టెంకాయ పిలకలా మారిన రుషికొండ

రుషికొండ పర్యావరణంపైనా, ప్రకృతిపైనా అత్యాచారం చేసిన ఘనత వైకాపా నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు.

Updated : 26 Nov 2022 06:23 IST

ప్రస్తుతం పిలక మిగిలింది... చుట్టూ గుండు కొట్టారు
కొండను ధ్వంసం చేసిన నేరం ఊరికే పోదు
విశాఖ అందాలను పోగొట్టిన పాపం వైకాపాదే
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ధ్వజం

ఈనాడు, విశాఖపట్నం: రుషికొండ పర్యావరణంపైనా, ప్రకృతిపైనా అత్యాచారం చేసిన ఘనత వైకాపా నాయకులకు, రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మండిపడ్డారు. కొండను తొలిచి రాష్ట్రప్రభుత్వం ప్రకృతి విధ్వంసానికి పాల్పడిందన్నారు. ‘అందచందాలతో, భోగభాగ్యాలతో కూడిన రిసార్టులు నిర్మించినా సహజసిద్ధమైన రుషికొండను తేగలమా? ఎన్ని వేలకోట్లు ఖర్చుపెట్టినా సహజసిద్ధమైన రుషికొండ మళ్లీ సాధ్యం కాదు. రుషికొండ లేకుండా విశాఖకు అందం లేదు. ఈ కొండను టెంకాయ పిలకలా చేశారు. ఇప్పుడు పిలక మాత్రమే మిగిలింది. చుట్టూ గుండు కొట్టారు. ఆ పాపం ఊరికే పోదు. విశాఖ అందచందాలను పోగొట్టిన ఘనత వైకాపా నాయకులకే దక్కుతుంది. ఇక్కడ నిర్మిస్తున్న రిసార్టును ఎక్కడైనా కట్టుకోవచ్చు’ అని పేర్కొన్నారు. రుషికొండపై పర్యాటకశాఖ నిర్మిస్తున్న ‘పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు’ను శుక్రవారం ఆయన సందర్శించారు. హైకోర్టు ఆదేశాలతో ఆయన ఒక్కరినే నిర్మాణ ప్రాంతానికి పోలీసులు తీసుకెళ్లారు. తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడారు. ‘రుషికొండను చూసేందుకు పర్యాటకశాఖ ఎండీకి ఫోన్‌ చేస్తే మూడు నెలలు గడిపారు. నేను అమెరికాలో ఉండగా ఫోన్‌ చేసి, రమ్మన్నారు. రాలేనని తెలిసే నాకు ఫోన్‌ చేశారు. దీంతో నేను కోర్టుధిక్కరణ వ్యాజ్యం వేశా. అప్పుడుగానీ రానివ్వలేదు. ముఖ్యమంత్రి నివసించే స్థాయి ప్యాలెస్‌ ఏమీ ఇక్కడ లేదు. విలాసవంతమైన గదులు, విల్లాలు, ఫంక్షన్‌ హాళ్లు, డార్మిటరీలు, సర్వీసు కేంద్రాలు, రెస్టారెంట్లు నిర్మిస్తున్నారు’ అని నారాయణ వివరించారు.

సీఎంకు కొండ మొత్తం కావాలి: ‘రుషికొండ నిర్మాణాల వద్దకు ఎవరూ వెళ్లకుండా ఎందుకంత గోప్యత పాటిస్తున్నారు? అతి గోప్యంగా సాగుతున్న నిర్మాణంతో ఏదో జరుగుతోందని నేనూ నమ్మాను. ఇలాంటిచోట సీఎం ఉంటారని నేననుకోను. ఆయనకు కొండ మొత్తం కావాలి. రుషికొండపై నిర్మాణాలు సాంకేతికంగా సరైనదే కావచ్చేమో గానీ... నైతికంగా సబబు కాదు. వాళ్లకు పర్యావరణం గురించి, కాలుష్యం గురించి పట్టదు.. చిల్లరే కావాలి’ అని ఆరోపించారు. సీఎం కార్యాలయం నిర్మిస్తే తప్పేంటని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని విలేకరులు కోరగా ‘అలాంటి తెలివితక్కువ మాటలతోనే పరిస్థితి ఇక్కడివరకు వచ్చింది. మిడిమిడి జ్ఞానంతో ఉన్న మంత్రుల వల్లే ఈ సమస్య’ అని పేర్కొన్నారు. నారాయణ పర్యటన సందర్భంగా రుషికొండకు వెళ్లే ప్రధాన రహదారుల్లో పలుచోట్ల భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. పర్యటన కవరేజీకి వెళ్తున్న మీడియా ప్రతినిధులనూ అడ్డుకున్నారు.

నడుచుకుంటూ వెళ్లిన నారాయణ

నిర్మాణాలున్న ప్రాంతానికి కారులో తీసుకెళ్తామని పోలీసులు చెప్పినా.. ప్రవేశద్వారం దగ్గర నుంచి నడుచుకుంటూనే కొండపైకి వస్తానని నారాయణ చెప్పారు. ప్రవేశద్వారం దగ్గర ఆయన ఫోన్‌ను భద్రతాసిబ్బంది తీసుకున్నారు. పర్యాటకశాఖ ఏఈ రమణ నిర్మాణ వివరాల్ని నారాయణకు వివరించారు. ఫొటోలు తీసుకోనివ్వకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించడంతో నిర్మాణ సంస్థ ప్రతినిధులే ఫొటోలు తీసి నారాయణకు పంపారు.


గత ఎన్నికల్లో భాజపా వల్లే తెదేపా ఓటమి

విశాఖపట్నం (అల్లిపురం), న్యూస్‌టుడే: రుషికొండ పరిశీలన తర్వాత సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అల్లిపురంలోని సీపీఐ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తెదేపా ఓటమికి భాజపా కారణమన్నారు. నాడు కేంద్రం రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. ‘మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్లు సీఎం జగన్‌ ఊపిరి ప్రధాని మోదీ చేతుల్లో ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వం నిలదీసే పరిస్థితి లేదు. ఆర్బీఐ విడుదల చేయకముందే చెన్నైలో శేఖర్‌రెడ్డి నుంచి రూ.2వేల నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శేఖర్‌రెడ్డి సీఎం జగన్‌కు ఫైనాన్షియర్‌’ అని నారాయణ ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ‘రుషికొండను పరిశీలించడానికి ప్రభుత్వం నిరాకరించడాన్ని బట్టి ఏదో దాచిపెడుతోందని అర్థమవుతోంది. 2022-23 సంవత్సరానికి రూ.48వేల కోట్లు అప్పులు తెస్తామన్న ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి గడిచిన ఆరు నెలల్లో రూ.49వేల కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులాంధ్రగా మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని చొప్పించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. దీనికి సీఎం జగన్‌ తోడ్పాటు అందిస్తున్నారు’ అని రామకృష్ణ ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని