జగన్‌ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తాడిపత్రిలో అరాచకాలే నిదర్శనం

కరడుగట్టిన ఫ్యాక్షన్‌ నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

Published : 26 Nov 2022 04:56 IST

దాడి చేసి బాధితులపైనే కేసులు పెడతారా?
తాడిపత్రి తెదేపా కౌన్సిలర్లతో చంద్రబాబు  

ఈనాడు డిజిటల్‌, అమరావతి: కరడుగట్టిన ఫ్యాక్షన్‌ నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుందో చెప్పడానికి తాడిపత్రిలో జరుగుతున్న అరాచకాలే నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఎన్నికలు ఓ ప్రహసనంగా మారాయని మండిపడ్డారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తూ తెదేపా కార్యకర్తలను వేధిస్తున్న తాడిపత్రి డీఎస్పీ చైతన్య లాంటి అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో తాడిపత్రి మున్సిపాలిటీ తెదేపా కౌన్సిలర్లతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, ప్రలోభాలు, వేధింపులు, దౌర్జన్యాలను ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన కౌన్సిలర్లను అభినందించారు. ‘జేసీ అస్మిత్‌రెడ్డిపై వైకాపా రౌడీమూకల దాడి ఉన్మాదచర్య. ఇలా చేస్తే తెదేపా వాళ్లు భయపడిపోతారని జగన్‌రెడ్డి భావిస్తున్నారు. కానీ కార్యకర్తలు తిరగబడతారు’ అని చంద్రబాబు తెలిపారు.  

దాడి చేస్తే ఇప్పటివరకు చర్యల్లేవు

మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడి చేస్తే నిందితులపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘భయభ్రాంతులకు గురిచేయడమే వైకాపా వాళ్ల ఉద్దేశం. తాడిపత్రిలో తెదేపా కౌన్సిలర్లను వేధించారు. యాడికిలో తెదేపా సర్పంచి భర్త రామాంజనేయులును యానిమేటర్‌ ఉద్యోగానికి రాజీనామా చేయాలని వైకాపా వాళ్లు ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో విచారణకని తెదేపా వాళ్లను పిలిచి డీఎస్పీ చైతన్య వారి వేళ్లు విరగ్గొట్టారు. ఇలాంటివి కోకొల్లలు. సీఎం సభల్లో బారికేడ్లు పెట్టి, పోలీసులను కాపలా పెడుతున్నా ప్రజలు గోడలు దూకి పారిపోతున్నారు’ అని చంద్రబాబు ఎద్దేవాచేశారు.

పదికి తక్కువ కాకుండా కేసులు: మల్లికార్జున, కౌన్సిలర్‌  

‘తాడిపత్రిలో తెదేపా కౌన్సిలర్లు ఒక్కొక్కరిపై పదికి తక్కువ కాకుండా కేసులున్నాయి. జేసీ ప్రభాకర్‌రెడ్డిపైనే 58 కేసులు పెట్టారు. తాడిపత్రిలో ఓ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళితే ఎమ్మెల్యే కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నాపై దాడి చేశారు. ఈ కేసు విచారణకని పిలిచి డీఎస్పీ చైతన్య అసభ్యంగా దూషించి, నరకం చూపించారు. దీనిపై జిల్లా ఎస్పీకి, రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. డీఎస్పీపై ప్రైవేటు కేసు వేస్తే వైకాపా రౌడీలు మా ఇంటి మీద దాడి చేసి నన్ను చంపబోయారు’ అని కౌన్సిలర్‌ మల్లికార్జున వాపోయారు. తెదేపా వాళ్లను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని మరో కౌన్సిలర్‌ షేక్‌ షావలి తెలిపారు.


గిరిజన గ్రామానికి కరెంటు నిలిపివేయడం దారుణం

తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అల్లూరి జిల్లా పాడేరు మండలం అల్లివరం అనే గిరిజన గ్రామానికి నిలిపేసిన విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ‘‘గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఇచ్చే విద్యుత్తు రాయితీ తొలగించడమే కాకుండా.. రూ.12 వేల బిల్లు కట్టాలనడం అసమంజసం. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి’’ అని శుక్రవారం ఆయన ట్వీట్‌ చేశారు. విద్యుత్తు సరఫరా నిలిపేయడంతో గిరిజనులు పడుతున్న ఇబ్బందులపై ‘ఈటీవీ భారత్‌’లో ప్రచురితమైన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని