మంత్రి అప్పలరాజుకు నిరసన సెగ

తమ సమస్యపై మంత్రి సీదిరి అప్పలరాజు సమాధానం చెప్పాలంటూ ఆదివాసీలు నిరసన వ్యక్తం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 26 Nov 2022 04:56 IST

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: తమ సమస్యపై మంత్రి సీదిరి అప్పలరాజు సమాధానం చెప్పాలంటూ ఆదివాసీలు నిరసన వ్యక్తం చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బోయ, వాల్మీకి, బెంతుఒరియాలను ఎస్టీల్లో చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆదివాసీ సంఘాలు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ర్యాలీ నిర్వహించాయి. తొలుత మంత్రి కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రి లేరని తెలుసుకొని పాతజాతీయ రహదారిపైనే కొద్దిసేపు నిరసన తెలిపారు. ర్యాలీ పద్మనాభపురం వద్దకు చేరేసరికి మంత్రి అప్పలరాజు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఆదివాసీ సంఘాల నాయకులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సమయంలో ఆదివాసీ సంఘం నాయకుడు మైక్‌లో మాట్లాడుతుండగా, మైక్‌ మంత్రికి ఇవ్వాలని, మంత్రే సమాధానం చెప్పాలంటూ కొందరు ఆదివాసీలు నినాదాలు చేశారు. దీంతో మంత్రి స్పందిస్తూ ఏ వర్గం నుంచి వినతులు అందినా దానిపై అధ్యయనం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. రెండు రోజుల కిందటే ఆదివాసీ వర్గానికే చెందిన జడ్పీటీసీ సభ్యురాలు చంద్రమ్మ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఈ సమస్యపై వినతిపత్రం కూడా అందజేశామని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని