వరకు పదోన్నతులతో విధులు నిర్వర్తించిన వారిని డిమోషన్‌(రివర్ట్‌) చేయడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తక్షణమే సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి వారందరినీ యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు జీవన్‌రెడ్డి శుక్రవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ జెన్‌కోకు కేటాయించిన 162 మంది ఉద్యోగుల కోసం పదోన్నతులతో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ఉద్యోగులను డిమోషన్‌(రివర్ట్‌) చేయడం సమంజసం కాదన్నారు.


విజయసాయిరెడ్డి ఫోన్‌ దొరకాలని శ్రీవారిని ప్రార్థించా
మాజీ మంత్రి అయ్యన్న

తిరుమల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో దుష్ట పరిపాలన తొలగిపోవాలని, ఏ2 విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ దొరకాలని శ్రీవారిని ప్రార్థించానని తెదేపా మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. శుక్రవారం వీఐపీ బ్రేక్‌ సమయంలో స్వామిని కుటుంబసభ్యులతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఫోన్‌ దొరికితేనే దిల్లీ లిక్కర్‌ స్కామ్‌, విశాఖ భూదందాల వివరాలు వెల్లడవుతాయన్నారు.


ఆక్వాఫుడ్‌ పార్క్‌ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోండి: సీపీఎం

ఈనాడు, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్‌కు సీపీఎం సీనియర్‌ నాయకుడు మధు లేఖ రాశారు. ‘తుందుర్రు, జొన్నల గరువు, బేతపూడి గ్రామాల్లో కాలుష్యం ఎక్కువగా ఉంది. రాత్రిపూట వెలువడుతున్న విష వాయువులతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తాగునీరు వినియోగానికి పనికిరాకుండా పోతోంది. గతంలో తుందుర్రు గ్రామాన్ని సందర్శించిన సమయంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని మీరు హామీ ఇచ్చారు. ఈ హామీ అమలు కాలేదు. ప్రజలు ఎమ్మెల్యేల వద్దకు వెళ్తే తమకు ఓట్లు వేయలేదని అంటున్నారు. బాధితుల గోడు వినిపించుకోవడం లేదు’ అని పేర్కొన్నారు.


‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించి, విజయవంతం చేయాలని తెదేపా నియోజకవర్గ బాధ్యులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. అంగబలం, అర్థబలం వైకాపాను కాపాడలేవని తెలిపారు. ఎస్‌.కోట, నరసన్నపేట, పెడన నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జులతో చంద్రబాబు శుక్రవారం ముఖాముఖీ మాట్లాడారు. ‘పాలనా వైఫల్యాలతో రాజకీయంగా పతనమయ్యామనే ఆందోళన వైకాపా నేతల్లో నెలకొంది. ప్రతిపక్షాలు, వ్యక్తులు వ్యవస్థల్ని అణచివేసే ధోరణితో ఈ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైకాపా ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగానే ఉన్నారు. దీన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలి’ అని చంద్రబాబు దిశార్దేశం చేశారు. కార్యక్రమంలో ఆయా నియోజకవర్గ ఇన్‌ఛార్జులు కోళ్ల లలితకుమారి, బగ్గు రమణమూర్తి, కాగిత కృష్ణప్రసాద్‌ పాల్గొన్నారు.  


పేదల ఇళ్లపై సీఎంవన్నీ అబద్ధాలే

భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: పేదల ఇళ్ల కోసం ఖర్చు పెట్టిన నిధులపై సీఎం జగన్‌ అబద్ధాలు చెబుతున్నారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. ‘పేదల గృహ నిర్మాణానికి కేంద్రం రూ.4,032 కోట్లు విడుదల చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.2,556 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టింది. రూ.1,476 కోట్లు దారి మళ్లించింది. సమీక్షల్లో మాత్రం రూ.5,635 కోట్లు ఖర్చు పెట్టినట్టు చెబుతున్నారు’ అని సత్యకుమార్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. దీనిపై ఆంగ్లపత్రికలో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని