ప్రతిపక్షాలను బెదిరించడమే చిత్తూరు ఎస్పీ పనిగా మారింది

చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రతిపక్షాలను బెదిరించడం, కస్టోడియల్‌ టార్చర్‌కు పాల్పడటాన్ని అలవాటుగా మార్చుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Updated : 26 Nov 2022 06:19 IST

డీజీపీకి వర్ల రామయ్య లేఖ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి ప్రతిపక్షాలను బెదిరించడం, కస్టోడియల్‌ టార్చర్‌కు పాల్పడటాన్ని అలవాటుగా మార్చుకున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో తెదేపా శ్రేణులను అణచివేయడమే అజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎస్పీ రిషాంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ డీజీపీకి శుక్రవారం ఆయన లేఖ రాశారు. ‘‘రిషాంత్‌రెడ్డి నర్సీపట్నంలో పనిచేసేటప్పుడు యేలేటి సంతోష్‌ అనే తెదేపా కార్యకర్తను వేధింపులకు గురిచేశారు. సంతోష్‌ పోలీస్‌స్టేషన్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేయగా అతడికి కాళ్లు విరిగిపోయాయి. బాధితుడి తల్లి జాతీయ మానవహక్కుల కమిషన్‌ ఆశ్రయించగా.. సంతోష్‌కు రూ. 2లక్షలు నష్టపరిహారం చెల్లించాలని పోలీసులను ఆదేశించింది. ఉత్తర్వులను ఎస్పీ పెడచెవిన పెట్టారు. ఆగ్రహించిన ఎన్‌హెచ్‌ఆర్సీ డిసెంబర్‌ 5న రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హడావుడిగా బాధితుడికి నష్టపరిహారం అందజేశారు. రిషాంత్‌రెడ్డి కుప్పంలో తెదేపా శ్రేణులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తక్షణం రిషాంత్‌రెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి...’’ అని వర్ల రామయ్య లేఖలో పేర్కొన్నారు.


దేవినేని అవినాశ్‌కు నోటీసులిచ్చే ధైర్యం మహిళా కమిషన్‌కు ఉందా?

తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

వైకాపా మహిళా నేత నడుపుతున్న వ్యభిచార కేంద్రాల వెనుక ఆ పార్టీ నేత దేవినేని అవినాశ్‌ ఉన్నారని విజయవాడలో కోడై కూస్తున్నా మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదని తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు ప్రశ్నించారు. అన్యాయానికి గురైన మహిళలను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శిస్తే నోటీసులు జారీ చేసిన కమిషన్‌కు.. అవినాశ్‌కు నోటీసులిచ్చే ధైర్యముందా అని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని